Begin typing your search above and press return to search.

ఏపీలోనూ సైబ‌ర్ ట‌వ‌ర్‌!

By:  Tupaki Desk   |   23 Aug 2017 8:53 AM GMT
ఏపీలోనూ సైబ‌ర్ ట‌వ‌ర్‌!
X
సైబ‌ర్ ట‌వ‌ర్ పేరు విన్న వెంట‌నే హైద‌రాబాద్ మాదాపూర్ లోని సైబ‌ర్ ట‌వ‌ర్ గుర్తుకు రాక మాన‌దు. ఇప్పుడంటే సైబ‌ర్ ట‌వ‌ర్ చుట్టూ కాంక్రీట్ జంగిల్ గా మారింది కానీ.. ఓ ఇర‌వైఏళ్ల క్రితం ఆ చుట్టుప‌క్క‌ల స‌రైన బిల్డింగ్ లేని ప‌రిస్థితి. ఉమ్మ‌డి ఏపీకి ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు నాయుడు ప‌ని చేసిన స‌మ‌యంలో ఐటీ వృద్ధి కోసం మాదాపూర్ లో ఏర్పాటు చేసిన సిగ్నేచ‌ర్ బిల్డింగ్ గా సైబ‌ర్ ట‌వ‌ర్‌ను చెబుతారు. సైబ‌ర్ ట‌వ‌ర్ నిర్మాణంతో హైద‌రాబాద్ ఐటీకి ఈ భ‌వ‌నం కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచింది. ఈ రోజున ప్ర‌పంచంలో హైద‌రాబాద్ ఐటీకి ప్ర‌త్యేక స్థానం రావ‌టానికి.. దానికి ల్యాండ్ మార్క్ గా నిలిచింది సైబ‌ర్‌ట‌వ‌ర్స్‌.

ఇప్పుడు సైబ‌ర్ ట‌వ‌ర్ పేరిట ఒక భారీ నిర్మాణాన్ని విశాఖ‌లో ఏర్పాటు చేశారు. టెక్ మ‌హీంద్ర కొలువు తీర‌నున్న ఈ కొత్త భ‌వ‌నానికి సైబ‌ర్ ట‌వ‌ర్స్ గా నామ‌క‌ర‌ణం చేశారు. ఎపెటా (ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఐటీ ఏజెన్సీ) నుంచి లీజుకు తీసుకొనిసైబ‌ర్ ట‌వ‌ర్స్ పేరిట నిర్మించిన ఈ భ‌వ‌నాన్ని ఏపీ ఐటీశాఖా మంత్రి నారా లోకేశ్ రేపు (గురువారం) ప్రారంభించ‌నున్నారు.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. హైద‌రాబాద్ లోని సైబ‌ర్ ట‌వ‌ర్స్ ను లోకేశ్ తండ్రి చంద్ర‌బాబు స్టార్ట్ చేస్తే.. ఏపీలోని విశాఖ‌ప‌ట్నంలో ఏర్పాటు చేసిన మ‌రో సైబ‌ర్ ట‌వ‌ర్‌ను ఆయ‌న కుమారుడు మంత్రి హోదాలో ప్రారంభం చేయ‌నుండ‌టం. ఇప్ప‌టికే ఏపీ ఐటీకి కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచిన విశాఖప‌ట్నం.. తాజా సైబ‌ర్ ట‌వ‌ర్ నిర్మాణంతో మ‌రో అడుగు ముందుకుప‌డిన‌ట్లు అవుతుంద‌ని చెప్పొచ్చు. విశాఖ‌లో ప్రారంభం కానున్న సైబ‌ర్ ట‌వ‌ర్ లో ల‌క్ష చ‌ద‌ర‌పు అడుగుల ఖాళీ స్థ‌లం అందుబాటులోకి రానుంది. ఇప్ప‌టికే విప‌రీత‌మైన స్థ‌ల‌భావం ఉన్న ఐటీ కంపెనీల‌కు తాజా సైబ‌ర్ ట‌వ‌ర్స్ ల‌బ్థి చేకూర‌నుంది. ఈ 11 అంత‌స్తుల భారీ భ‌వ‌నం విశాఖ ఐటీకి కేరాఫ్ అడ్ర‌స్ గా నిల‌వ‌నుంది. ప‌లు ఐటీ కంపెనీలను ఆక‌ర్‌షించే వీలుంద‌ని చెప్పొచ్చు. ఐటీని వేగంగా విస్త‌రించ‌టంతో పాటు పెద్ద ఎత్తున ప్ర‌మోట్ చేయ‌టానికి ఈ సైబ‌ర్ ట‌వ‌ర్స్ సాయంగా నిలుస్తుంద‌ని చెబుతున్నారు.

ప్ర‌స్తుతం ఏపీలో రూ.2వేల కోట్ల వార్షిక ట‌ర్నోవ‌ర్ తో ఐటీ ఉత్ప‌త్తుల ట‌ర్నోవ‌ర్ గా చెప్పొచ్చు. తాజా సైబ‌ర్ ట‌వ‌ర్ తో ఐటీ కంపెనీల రాక మ‌రింత పెరుగుతుంద‌న్న అంచ‌నాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇప్ప‌టికే విశాఖ‌లోటెక్ మ‌హీంద్రా.. విప్రో.. హెచ్ ఎస్ బీసీ.. ఐబీఎం.. డ‌బ్ల్యూఎన్ ఎస్ త‌దిత‌ర కంపెనీలు ఉన్నాయి. రానున్న రోజుల్లో మ‌రిన్ని ఐటీ కంపెనీలు రాష్ట్రానికి రావ‌టానికి తాజా సైబ‌ర్ ట‌వ‌ర్స్ సాయంగా నిలుస్తాయ‌ని చెబుతున్నారు.