Begin typing your search above and press return to search.

మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గానికి మ‌జా వ‌చ్చింది !

By:  Tupaki Desk   |   13 March 2019 12:36 PM GMT
మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గానికి మ‌జా వ‌చ్చింది !
X
మంగ‌ళ‌గిరి... రాష్ట్రంలో అత్యంత ప్ర‌ముఖ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇది ఒకటి. రాజ‌ధాని ప్రాంతంలో ఉండ‌టంతో ఖ‌రీదైన‌ - ప్రొటోకాల్ ప‌రంగా కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గంగా కూడా ఇదే. అందుకే ఈ నియోజ‌క‌వ‌ర్గాన్ని ఎవ‌రికో ఇవ్వ‌డం ఎందుకు? అనుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు దానిని త‌న కొడుకు చేతిలో పెట్టారు. అమ‌రావ‌తిలో ప‌ట్టు ఉందని భావించిన ఆ పార్టీ అక్క‌డి నుంచి లోకేష్‌ ను గెలిపించుకుంటే భ‌విష్య‌త్తులో ఒక‌వేళ పార్టీ అధికారం చేప‌ట్ట‌క‌పోయినా రాజ‌ధానిలోని ప్ర‌తి నిర్మాణంలో లోకేష్ పేరు ప్రొటోకాల్ ప‌రంగా రావాల్సిందే. ఇది ప్ర‌ధాన వ్యూహం అని చెబుతున్నారు. దీంతో పాటు లోకేష్ ఉండేది - రేపు పొద్దున పార్టీ వ్య‌వ‌హారాలు చూడాల్సింది కూడా అక్క‌డి నుంచే. దీంతో సొంత స్థానంలో పార్టీ ఉంటే అవ‌స‌ర‌మ‌ని భావించిన‌ట్టున్నారు. ఇక‌పోతే లోకేష్ ఇక్క‌డి నుంచి పోటీ చేయ‌డంతో ఈ నియోజ‌క‌వ‌ర్గంపై అంద‌రికీ ఆస‌క్తి నెల‌కొంది. ఇపుడు దీని ప్ర‌త్యేక‌త‌లు వెతుకుతున్నారు అంద‌రూ.

మంగ‌ళ‌గిరి అసెంబ్లీ స్థానం గుంటూరు జిల్లా ప‌రిధిలో ఉంది. గ‌త ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ ఈ స్థానాన్ని కేవలం 12 ఓట్ల‌తో కోల్పోయింది. 1962లో ఏర్పడిన మంగళగిరి నియోజకవర్గంలో 1985లో తొలిసారి టీడీపీ గెలిచింది. అపుడు ఎంఎస్ ఎస్ కోటేశ్వరరావు కాంగ్రెస్ అభ్యర్థి జమునను ఓడించి టీడీపీ త‌ర‌ఫున గెలిచారు. ఈ స్థానం టీడీపీ చాలా సార్లు ఓడిపోగా... పొత్తుల్లో కొన్నిసార్లు ఇత‌ర పార్టీల‌కు ఇవ్వాల్సి వ‌చ్చింది. చివ‌ర‌కు 2014లో గంజి చిరంజీవి కూడా ఓడిపోయారు. అత్యధికంగా బీసీ ఓటర్లు ఉన్న నియోజకవర్గంలో వైసీపీకి ముందు కాంగ్రెస్‌ కు ప‌ట్టు ఉండేది. ఆ త‌ర్వాత వైసీపీ ఇక్క‌డ బ‌ల‌పడింది.

ఇదీ ఓట్ల-ఓట‌ర్ల‌ తీరు

మొత్తం ఓటర్లు - 2,39,536. ఎస్సీ ఓటర్లు - 50 వేలు. మిగ‌తా ఓట‌ర్లు సంఖ్యా ప‌రంగా చూస్తే వ‌ర‌స‌గా యాదవ - పద్మశాలీ - గౌడ్ - కమ్మ - కాపు సామాజిక వర్గాల వారు ఉంటారు. ఇక్క‌డ క‌చ్చితంగా లోకేష్ ని ఓడిస్తామ‌ని వైసీపీ న‌మ్మ‌కంగా ఉంది. మంగ‌ళ‌గిరి నుండి లోకేష్ పై పోటీకి జూనియ‌ర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాస‌రావును బ‌రిలోకి దించే ప్ర‌తిపాద‌నను వైసీపీ ఆలోచ‌న చేస్తోంది. కొద్ది రోజుల క్రిత‌మే ఆయ‌న వైసిపి లో చేరారు. జ‌గ‌న్ ఎక్క‌డి నుండి పోటీ చేయ‌మ‌ని చెబితే అక్క‌డి నుండి చేస్తాన‌ని ఆయ‌న కూడా వ్యాఖ్యానించారు. ఇది జ‌రిగితే లోకేష్‌ కు క‌ష్ట‌మే. టీడీపీ శ్రేణులు మాత్రం అమ‌రావ‌తి రాజ‌ధాని క‌డుతున్నందున టీడీపీ బంప‌ర్ మెజారిటీతో గెలుస్తుంద‌ని భావిస్తున్నాయి.