Begin typing your search above and press return to search.
మాటే కష్టమైతే... రాత ఎలా లోకేశా?
By: Tupaki Desk | 28 Dec 2017 11:25 AM GMTటీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగానే కాకుండా ఏపీ కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా అతి చిన్న వయసులోనే అవకాశాలు దక్కించుకున్న నారా లోకేశ్... పలు సందర్భాల్లో పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొన్నారు. ఓ కీలక పార్టీకి అధినేతగా ఉన్న నేత కుమారుడిగా - ప్రత్యక్ష ఎన్నికల ద్వారా చట్టసభలకు ఎన్నిక కావాల్సి ఉన్న లోకేశ్... అందుకు విరుద్ధంగా పరోక్ష ఎన్నికల ద్వారా చట్టసభలోకి ఎంట్రీ ఇచ్చి... ఆ వెంటనే మంత్రిగా కూడా కీలక బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పరోక్ష ఎన్నిక ద్వారా ఎమ్మెల్సీగా ఎన్నికై... తన అంతిమ లక్ష్యమైన మంత్రి పదవిని కైవసం చేసుకున్నారని ఆయనపై నాడు విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ విమర్శలను పెద్దగా పట్టించుకోని లోకేశ్... తనదైన శైలిలో మంత్రిగా రాణిద్దామని ఎప్పటికప్పుడు కొత్త యత్నాలు చేస్తూనే ఉన్నారు.
ఏ అంశంపైనా పూర్తిగా స్పష్టత లేని నారా లోకేశ్... ప్రతి అంశంపై మాట్లాడిన సందర్భంగా తడబడ్డారు. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం - మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించే సమయంలోనూ లోకేశ్ నాలిక తడబడింది. ఇదే రీతిలో ఆయన ప్రసంగాన్ని గుర్తుకు తెచ్చుకున్న క్రిటిక్స్... ఇక లోకేశ్ మారడంటూ ఓ గట్టి నిర్ణయానికి వచ్చేశారు. ఈ క్రమంలో లోకేశ్ ఓ జర్నలిస్టుగా - కాలమిస్టుగా మారిపోయారు. ఏపీలో నిన్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా ప్రారంభమైపోయిన ఏపీ ఫైబర్ నెట్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుపుతూ ఆయన ఏకంగా ఓ ప్రధాన పత్రిక మెయిన్ పేజీలో ఓ పేజీ కాలమ్ రాసేశారు. అది కూడా బైలైన్ తో. ఈ కాలమ్ చూసిన తర్వాత... విశ్లేషకులు మళ్లీ లోకేశ్ వైపు దృష్టి సారించక తప్పలేదు. అసలు ప్రసంగమే సరిగ్గా చేయలేని లోకేశ్ కు ఇంత పెద్ద వ్యాసం రాయడం ఎలా సాధ్యమైందంటూ ఆరా తీయడం మొదలెట్టారు.
ఈ క్రమంలో వారికి ఓ కొత్త సంస్కృతి కనిపించిందట. అదేంటంటే... నిన్నటి పత్రిక కథనంలో లోకేశ్ బైలైన్ తో వచ్చిన కథనం... ఆయన స్వయంగా రాసినది కాకుండా వేరే ఎవరితోనే రాయించుకున్నదిగా ప్రచారం సాగుతోంది. అంతేకాకుండా సదరు కథనాన్ని జర్నలిజంలో కాకలు తీరిన వ్యక్తులతోనే లోకేశ్ రాయించుకుని ఉంటారన్న వాదన కూడా వినిపిస్తోంది. ఈ విషయంలో భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు మార్గాన్ని లోకేశ్ అనుసరిస్తున్నారని తెలుస్తోంది. అయినా ఈ తరహా వాదనకు ఆధారం ఏమిటన్న విషయంలోకి వెళితే... సినీ జగత్తులో ఘోస్ట్ రైటర్స్ అంటూ ఉంటారన్నవిషయం తెలిసిందే కదా. ఇటీవలి కాలంలో జర్నలిజంలోనూ ఘోస్ట్ రైటర్లతో పాటుగా సదరు రైటర్ల కథనాలపై తమ పేర్లు అచ్చు వేయించుకుంటున్న పొలిటీషియన్లు పెరిగిపోతున్నారట. ఈ కోవలోనే వెంకయ్యనాయుడు కూడా నడిచారని - ఏపీ కేబినెట్ విషయానికి వస్తే... జలవనరుల శాఖా మంత్రిగా ఉన్న దేవినేని ఉమామహేశ్వరరావుతో పాటు పలువురు టీడీపీ నేతలు నడుస్తున్నారని. వారి బాటలోనే ఇప్పుడు లోకేశ్ నడిచారని విశ్లేషకులు ఓ ముక్తాయింపునకు వచ్చారట.