Begin typing your search above and press return to search.

పింఛ‌న్ కోసం వ‌చ్చి పండుటాకుల అవ‌స్థ‌లు..ఆదుకున్న పోలీసులు

By:  Tupaki Desk   |   17 April 2020 9:30 AM GMT
పింఛ‌న్ కోసం వ‌చ్చి పండుటాకుల అవ‌స్థ‌లు..ఆదుకున్న పోలీసులు
X
వ‌య‌సు మీద ప‌డింది.. త‌మ సొంత ప‌నులే చేసుకోవ‌డం క‌ష్టం. అలాంటిది అంధుడైన త‌న భ‌ర్త పింఛ‌న్ కోసం ఓ వృద్ధురాలు త‌న భ‌ర్త‌తో పాటు కిలో మీట‌ర్ల మేర న‌డిచి వెళ్ల‌గా నిరాశే మిగిలింది. ఆ ఇద్దరూ బ‌తికేందుకు వ‌చ్చే పింఛ‌నే ఆధారం. ప్ర‌స్తుతం లాక్‌డౌన్ వేళ నెల‌కొన్న ప‌రిస్థితుల‌తో అంధుడైన భర్తతో క‌లిసి ఆ వృద్ధ దంప‌తులు మండుటెండలో ఏకంగా 20 కిలో మీటర్లు కాలినడకన బ్యాంకుకు వచ్చారు. తీరా చూస్తే పని వేళలు పూర్తయి బ్యాంకు మూసి వేసి ఉండ‌డంతో వారు నిరాశ‌కు గుర‌య్యారు. తిరిగెళ్దామంటే ఓపిక లేదు.. పోనీ ఆటో.. బ‌స్సులో వెళ్దామంటే అవి న‌డవ‌డం లేదు. దీంతో రోడ్డు ప‌క్క‌న ప‌డిపోయారు. ఎప్పుడు తిన్నారో గాని ఆ దంప‌తులు అలసిపోయి ఓపిక లేక రాత్రికి రోడ్డు పక్కన నిద్రించారు. ఈ ఘ‌ట‌న మెదక్‌ జిల్లా కౌడిప‌ల్లిలో చోటుచేసుకుంది. అయితే వారిని పోలీసులు ఆదుకుని వారికి కొంత ఆర్థిక స‌హాయం చేసి ప్ర‌శంస‌లు అందుకున్నారు.

చిల్‌ పచెడ్‌ మండలం బండపోతుగల్‌ గ్రామానికి చెందిన దంపతులు మల్లయ్య - పోచమ్మ. మ‌ల్ల‌య్య అంధుడు కావ‌డంతో ఆసరా పింఛ‌న్ కోసం స్వ‌గ్రామం నుంచి 20 కిలో మీట‌ర్ల దూరం ఉన్న కౌడిపల్లి బ్యాంకు బుధ‌వారం వ‌చ్చారు. బ్యాంక్ మూసివేయ‌డంతో రోడ్డు ప‌క్క‌న ఉన్న ఆ వృద్ధ దంప‌తుల అవ‌స్థ‌ల‌ను చూసి నర్సాపూర్‌ పోలీసులు చూసి చలించిపోయారు. సీఐ నాగయ్య - ఎస్‌ ఐలు రాజశేఖర్‌ - సత్యనారాయణ స్పందించి వారితో మాట్లాడారు. వివరాలు తెలుసుకుని బుధవారం రాత్రి స్ట్రేషన్‌ కు తీసుకెళ్లారు. భోజ‌నం పెట్టి వారు నిద్రించ‌డానికి ఏర్పాట్లు చేశారు.

వారి పింఛ‌న్ డ‌బ్బుల‌ను గురువారం బ్యాంకులో ఇప్పించి.. నర్సాపూర్‌ లో బియ్యం - ఇతర నిత్యావసర సరుకులు కొనిచ్చారు. రూ.వెయ్యి న‌గ‌దు స‌హాయం వారికి చేశారు. అనంత‌రం తమ వాహనంలోనే ఆ దంప‌తుల‌ను స్వ‌గ్రామం బండపోతుగల్‌ కు పంపారు. మల్లయ్యకు ఇద్దరు కుమార్తెలు. భర్తను కోల్పోయిన ఒక కుమార్తె పుట్టింట్ లోనే ఉంటోంది. మరోవైపు ఆయనకు ప్రస్తుతం వృద్ధుల పింఛన్‌ రూ.2 వేలే వస్తోంది. దివ్యాంగులకు ఇచ్చే రూ.3 వేలు పింఛను మంజూరు కాలేదు. ఈ విషయమై ఆ వృద్ధ దంపతులకు అవగాహన లేదు.

పోలీసులు చూపిన చొర‌వ‌ను అంద‌రూ అభినందిస్తున్నారు. ఆప‌త్కాలంలో ఆదుకునే నేస్తాలు పోలీసులు అని ప్ర‌శంసిస్తున్నారు. ప్ర‌స్తుతం లాక్‌ డౌన్ స‌మ‌యంలో పోలీసులు అన్నార్తుల‌కు.. అనాథ‌ల‌కు అండ‌గా పోలీసులు ఉంటున్నారు. మూడో సింహంలోని క‌నిపించ‌ని మాన‌వ‌త్వం కోణ‌మే నాలుగో సింహంగా సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. వారికి లాక్‌ డౌన్ స‌మ‌యంలో స‌హ‌క‌రిద్దాం.. క‌రోనాను త‌రిమికొట్టేందుకు పోలీసుల‌తో క‌లిసి ప‌ని చేద్దాం.