Begin typing your search above and press return to search.

పీవీని చేతకానివాడనేసిన సీఎం

By:  Tupaki Desk   |   14 May 2016 10:37 AM GMT
పీవీని చేతకానివాడనేసిన సీఎం
X
మాజీ మంత్రి పీవీ నరసింహరావు రాజకీయ జీవితంలో ఎన్నో రికార్డులు.. బలం లేని ప్రభుత్వాన్ని అయిదేళ్ల పాటు నడిపించిన రాజకీయ చతురుడిగా ఆయనకు పెద్ద పేరుంది. అలాంటి పీవీని కొన్ని విషయల్లో ప్రశంసిస్తూ మరికొన్ని విషయాల్లో తీవ్ర విమర్శలు చేశారు అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్. ముఖ్యంగా బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో పీవీ వ్యవహరించిన తీరును గొగోయ్ తీవ్రంగా తప్పు పట్టారు. బాబ్రీ మసీదు కూల్చివేత విషయంలో పీవీ నరసింహారావుకు తాను లేఖ రాసినా ఆయన పట్టించుకోలేదని ఆరోపించారు. అంతేకాదు.. పీవీకి పార్టీ మీద పట్టు లేదని అంటూ చేతకాని వాడిగా చిత్రీకరించారు.

అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ ‘‘టర్ను ఎరౌండ్- లీడింగ్ ఫ్రం ది ఫ్రంట్’’ పేరుతో రాసిన పుస్తకంలో పీవీ గురించి పేరాల కొద్ది చెప్పుకొచ్చారు. పీవీ నరసిహరావు మంత్రివర్గంలో ఆహార శాఖ మంత్రిగా పనిచేసిన గొగోయ్ ఆనాటి విషయాలను తన పుస్తకంలో ప్రస్తావించారు. బాబ్రీ మసీదు కూల్చివేత నాటి పరిస్థితుల్లో పీవీ వ్యవహరించిన తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే.. మిగిలిన విషయాల్లో మాత్రం పీవీని ఆయన కొనియాడారు. ఆధునిక భావాలు కలిగిన వ్యక్తి అని, ఆయన హయాంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారని, ఏనాడూ మంత్రుల పనిలో వేలుపెట్టేవారు కారని చెప్పారు. అప్పట్లో ఆహార శాఖ మంత్రిగా పనిచేసిన తాను అన్నీ సొంత నిర్ణయాలే తీసుకునేవాడినని.. కేబినెట్లోని మిగతా మంత్రులకూ కూడా పీవీ ఆ స్వేచ్ఛ ఇచ్చారని గొగోయ్ తన పుస్తకంలో రాశారు. అయితే.. బాబ్రీ కూల్చివేత సమయంలో మైనారిటీ నేతలను పీవీ తన విశ్వాసంలోకి తీసుకుని ఉంటే బాగుండేదని గొగోయ్ అభిప్రాయపడ్డారు. బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాతే మైనారిటీలు కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారని.. అది పీవీ చేసిన పాపమేనని ఆరోపించారు.

కాగా తన రాజకీయ జీవితంలోని ముఖ్యాంశాలతో గొగోయ్ రాసిన ఈ పుస్తకంలో అనేక అంశాలను, పరిణామాలను ప్రస్తావించారు. అన్ని విషయాలు రాసిన గొగోయ్ తన గర్ల్ ఫ్రెండ్, అస్సామీ గాయని అలోక్ పాండే గురించి రాశారో లేదో మరి. అలోక్ పాండే కొద్దికాలంగా గొగోయ్ తో తన అనుభవాల గురించి మీడియాలో చెబుతున్న విషయం తెలిసిందే. ఆమె ముఖ్యమంత్రి నివాసంలో తనకు అణువణువు తెలుసని చెప్పడం.. గొగోయ్ తానంటే పడి చచ్చేవారని చెప్పడం అన్నీ తెలిసిందే.