Begin typing your search above and press return to search.

బాబు కాన్వాయ్ కు దిమ్మ తిరిగే షాకిచ్చిన త‌మ్ముడు

By:  Tupaki Desk   |   19 Aug 2017 8:08 AM GMT
బాబు కాన్వాయ్ కు దిమ్మ తిరిగే షాకిచ్చిన త‌మ్ముడు
X
ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు ఒక‌లా.. అధికార ప‌క్షంలో ఉన్న‌ప్పుడు మ‌రోలా వ్య‌వ‌హ‌రించ‌టం ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు చేత‌నైనంత బాగా మ‌రెవ‌రికీ చేత‌కాదేమో? విప‌క్షంలో ఉన్న‌ప్పుడు పోలీసుల మీదా.. అధికారుల మీదా ఆయ‌న విరుచుకుప‌డేవారు. ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తారేం అంటూ నిల‌దీసేవారు. తాను అధికారంలో ఉండి ఉంటే ఇలా ఉండేది కాద‌ని అసంతృప్తి వ్య‌క్తం చేసేవారు.

ఇదిలా ఉంటే.. బాబు అధికారంలోకి వ‌చ్చాక‌.. ఆయ‌న సెక్యూరిటీ అధికారులు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుకు అధికార‌ప‌క్ష నేత‌లు ప‌లువురు నొచ్చుకోవ‌టంతో పాటు.. అసంతృప్తిని వ్య‌క్తం చేసిన ఉదంతాలు కోకొల్ల‌లు. తాజాగా ఇలాంటి ఉదంత‌మే ఒక‌టి చోటు చేస‌కుంది. టీడీపీకి చెందిన సీనియ‌ర్ నేత‌.. తిరుప‌తి అర్బ‌న్ డెవ‌ల‌ప్‌ మెంట్ అథారిటీ ఛైర్మ‌న్ న‌ర‌సింహ యాద‌వ్ తీవ్ర చ‌ర్య‌కు దిగారు. బాబు సెక్యూరిటీ తీరుపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన ఆయ‌న‌.. సీఎం కాన్వాయ్ ఎదుట త‌న కారును నిలిపి నిర‌స‌న‌కు దిగ‌టం సంచ‌ల‌నంగా మారింది.

ఎంత సెక్యూరిటీ వారి మీద కోపం వ‌స్తే మాత్రం.. ఏకంగా సీఎం కాన్వాయ్‌ కు త‌న వాహ‌నాన్ని అడ్డుపెట్ట‌టం.. అది చేసింది కూడా అధికార‌ప‌క్షానికి చెందిన నేత కావ‌టం గ‌మ‌నార్హం. అస‌లేం జ‌రిగిందంటే.. శుక్ర‌వారం సాయంత్రం విజ‌య‌వాడ నుంచి తిరుప‌తికి వ‌చ్చారు సీఎం చంద్ర‌బాబు. ఆయ‌న్ను క‌లిసేందుకు టీడీపీ నేత‌లు పెద్ద సంఖ్య‌లో గెస్ట్ హౌస్ కి వ‌చ్చారు. మిగిలిన వారిని అనుమ‌తించిన సెక్యురిటీ తుడా (తిరుప‌తి అర్బ‌న్ డెవ‌ల‌ప్ మెంట్ అథారిటీ) ఛైర్మ‌న్ న‌ర‌సింహ‌ను మాత్రం అడ్డుకున్నారు. దీంతో.. ఆయ‌న తీవ్ర ఆగ్ర‌హానికి గుర‌య్యారు.

మీతో కాదు.. ముఖ్య‌మంత్రితోనే తేల్చుకుంటాన‌ని చెప్పి.. సీఎం కాన్వాయ్ ముందు కారును అడ్డుగా పెట్టేశారు. దీంతో భద్ర‌తాధికారులు కాసేపు ఏం చేయాలో అర్థం కాని ప‌రిస్థితి. తిరుప‌తి నుంచి నంద్యాల‌కు బ‌య‌లుదేరాల్సిన స‌మ‌యం కావ‌టంతో కారును తీయాల‌ని ఆదేశించారు. అయిన‌ప్ప‌టికీ.. కారు తీయ‌క‌పోవ‌టంతో దాన్ని తొల‌గించారు. ఏమైనా సొంత పార్టీకి చెందిన నేతే.. అధినేత కాన్వాయ్‌ కి త‌న వాహ‌నం అడ్డుగా నిల‌ప‌టం కాసేపు ఉద్రిక్త ప‌రిస్థితి చోటు చేసుకుంది.