Begin typing your search above and press return to search.

సొంత పార్టీ నేత‌పై ఎమ్మెల్యే దాడి

By:  Tupaki Desk   |   10 Dec 2015 7:15 AM GMT
సొంత పార్టీ నేత‌పై ఎమ్మెల్యే దాడి
X
తెలంగాణ రాష్ర్టంలోని అధికార పార్టీలో కుమ్ములాట‌లు తీవ్ర‌త‌రం అవుతున్నాయి. స్థానికులు-స్థానికేత‌రులుగా విడిపోయిన నాయ‌కులు త‌మదైన శైలిలో వివాదాలు సృష్టిస్తూ ఏకంగా దాడుల‌కు దిగుతున్నారు. కొద్దికాలం క్రితం టీఆర్ ఎస్‌ లో చేరిన కూకట్‌ పల్లి టీడీపీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అనుచరులు స్థానిక టీఆర్ ఎస్ నాయ‌కుడిపై దాడి చేసి వీరంగం సృష్టించారు. ఇదంతా ఆదిప‌త్య పోరుకోసం కానే కాదు కోట్ల విలువైన స్థ‌లం విష‌యంలో ఈ దాడి జ‌రిగింది. ఏకంగా వివాదం ర‌చ్చ‌కెక్కి పోలీస్ స్టేష‌న్ గుమ్మం తొక్కింది.

శేరిలింగంపల్లి నియోజకవర్గం 124 డివిజన్ టీఆర్‌ ఎస్ బీసీ సెల్ అధ్యక్షుడు నర్సింహ్మాచారి ఎమ్మెల్యే కృష్ణారావు నుండి తనకు ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేయ‌డం క‌ల‌ల‌కం సృష్టించింది. సొంత పార్టీ నేత‌పైనే ప్రాణ‌హాని అనేంత ఆరోప‌ణ చేయ‌డంతో జగద్గిరిగ్టుట పోలీస్ స్టేషన్‌ కు టీఆర్‌ ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం ఎల్లమ్మబండలో నివాసముంటున్న నర్సింహ్మాచారి టీఆర్‌ ఎస్ సీనియ‌ర్ నేత‌. ఆల్విన్‌ కాలనీ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి రేసులో ఉన్నాడు. ఆయ‌న డివిజ‌న్ ప‌రిధిలోకి వ‌చ్చే ప్రభుత్వ భూమిలో షెడ్లు వేసుకొని నివసిస్తున్న వారి ఇళ్లపై అర్ధరాత్రి సమయంలో 50 మందికి పైగా ముసుగులు ధరించిన వ్య‌క్తులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. దీనిని నిరసిస్తూ నర్సింహ్మాచారి నిరాహార దీక్ష చేయ‌డ‌మే కాకుండా పక్క డివిజన్ నాయకులు ఈ డివిజన్‌ లో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టవద్దని మూకుమ్మడిగా తీర్మానం చేపించారు. దీన్ని జీర్ణించుకోలేని కూకట్‌ పల్లి ఎమ్మెల్యే అనుచరులు కక్ష పెంచుకొని దాడులకు పాల్పడినట్టు బాధితుడు పేర్కొన్నాడు.

ఎన్నికల విషయంలో మాట్లాడడానికి కృష్ణారావు రమ్మన్నడంటూ ఎమ్మెల్యే ముఖ్య అనుచ‌రుడు కారులో తీసుకువెళ్లి దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచినట్లు తెలిపాడు. వారి బారి నుంచి తప్పించుకొని పోలీసుల వాహనంలో స్టేషన్‌ కు చేరుకున్నట్లు తెలిపాడు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అనుచరుల కబ్జా ఆగడాలను అడ్డుకున్నందుకు చంపుతానని పలుమార్లు బెదిరించాడని "నా రౌడీయిజం ముందు నీ రౌడియిజం ఎంత?" అని దుర్భాషలాడినట్లు నర్సింహ్మాచారి మీడియా ముందు వాపోయాడు.

ఇందులో కొస‌మెరుపు ఏంటంటే మాధ‌వ‌రం అనుచ‌రులు సొంత నియోజ‌క‌వ‌ర్గంలో కాకుండా పక్క‌న ఉన్న శేరిలింగంప‌ల్లిలో స్థలాల‌పై క‌న్నేసి త‌మ‌ను కొట్టార‌ని టీఆర్ ఎస్ నాయ‌కులు ఫిర్యాదు చేయ‌డం! ఎన్నికల సమయంలో టీఆర్‌ ఎస్ పార్టీ పరువును బజారుకీడిస్తున్న కృష్ణారావు తీరుపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామ‌ని, ఆయ‌న‌ ప్రభుత్వ భూముల కబ్జా భూబాగోతాల చిట్టాలను త్వరలో అధిష్టానానికి అందచేస్తామ‌ని మ‌రోవ‌ర్గానికి చెందిన టీఆర్ ఎస్‌ నాయ‌కులు ప్ర‌క‌టించారు. ఇలా టీఆర్ఎస్ నాయ‌కులు సొంత నేత‌ల‌పై దాడులు చేయ‌డం...అధికార పార్టీ వారయి ఉండి ప్ర‌భుత్వ స్థ‌లాల‌ను కైవ‌సం చేసుకోవ‌డంపై దృష్టిసారించ‌డం టీఆర్ఎస్ నేత‌ల శైలికి నిద‌ర్శ‌న‌మ‌ని ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయి.