Begin typing your search above and press return to search.

గవర్నర్‌సాబ్‌ కోరిక; బాబుతో ఫోటో దిగాలన్నాడు

By:  Tupaki Desk   |   11 Jun 2015 5:57 AM GMT
గవర్నర్‌సాబ్‌ కోరిక; బాబుతో ఫోటో దిగాలన్నాడు
X
ఓటుకు నోటు వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ అధినేత.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన విమర్శల బాణాన్ని మొదట తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సంధిస్తే.. తర్వాత బాణాల్ని కొన్నింటిని ఇరు రాష్ట్రాలకు చెందిన గవర్నర్‌ నరసింహన్‌పై గురి పెట్టటం తెలిసిందే. తెలుగుదేశానికి చెందిన ఎమ్మెల్యేని కేసీఆర్‌ తన క్యాబినెట్‌లోకి ఎలా తీసుకుంటారు? దీనికి.. కేసీఆర్‌ ప్రతిపాదనను గవర్నర్‌ ఎలా ఓకే చెబుతారు? ఆయన నేతృత్వంలో ప్రమాణస్వీకారం జరగటం ఏమిటంటూ బాబు ఫైర్‌ కావటం తెలిసిందే.

మరోవైపు.. గవర్నర్‌ నరసింహన్‌ ఏపీకి సహకరించటం లేదని.. తెలంగాణ అధికారపక్షంతో కుమ్మక్కు అయ్యారంటూ తెలుగుతమ్ముళ్లు విమర్శలుచేస్తున్న వేళ.. చంద్రబాబుకు గవర్నర్‌ నరసింహన్‌ ఎదుట పడితే ఎలా ఉంటుంది? ఆ సందర్భంగా సీన్‌ ఏ విధంగా ఉంటుందన్నది ఆసక్తికరమే.

అయితే.. ఈ ఆసక్తికర ఘటన ఒకసారి కాదు.. రెండుసార్లు ఒకేరోజు చోటు చేసుకోవటం ఒక విశేషమైతే.. ఇలాంటి సమయంలో గవర్నర్‌ సాబ్‌ కోరిక మరింత విచిత్రంగా ఉండటం గమనార్హం. ఢిల్లీకి వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు సుడిగాలి పర్యటనగా రాష్ట్రపతి.. ప్రధానమంత్రితో పాటు.. పలువురు కేంద్రమంత్రుల్ని కలుస్తున్న క్రమంలో.. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాధ్‌సింగ్‌తో భేటీ కావాల్సి ఉంది.

అయితే.. ప్రధానిని కలిసిన చంద్రబాబు.. షెడ్యూల్‌కి మించి మాట్లాడటం జరిగింది. మోడీ.. బాబుల భేటీ మొత్తంగా గంట పాటు సాగింది. దీంతో.. బాబు తర్వాత షెడ్యూల్స్‌ దీనికి తగినట్లు ప్రభావం పడ్డాయి. అదే సమయంలో హోంమంత్రి రాజ్‌నాధ్‌ పేషీలో ఉన్న గవర్నర్‌కు పిలుపురావటం.. ఆయన వెళ్లిన కాసేపటికే ఏపీ ముఖ్యమంత్రి రాజ్‌నాధ్‌ పేషీకి రావటం జరిగిపోయాయి.

ఏపీ ముఖ్యమంత్రి వచ్చిన నేపథ్యంలో తమ సమావేశాన్ని వాయిదా వేసి.. చంద్రబాబును ఆహ్వానించే పనిలో రాజ్‌నాధ్‌ పడ్డారు. ఈ సందర్భంగా లోపలి నుంచి బయటకు వచ్చిన నరసింహన్‌కు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు లోపలికి వెళుతూ ఎదురయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు నవ్వుతూ పలుకరించుకున్నారు. ''మీతో ఫోటో దిగాలని ఉంది'' అంటూ విచిత్రమైన కోరికను కోరి.. చంద్రబాబు చేతిని పట్టుకొని అక్కడే ఉన్న ఒక ఫోటోగ్రాఫర్‌కు పోజులిచ్చారు.

ఆ తర్వాత చంద్రబాబు.. కేంద్రహోంమంత్రి రాజ్‌నాధ్‌ను కలుసుకునేందుకు వెళ్లగా.. ఐబీ అధికారుల్ని కలుసుకునేందుకు గవర్నర్‌ వెళ్లిపోయారు. తిరిగి రాజ్‌నాధ్‌ ఛాంబర్‌ నుంచి బయటకు వచ్చిన సమయంలోనే మరోమారు చంద్రబాబుకు గవర్నర్‌ ఎదురుకావటం కాస్తంత విశేషమే. ఓటుకు నోటు వ్యవహారంలో తీవ్ర ఒత్తిడితోఉన్న బాబును.. గవర్నర్‌ కలిసి ఫోటోకి ఫోజు ఇవ్వాలని కోరటం కాస్తంత ఆసక్తికరంగా అనిపించటం లేదు..!