Begin typing your search above and press return to search.

రోజుల వ్య‌వ‌ధిలో ఆ ముగ్గురు ఢిల్లీకి వెళ్లారే?

By:  Tupaki Desk   |   29 Oct 2018 9:30 AM GMT
రోజుల వ్య‌వ‌ధిలో ఆ ముగ్గురు ఢిల్లీకి వెళ్లారే?
X
జాగ్ర‌త్త‌గా త‌ర‌చి చూస్తే.. రెండు తెలుగు రాష్ట్రాల‌కు సంబంధించిన ముగ్గురు ప్ర‌ముఖుల‌కు సంబంధించి ఒక సారూప్య‌త క‌నిపిస్తుంది. గ‌డిచిన మూడు రోజుల వ్య‌వ‌ధిలో ముగ్గురు తెలుగు ప్ర‌ముఖులు..ఆ మాట‌కు వ‌స్తే.. తెలుగు రాజ‌కీయాల్ని త‌మ నిర్ణ‌యాల‌తో తీవ్రంగా ప్ర‌భావితం చేసే ముగ్గురు ముఖ్య ప్ర‌ముఖులు దేశ రాజ‌ధానికి ప్ర‌యాణం పెట్టుకోవ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఇంత‌కీ ఆ ముగ్గురు ప్ర‌ముఖులు ఎవ‌రంటే.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. రెండు రాష్ట్రాల ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌.. తెలంగాణ రాష్ట్ర ఆప‌ద్ద‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌. ఈ ముగ్గురు వ‌రుస పెట్టి ఢిల్లీకి వెళ్ల‌టం గ‌మ‌నార్హం. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. ఈ ముగ్గురు త‌మ ఢిల్లీ ప్ర‌యాణానికి చెప్పిన అంశాలు అతికేట‌ట్లు క‌నిపించ‌వు.

గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ సంగ‌తే చూద్దాం. ఆయ‌న‌.. రెండు తెలుగు రాష్ట్రాల రాజ‌కీయ ప‌రిణామాల్ని కేంద్రానికి చెప్పేందుకు ఢిల్లీకి వెళ్లిన‌ట్లు చెప్పారు. కానీ.. ఇప్పుడు అంత‌గా కొంప‌లు మునిగిపోయే ప‌రిస్థితులేమీ రెండు తెలుగు రాష్ట్రాల్లో లేవ‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు.

కాకుంటే.. ఎక్స్ సీబీఐ చీఫ్ గా ఆయ‌న అవ‌స‌రం ప్ర‌ధాని మోడీకి ఉంద‌న్న విష‌యాన్ని కొట్టి పారేయ‌లేం. ప్ర‌స్తుతం సీబీఐలో నెల‌కొన్న ప‌రిణామాల నేప‌థ్యంలో సీబీఐకి సంబంధించి ఎంతో సీనియ‌ర్ అయిన న‌రసింహ‌న్ స‌ల‌హా కేంద్రానికి ఏమైనా అవ‌స‌ర‌మైందా? అన్న‌ది క్వ‌శ్చ‌న్. ఇదిలా ఉంటే.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు.

ఎందుకిలా అంటే.. కేంద్రం తీరును ఎండ‌గ‌ట్టేందుకు.. ప్ర‌ధాని మోడీపై యుద్ధం ప్ర‌క‌టించేందుకు అని చెప్పుకొచ్చారు. ఇంతా చేసి ఆయ‌న‌.. తెలంగాణ‌లో కాంగ్రెస్‌తో పెట్టుకున్న పొత్తు లెక్క‌ల‌పై కీల‌క స‌మావేశంలో ఆయ‌న పాల్గొన్న‌ట్లు చెబుతున్నారు. అయితే.. దీన్ని ఆధారాల‌తో నిరూపించ‌లేం కానీ.. ఈ ప్ర‌త్యేక‌మైన మీటింగ్ జ‌రిగింద‌న్న‌ది ఖాయ‌మంటున్నారు.

ఇక‌.. మూడో ప్ర‌ముఖుడు ఎవ‌రంటే తెలంగాణ ఆప‌ద్ద‌ర్మ ముఖ్య‌మంత్రి హోదాలో ఉన్న కేసీఆర్‌.. ఆదివారం హుటాహుటిన ఢిల్లీకి ఎందుకు వెళ్లారు? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. కంటి.. పంటి ప‌రీక్ష‌ల కోసం ఆయ‌న ఢిల్లీకి వెళ్లారంటే న‌మ్మ‌శ‌క్యంగా లేద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది. వేర్వేరు కార‌ణాల‌తో ముగ్గురు తెలుగు ప్ర‌ముఖులు ఢిల్లీకి వెళుతున్నారే కానీ.. ఏదో కీల‌కాంశం ఉన్న‌ట్లుగా ప‌లువురు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. అదేమిట‌న్న‌ది ఒక ప‌ట్టాన అర్థం కాని ప‌రిస్థితి నెల‌కొంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.