Begin typing your search above and press return to search.

పేరులో ఉన్న‘దుర్ముఖి’ని ఫీల్ కానక్కర్లేదంట

By:  Tupaki Desk   |   8 April 2016 4:43 AM GMT
పేరులో ఉన్న‘దుర్ముఖి’ని ఫీల్ కానక్కర్లేదంట
X
తెలుగు వారి కొత్త సంవత్సరం వచ్చేసింది. ఇంగ్లీషు వారి కొత్త సంవత్సరం జనవరి ఒకటితో ఆరంభమైనా.. తెలుగు వారికి సంప్రదాయం ప్రకారం కొత్త సంవత్సరం ఉగాది రోజు నుంచే మొదలవుతుంది. కొత్తగా వచ్చే సంవత్సరాన్ని ఏడాదికి ఒక పేరు చొప్పున వ్యవహరించటం తెలిసిందే. ఈ కొత్త సంవత్సరాన్ని ‘‘శ్రీదుర్మిఖి’’నామ సంవత్సరంగా వ్యవహరిస్తారు. పేరులో దుర్మిఖి ఉంది కాబట్టి.. ఎన్ని కష్టాలో అని ఫీల్ కావాల్సిన అవసరం లేదన్న భరోసాను ఇస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్. పురాణాల మీద పట్టు.. సంప్రదాయం..సంస్కృతి మీద విపరీతమైన ఆసక్తిని ప్రదర్శించటమే కాదు.. ఆచరించే విషయంలోనూ ఎంతకూ తగ్గని వైనం ఆయన సొంతం.

అలాంటి ఆయన దుర్ముఖినామ సంవత్సర విశేషాన్ని చెప్పుకొచ్చారు. ‘‘దుర్ముఖి నామ సంవత్సరం అంటే భయపడాల్సిన పని లేదు. ఇది మంచి సంవత్సరమే. దుర్ముఖి అంటే నరసింహావతారం. హిరణ్యకశ్యపుడిని హతమార్చి మంచి చేశారు. కొత్త ఏడాదిలో అంతా మంచే జరుగుతుంది. కలిసిమెలిసి జీవించటం.. భిన్నత్వంలో ఏకత్వంతో రెండు రాష్ట్రాల ప్రజలకు అన్ని రకాలుగా మేలు జరుగుతుంది. ఈ ఏడాది వర్షాలు బాగా పడతాయి. ప్రజల కష్టాలు తీరుతాయి. తెలుగువారందరికి శుభాలే’’ అంటూ గవర్నర్ నరసింహన్ ఈ ఏడాది గురించి చెప్పుకొచ్చారు. సో.. దుర్ముఖి అంటూ ఫీలయ్యే వారు భయపడాల్సిన అవసరం లేదు.