Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ కు ఓపెన్ గా పంచ్ ఇచ్చిన ఆ ముగ్గురు

By:  Tupaki Desk   |   16 Dec 2017 10:02 AM GMT
కేసీఆర్‌ కు ఓపెన్ గా పంచ్ ఇచ్చిన ఆ ముగ్గురు
X
ప్ర‌పంచ తెలుగు మ‌హా స‌భ‌ల కార్య‌క్ర‌మాన్ని అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించాల‌ని త‌ప‌న ప‌డిన తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న ల‌క్ష్యాన్ని కొంత‌మేర సాధించినా.. మ‌రికొంత విష‌యంలో మాత్రం ఎదురుదెబ్బ‌లు త‌ప్ప‌లేదు. త‌న‌కు న‌చ్చినోళ్ల‌ను ఆకాశానికి ఎత్తేస్తూ.. న‌చ్చ‌నోళ్ల‌ను పాతాళానికి తొక్కేసే తీరు కేసీఆర్‌ కు కొత్తేం కాదు. ఇలాంటి ధోర‌ణి ఎల్ బీ స్టేడియం సాక్షిగా ప్ర‌ద‌ర్శించారు. ఈ ఎపిసోడ్‌ లో ఆస‌క్తిక‌ర అంశం చోటు చేసుకుంది. ఆచి తూచి అన్న‌ట్లు లెక్క‌లేసుకొని మ‌రీ పిలిచిన వారి చేతుల్లో అశేష తెలంగాణ ప్ర‌జ‌ల సాక్షిగా పంచ్ లు పడ‌టం గ‌మ‌నార్హం.

పేరుకు ప్ర‌పంచ మ‌హాస‌భ‌లు అయిన‌ప్ప‌టికీ.. వాటిని తెలంగాణ తెలుగు మ‌హా స‌భ‌లుగా మార్చేసిన కేసీఆర్‌.. మ‌రో తెలుగు రాష్ట్రానికి చెందిన ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడ్ని ఆహ్వానించ‌లేదు. సోద‌ర రాష్ట్రానికి చెందిన అధికార‌.. విప‌క్ష నేత‌ను ఆహ్వానిస్తే బాగుండేది. కానీ.. సీమాంధ్ర పొడ అన్న‌ది క‌నిపించ‌కూడ‌ద‌న్న‌ట్లుగా జాగ్ర‌త్త‌లు తీసుకున్నప్ప‌టికీ.. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వెంక‌య్య‌నాయుడు ఉప రాష్ట్రప‌తి హోదాలో ఉండ‌టంతో విశిష్ఠ అతిధిగా వేదిక మీద ఉండాల్సి వ‌చ్చింది.

త‌న‌కు న‌చ్చ‌ని వారిని పేర్ల‌ను ప‌ల‌క‌టానికి సైతం ఇష్ట‌ప‌డ‌ని కేసీఆర్‌.. తెలివిగా వ్య‌వ‌హ‌రించారు. తాను కొన్ని పేర్లు ప్ర‌స్తావించిన‌ప్ప‌టికీ.. ప్ర‌స్తావించ‌ని పేర్లు చాలానే ఉన్నాయ‌ని.. అలా పేర్లు చెప్పుకుంటూ పోతే.. దాంతోనే టైం స‌రిపోతుందంటూ క‌వ‌ర్ చేశారు.

కేసీఆర్ క‌వ‌రింగ్‌ ను ఉప రాష్ట్రప‌తి హోదాలో మాట్లాడిన వెంక‌య్య త‌న ప్ర‌సంగ పాఠంతో కౌంట‌ర్ ఇచ్చేశారు. ఆయ‌న ప‌లు సంద‌ర్భాల్లో తెలుగు అన్న‌ప్పుడు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ప్ర‌ముఖల పేర్లు ప్ర‌స్తావించి కేసీఆర్‌ ను ఉక్కిరిబిక్కిరి చేశారు. ఆ మాట‌కు వ‌స్తే ఒక్క వెంక‌య్య మాత్ర‌మే కాదు.. మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న విద్యాసాగ‌ర్ రావు.. రెండు తెలుగు రాష్ట్రాల‌కు గ‌వ‌ర్న‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న న‌ర‌సింహ‌న్ సైతం త‌మ ప్ర‌సంగాల్లో కేసీఆర్ మాట‌ల‌కు కౌంట‌ర్ ఇవ్వ‌టం క‌నిపించింది.

త‌న ప్ర‌సంగంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన కొంద‌రి పేర్ల‌ను మాత్ర‌మే కేసీఆర్ ప్ర‌స్తావిస్తే.. ముచ్చ‌టప‌డి పిలుచుకున్న ముగ్గురు ముఖ్య అతిదులు త‌మ త‌మ ప్ర‌సంగాల్లో.. తెలుగు మ‌హా స‌భ‌ల సంద‌ర్భంగా ప్రాంతాల‌కు అతీతంగా తెలుగు ప్ర‌ముఖుల ప్ర‌స్తావ‌న తీసుకొచ్చారు. ఏ వేదిక మీద అయితే.. సీమాంద్ర ప్రాంతానికి చెందిన వారి పేర్లు క‌నిపించ‌కూడ‌ద‌ని అనుకున్నారో.. అందుకు భిన్నంగా వారి పేర్లు క‌నిపించ‌టం చూస్తే.. కేసీఆర్‌ కు భారీ కౌంట‌ర్ స‌భా సాక్షిగా ప‌డింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.