Begin typing your search above and press return to search.

అసెంబ్లీలో నారాయ‌ణ కాలేజీలో చ‌నిపోయినోళ్ల లెక్క

By:  Tupaki Desk   |   29 Nov 2017 12:30 PM GMT
అసెంబ్లీలో నారాయ‌ణ కాలేజీలో చ‌నిపోయినోళ్ల లెక్క
X
కార్పొరేట్ కాలేజీల్లో విద్యార్థులు ఆత్మ‌హ‌త్య చేసుకున్న వైనం రోజూ కాకున్నా.. అప్పుడ‌ప్పుడు మీడియాలో క‌నిపిస్తుంటుంది. అలా చ‌నిపోయిన వారిలో ఎక్కువ‌మంది నారాయ‌ణ విద్యాసంస్థ‌ల‌కు చెందిన వారే ఉంటార‌న్న ప్ర‌చారం ఉంది. అందులో నిజం లేద‌ని చెబుతున్నారు ఏపీ అధికార‌ప‌క్ష ఎమ్మెల్యే అనిత‌. కార్పొరేట్ కాలేజీల్లో గ‌డిచిన రెండేళ్ల‌లో చ‌నిపోయిన వారి లెక్క ను అధికారికంగా వెల్ల‌డించారు.

విద్యార్థుల సూసైడ్ మీద ఏపీ అసెంబ్లీలో చ‌ర్చ జ‌రిగింది. ఈ అంశం మీద మాట్లాడిన అధికార‌పార్టీకి చెందిన ఎమ్మెల్యే అనిత‌.. 2016లొ 136 మంది.. 2017లొ 112 మంది విద్యార్థులు మ‌ర‌ణించిన వైనాన్ని ఆమె చెప్పారు. సూసైడ్‌కు కార‌ణాలు వివ‌రిస్తూ త‌క్కువ మార్కుల కార‌ణంగా ఈ ఏడాదిలో ఇప్ప‌టివ‌ర‌కూ 44 మంది ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్నార‌ని వెల్ల‌డించారు.

విద్యార్థుల సూసైడ్ వార్త‌ల్ని మీడియాలో ఎక్కువ‌గా ఫోక‌స్ చేయ‌టం వ‌ల్ల మిగిలిన విద్యార్థులు ప్ర‌భావితం అవుతున్నారని చెప్పారు. విదేశాల్లో ఇలాంటి వాటికి ఎక్కువ ప్ర‌చారం చేయ‌ర‌న్నారు. ఏపీలో నారాయ‌ణ‌.. శ్రీ‌చైత‌న్య విద్యాసంస్థ‌ల‌కు చెందిన విద్యార్థులే ఎక్కువ‌గా మ‌ర‌ణిస్తున్నారంటూ జ‌రుగుతున్న ప్ర‌చారంలో నిజం లేద‌ని పేర్కొన్నారు. ఈ ఏడాది ఇప్ప‌టివ‌ర‌కూ రాష్ట్రంలో 110 మంది విద్యార్థులు మ‌ర‌ణిస్తే.. అందులో 15మంది మాత్ర‌మే నారాయ‌ణ కాలేజీ విద్యార్థులుగా వెల్ల‌డించారు.

ఏపీకి మంత్రిగా ఉన్నార‌న్న ఉద్దేశంతో నారాయ‌ణ‌ను.. ఆయ‌న విద్యాసంస్థ‌ల్ని త‌ప్పు ప‌ట్ట‌టం స‌రికాద‌న్నారు. ఇన్ని మాట‌లు చెప్పిన ఎమ్మెల్యే అనిత‌.. విద్యాసంస్థ‌లు నిబంధ‌న‌ల్ని పాటించ‌టం లేద‌ని.. ఆదివారం కూడా సెల‌వు ఇవ్వ‌టం లేద‌ని.. పండుగ వేళ‌ల్లో కూడా సెల‌వు ఇవ్వ‌కుండా రూల్స్ ను బ్రేక్ చేస్తున్నారన్నారు.

ఇదిలాఉంటే ఈ అంశంపై స్పందించారు మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు. రూల్స్ బ్రేక్ చేస్తున్న విద్యాసంస్థ‌ల‌పై ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంద‌న్నారు. నిబంధ‌న‌ల్ని పాటించ‌ని ప‌లు నారాయ‌ణ‌.. చైత‌న్య క‌ళాశాల‌ల‌కు వివిధ జిల్లాల్లో జ‌రిమానాలు విధిస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. రెండు విద్యాసంస్థ‌ల‌కు రూ.50 ల‌క్ష‌లు చొప్పున జ‌రిమానా విధించిన‌ట్లుగా పేర్కొన్నారు. కాలేజీల్లో నిబంధ‌న‌ల్ని వంద‌శాతం అమ‌లు చేస్తామ‌న్నారు. మొత్తానికి త‌న వియ్యంకుడి విద్యాసంస్థ‌ల‌పై చ‌ర్య‌లు తీసుకోవ‌ట‌మేకాదు.. భారీ ఫైన్ విధించిన‌ట్లుగా గంటా ప్ర‌క‌టించిన మాట‌లు ఓకే కానీ.. వీటితోనే స‌మ‌స్య‌కు ప‌రిష్కారం దొరికిపోతుందా? అన్న‌ది అస‌లు ప్ర‌శ్న‌.