Begin typing your search above and press return to search.

ఆ ఘనత వెంకయ్యదే అంటున్న నారాయణ!

By:  Tupaki Desk   |   11 Sep 2016 4:25 AM GMT
ఆ ఘనత వెంకయ్యదే అంటున్న నారాయణ!
X
గత కొన్ని రోజులుగా ఏపీకి ప్రత్యేక హోదా అనే అంశంపై విమర్శలూ - పోరాటాలు ఒకెత్తు అయితే... అరుణ్ జైట్లీ ప్రకటన - పవన్ సభ తర్వాత పరిస్థితి వేరుగా ఉంది. ఇప్పడు కేంద్ర ప్రభుత్వం పైనా - వెంకయ్య నాయుడుపైనా డైరెక్టుగా కామెంట్స్ పడిపోతున్నాయి. పేరుపెట్టి మరీ నిప్పులు వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో నారాయణ.. వెంకయ్యను టార్గెట్ చేసి తనదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు.

ఇప్పటికే వెంకయ్య చేతిలోనూ ఏమీలేవు - పంచెలోనూ ఏమీ లేవని ఇండరెక్ట్ గా సెటైర్స్ వేసి - తర్వాత క్లారిఫికేషన్ ఇచ్చిన నారాయణ ఈసారి సవాళ్లు విసిరారు. వెంకయ్యకు చేతనైతే ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సవాల్ విసిరారు. ఒక్కసారి కూడా ప్రజల చేత ఎన్నిక కాకుండా పార్లమెంట్‌ లో ప్రవేశించిన ఘనత వెంకయదే అని.. మూడుసార్లు దొడ్డిదారిన కేంద్ర మంత్రి అయిన వెంకయ్యనాయుడికి కమ్యూనిస్టు పార్టీలను విమర్శించే అర్హత లేదని నారాయణ ధ్వజమెత్తారు. ఏనుగు చచ్చినా బతికినా వెయ్యి వరహాలేనని.. కమ్యూనిస్టు పార్టీలు కూడా అంతేనని నారాయణ చెప్పుకొచ్చారు. ప్రజల చేత లోక్‌ సభకు ఎన్నిక కాలేక.. యాచకత్వం ద్వారా కర్ణాటక నుంచి - రాజస్థాన్ నుంచి వెంకయ్య రాజ్యసభకు నామినేటయ్యారని నారాయణ విమర్శించారు.

ఇదే క్రమంలో ఏకకాలంలో లోక్‌ సభ - అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలనే యోచన మంచిదేనని అభిప్రాయపడిన నారాయణ.. మధ్యలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టకుండా చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని సూచించారు.