Begin typing your search above and press return to search.

బోల్డ్ గా బోలెడు విషయాలు చెప్పిన నారాయణ...?

By:  Tupaki Desk   |   7 Feb 2022 4:30 PM GMT
బోల్డ్ గా బోలెడు విషయాలు చెప్పిన  నారాయణ...?
X
ఎర్ర గుర్తుని చూస్తే ఒకపుడు వెర్రెత్తిపోయే తరం ఉండేది. అంత దాకా ఎందుకు నాలుగు దశాబ్దాల వెనక్కు వెళ్తే ఎర్ర సినిమాలు ఎన్నో వచ్చేవి. అవి కమర్షియల్ సినిమాలకు సరిసాటిగా ఆడేవి. అంటే జనాదరణ వాటికి అలా లభించేది అన్న మాట. ఇపుడు చూస్తే వామపక్ష భావజాలాన్ని మోసేవారు అంతా ఒక ఏజ్ కి స్టేజ్ కి వచ్చేసారు. యంగర్ జనరేషన్ లో మోసేది ఎవరు అంటే అది బిగ్ క్వశ్చన్ గానే ఉంది.

ఇలాంటి వేళ సీపీఐ నారాయాణ చాలా విషయాలు మనసు విప్పి మాట్లాడారు. ఆయన తాజాగా ఒక చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసుని విప్పి అసలు విషయాలు చెప్పారు. ఈ రోజుల్లో కమ్యూనిజం ఇంకా ఉందని అంటారా అంటే దానికి ఆయన కూడా కాదు ఉంది అని గట్టిగా అనలేకపోయారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా కమ్యూనిజం మారలేదు అని నారాయణ ఆత్మ పరిశీలన చేసుకున్నారు.

ఇక ఇండియాలో కమ్యూనిజానికి భారతీయీకరణ అవసరమన్నది తన అభిప్రాయమని, కానీ తమ పార్టీ వారికి అది నచ్చలేదని కూడా ఆయన చెప్పడం విశేషం. అన్నీ మారాయి. కమ్యూనిస్టులు మారాలి అని అన్న వారితో ఆయన కూడా ఏకీభవించారు. ఇక అవుట్ డేటెడ్ గా వామపక్షాలు ఉన్నాయన్న దాని మీద కూడా ఆయన మాట్లాడుతూ తాము వర్తమానాన్ని గుర్తించి అడుగులు వడివడిగా వేయలేకపోతున్నామని అన్నారు.

ఇక తమ ఫిలాసఫీ జనాలకు ఎక్కడంలేదని ఆయన ఒప్పేసుకున్నారు. అదే టైమ్ లో తమ బిడ్డలు కూడా ఇటు వైపు ఎందుకు రావడం లేదు అంటే వారికి కమ్యూనిజం అంటే ఇంటెరెస్ట్ ఉన్నా తామే రానీయడంలేదని చెప్పుకున్నారు కానీ వారు ఈనాటి తరానికి ప్రతినిధులు అని పరోక్షంగా అంగీకరించారు. మొత్తానికి దేశంలో వామపక్షాలకు ఫ్యూచర్ ఉందా అన్న దానికైతే ఈ సీనియర్ కామ్రెడ్ ఆశాజనకంగా జవాబు చెప్పలేకపోయారు. అదే సమయంలో తమకు కూడా మంచి రోజులు వస్తాయని చెప్పుకున్నారు.

మోడీని విమర్శించడం కాకుండా ఆల్టర్నేషన్ పాలసీలను జనాల ముందు ఉంచడంలో కామ్రెడ్స్ విఫలం అయ్యారన్న దాని మీద కూడా ఆయనలో అసంతృప్తి ఉందని మాటలలో వ్యక్తం అయింది. ఇక ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులను కూడా వేగంగా గమనించి అమలు చేయడంలో వామపక్షలకు తడబాటు ఉందని ఆయన ఒప్పుకున్నారు.

దేశంలో కామ్రేడ్స్ ఎంతో మంది మేటి నాయకులుగా ఉండగా విదేశాలకు చెందిన వారి ఫోటోలతో తమ మీటింగులు పెట్టుకోవడం వల్ల కూడా జనాలకు చేరలేకపోతున్నామని నారాయణ అన్నారు. మొత్తానికి తాము బాగా వెనకబడ్డామని ఆయన బోల్డ్ గానే చెప్పేశారు. ఇక బూర్జువా పార్టీలతో పొత్తులు అంటే ఎన్నికల ఎత్తుగడగానే చూడాలని ఆయన అన్నా కూడా అక్కడ నుంచి తమ పార్టీ విస్తరణకు చేసుకోవడంలో వామపక్షాలు ఎపుడూ విఫలం అయ్యాయి అన్న దాన్ని కూడా అంగీకరించాల్సిందే.

ఏది ఏమైనా వామపక్షాలకు చందా పార్టీలు అన్న వారు కోట్లు వెనకేసుకున్న దోపిడీ పార్టీలు అని నారాయణ ఎర్రటి మెరుపులూ ఈ ఇంటర్వ్యూలో మెరిపించారు. తమ పార్టీలు ఈ దేశాన ఉండి తీరాల్సిన అవసరం ఉందని చెబుతూనే గతంలోలా పోరాటాలు చేసే సీన్ అయితే ఇపుడు లేదని అన్నారు. సాయుధ పోరాటాలు చేయలేం కదా అంటూ తమ పోరాటాలు జనాలకు చేరకపోవడాన్ని, విజయవంతం కాకపోవడాన్ని ఆయన సమర్ధించుకున్నారు. మొత్తానికి ఏ ఎన్నికకు ఆ ఎన్నికల్లో బూర్జువా పార్టీలతో కలసి సాగుతూ వాటి సిద్ధాంతాలను విమర్శించడంలోని డొల్లతనం వల్లనే కామ్రేడ్స్ ఎదగలేకపోయారు అన్నది మాత్రం నారాయణ ఇండైరెక్ట్ గా చెప్పినట్లు అయింది.