Begin typing your search above and press return to search.

నారాయణ స్కూల్‌ కక్కుర్తి.. రహాస్యంగా తరగతులు

By:  Tupaki Desk   |   25 March 2020 11:30 AM GMT
నారాయణ స్కూల్‌ కక్కుర్తి.. రహాస్యంగా తరగతులు
X
దేశమంతా కరోనా వ్యాప్తి నేపథ్యంలో విద్యాసంస్థలు మూసివేయగా కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు మాత్రం వాటిని బేఖాతర్‌ చేస్తున్నాయి. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోకుండా తమ కాంపిటీషన్‌ ను కొనసాగించేలా విద్యార్థులను పాఠశాలకు రప్పిస్తూ కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన నిబంధనలను బేఖాతర్‌ చేస్తున్నాయి. పరీక్షల సమయం కాబట్టి విద్యార్థులు పరీక్షలు బాగా రాయాలనే ఉద్దేశంతో చాటుమాటుగా తరగతులు కొనసాగిస్తున్నారు. గుంపులుగుంపులుగా ఉంటే కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రమయ్యే అవకాశం ఉండడంతో కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాసంస్థలు మూసివేతకు నిర్ణయించగా వాటిని పట్టించుకోకుండా ప్రైవేటు విద్యాసంస్థలు తమ మార్కులు - వ్యాపారం కోసం విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడేలా వారు తరగతులు నిర్వహిస్తున్నారు. తాజాగా ఇలాంటి కేసే ఆంధ్రప్రదేశ్‌ లో వెలుగులోకి వచ్చింది. దీంతో అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ పాఠశాలపై కఠిన చర్యలు తీసుకోనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ లోని ప్రకాశం జిల్లా కందుకూరులో ప్రభుత్వ ఆదేశాలు పట్టించుకోకుండా నారాయణ పాఠశాల యాజమాన్యం పదో తరగతి విద్యార్థినులకు తరగతులు కొనసాగిస్తున్నారు. అధిక ర్యాంకుల సాధించాలనే ఉద్దేశంతో ఇలాంటి కక్కుర్తిని ప్రదర్శిస్తూ తరగతులు కొనసాగిస్తుండడంతో ప్రజలు మండిపడ్డారు. కందుకూరులోని తూర్పు వడ్డెపాలెంలో అదే పాఠశాలలో పదో తరగతి చదివే ఓ విద్యార్థిని ఇంటిలోనే ఆ పాఠశాల యాజమాన్యం తరగతులు కొనసాగించడం గమనార్హం. ఎలాంటి అనుమానం రాకుండా ఆ విధంగా తరగతులు కొనసాగిస్తూ పదో తరగతి విద్యార్థినులకు పాఠాలు బోధిస్తున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న వార్డు వలంటీర్లు - సచివాలయ ఉద్యోగులు కందుకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఎస్సై తిరుపతిరావు స్పందించి తనిఖీ చేయగా ఒక చిన్న గదిలో సుమారు 25 మంది బాలికలకు తరగతులు నిర్వహిస్తున్నట్లు తేలింది. ఐదు మంది టీచర్లను పోలీస్‌ స్టేషన్‌ కు తరలించారు. దీనిపై వివరాలు సేకరించి కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పగా ఈ పాఠశాలకు విద్యా శాఖ అధికారులు మెమో జారీ చేశారు.