Begin typing your search above and press return to search.

వందకాదు..ఏడాదికి వెయ్యి కోట్లు కావాలంట!

By:  Tupaki Desk   |   6 Nov 2015 10:30 PM GMT
వందకాదు..ఏడాదికి వెయ్యి కోట్లు కావాలంట!
X
రాజకీయాల్లో ఓటు బ్యాంకు మీద కన్నేసి సంక్షేమ పథకాలు ప్రకటించకుండా ఏ పార్టీ కూడా మనగలగడం అనేది అసాధ్యం. చంద్రబాబునాయుడు, తెలుగుదేశం పార్టీ అందుకు అతీతం ఎంతమాత్రమూ కాదు. అందుకే గత సార్వత్రిక ఎన్నికల సమయంలో.. చంద్రబాబునాయుడు రాష్ట్రంలో మెజారిటీ కులాల్లో ఒకటిగా ఉన్న కాపులను తెలుగుదేశానికి అనుకూలంగా మలచుకోవడానికి వారిని బీసీల్లో చేర్చే అంశం గురించి హామీ ఇచ్చాడు. అలాగే కాపుల సంక్షేమానికి ఏటా నిధులు ఇస్తామంటూ వెల్లడించారు. ఆ హామీలే పనిచేశాయో, పవన్‌ కల్యాణ్‌ ఫ్యాక్టర్‌ ఉపయోగపడిందో... ఏది ఏమైనప్పటికీ.. చంద్రబాబునాయుడు గద్దె ఎక్కారు.

కొంత ఆలస్యంగా అయినా కాపులకు ఇచ్చిన హామీలు ఆయనకు గుర్తుకు వచ్చాయి. ఒకవైపు భాజపా కూడా ఏపీలో కాపుల్ని అక్కున చేర్చుకుని.. ఆ కులానికి ఆధరవు అయిన పార్టీగా విస్తరించాలని వ్యూహరచన సమయంలో చంద్రబాబునాయుడు రాజకీయంగా తన తురుపుముక్క అస్త్రాన్ని బయటకు తీశారు. కాపుల్ని బీసీల్లో చేర్చడానికి కమిషన్‌ వేయబోతున్నట్లు ప్రకటించారు. తక్షణం కాపుల అభివృద్ధికి వంద కోట్లు కేటాయిస్తూ, అది అయిపోగానే మళ్లీ కేటాయిస్తాం అని కూడా వెల్లడించారు.

అయితే కాపు సంఘాల్లో మాత్రం పెద్దగా సంతృప్తి వ్యక్తం అవుతున్నట్లు లేదు. ఈ మాటలు రాజకీయ ప్రేరేపితాలో ఏమో తెలియదు గానీ.. మొత్తానికి ఇంకా బీసీల్లో చేర్చడం గురించి కమిషన్‌ వేయకపోవడాన్ని కాపు నేతలు తప్పుపడుతున్నారు. కాపుసంఘం అధ్యక్షుడు నారాయణస్వామి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు కేటాయించిన వందకోట్లను కూడా తప్పుపడుతున్నారు. ఒకవైపు వందకోట్ల విడుదల ద్వారా కాపులను ఆకట్టుకునే బ్రహ్మాస్త్రం చంద్రబాబు వేశాడని జనం అనుకుంటూ ఉండగా.. ఏడాదికి వెయ్యికోట్లు ఇవ్వాలని, వందకోట్లు కాపుల అభివృద్ధికి ఏం సరిపోతుందని కాపు నాయకుడు కోరుతున్నారు.

అయినా ప్రభుత్వం తమ హామీలను నిలబెట్టుకునే ప్రయత్నాన్ని ప్రారంభించిన తర్వాత కూడా ఇలాంటి అడ్డగోలు విమర్శలతో విరుచుకుపడడం కరెక్టు కాదేమోనని సామాన్యులు భావిస్తున్నారు. చంద్రబాబునాయుడు ఒక్కటొక్కటిగా అన్నిటినీ చక్కబెడుతున్న సమయంలో.. పనిచేయడం ప్రారంభించిన తర్వాత కూడా రాళ్లేయడం అనేది సబబు కాదని హితవు చెబుతున్నారు.