Begin typing your search above and press return to search.

నాయుడు గారి మీద నారాయణ సానుభూతి

By:  Tupaki Desk   |   19 July 2022 2:30 AM GMT
నాయుడు గారి మీద నారాయణ సానుభూతి
X
బీజేపీలో పాతతరం నెమ్మదిగా తెరమరుగు అయిపోతోంది. వాజ్ పేయ్ అద్వానీ రెండు కళ్లుగా రెండు స్థంభాలుగా ఉంటూ బీజేపీ అనే మొక్కను పెంచి పోషించారు. ఈ రోజు దాని ఫలాలు చాలా మంది అనుభవిస్తున్నారు అంటే నాడు వారిద్దరూ చేసిన కృషి ఫలితమే అంటారు. ఇక వాజ్ పేయ్ చేసిన దానికి దేశానికి ప్రధాని అయ్యారు. అద్వానీ తన సహచరుణ్ణి ప్రధాని కుర్చీలో చూసుకోవాలని తపించిన కారణంగా వాజ్ పేయ్ ఆరేళ్ల పాటు దేశాన్ని పాలించారు.

అదే అద్వానీకి ప్రియ శిష్యుడిగా ఉన్న నరేంద్ర మోడీ మాత్రం అద్వానీని పూర్తిగా పక్కకు తప్పించారు అనే చెబుతారు. 2014 నుంచి 2019 మధ్యలో జస్ట్ ఎంపీగా ఉన్న అద్వానీ ఆ తరువాత ఎన్నికల రాజకీయాలకు దూరం అయ్యారు. ఆయన రాష్ట్రపతి కావాలనుకున్నా కూడా కాకుండా చేశారు అంటారు. ఇక ఆయన అనుంగు అనుచరుడుగా ఉన్న వెంకయ్యనాయుడు విషయంలో చివరికి అదే జరిగింది అని అంటున్నారు.

వెంకయ్యన్నాయుడు ఈ రోజుకీ క్రియాశీల రాజకీయాలు చేయగలిగే స్థాయిలో ఉన్నారు. కానీ ఆయన మాజీ ఉప రాష్ట్రపతిగా శేష జీవితం గడపనున్నారు. ఇక బీజేపీలో వరిష్ట నేత మురళీ మనోహర్ జోషీ వంటి వారు కూడా రెస్ట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. సుష్మా స్వరాజ్ దివంగతులు అయ్యారు కానీ జీవించి ఉంటే ఆమె కూడా సైడ్ అయ్యేవారే అని అంటారు. ఇక ఆ టీమ్ లో మిగిలిన వారిల రాజ్ నాధ్ సింగ్ ఒకరు. వచ్చే ఎన్నికల్లోపు ఆయనను కూడా పక్కన పెడతారు అని అంటున్నారు.

ఇక చూస్తే వెంకయ్యనాయుడుని పక్కన పెట్టడం పట్ల పార్టీలు రాజకీయాలకు అతీతంగా సానుభూతి అయితే వస్తోంది. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అయితే గంగమ్మ జాతరలో అమ్మ వారిని ఊరేగించి జాతర ముగియగానే ఊరవతల పెడతారని, మళ్లీ ఊళ్ళోకి రావద్దని కూడా చెబుతారని అంటూ వెంకయ్యనాయుడుని అలా వాడుకున్నారని సానుభూతి చూపించారు.

వెంకయ్యనాయుడు కనీసం ఉప రాష్ట్రపతి కూడా మరోమారు కాకపోవడానికి ఆయన సమర్ధత కారణం అని నారాయణ విశ్లేషించారు. చురుకుగా ఉండేవారిని ముందుకు రానివ్వరని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అలంకార ప్రాయమైన పదవిలో కూడా వెంకయ్యను ఉంచకపోవడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక విధంగా నారాయణ అని కాదు తెలుగువారు అంతా కూడా మధన పడుతున్న పరిస్థితి. అయితే రెండేళ్ల ముందే బీజేపీ అధినాయకత్వం వెంకయ్యనాయుడు విషయంలో కీలకమైన నిర్ణయం తీసుకుంది దాన్ని ఇపుడు అమలు చేసింది అంటున్నారు.

బీజేపీ ప్రస్తుత అగ్ర నాయకత్వం ఏ రాజకీయ వ్యూహాలతో చేసినా కూడా ఏపీ నుంది దక్షిణాది నుంచి దిగ్గజ నేతగా ఉన్న వెంకయ్యనాయుడుని తప్పించడం మాత్రం విమర్శల పాలు అవుతోంది. రాజకీయ వ్యూహాలు ఉండవచ్చు అదే టైమ్ లో బీజేపీ లాంటి పెద్దగా ఆశలు లేని పార్టీకి దశాబ్దాలుగా సేవ చేసిన వారు ఫలాలు అందుకునే వేళకు సైడ్ కావడం అంటే బాధాకరమే అంటున్నారు. అన్ని వేళ్ళూ మోడీ షాల మీద చూపుతున్న వేళ ఇది ఒకింత ఇబ్బందికరమే అంటున్నారు. ఇక వెంకయ్యనాయుడుకు మాత్రం సానుభూతి వస్తోంది. మరి ఆయన తదుపరి అడుగులు ఎలా ఉంటాయో అన్న చర్చ కూడా సాగుతోంది.