Begin typing your search above and press return to search.

ప్రధాని మోడీ ఇంట్లో ఆ ఆరుగురు ఏం చేశారు?

By:  Tupaki Desk   |   9 Dec 2016 6:09 PM GMT
ప్రధాని మోడీ ఇంట్లో ఆ ఆరుగురు ఏం చేశారు?
X
డీమానిటైజేషన్... నగదు ఉపసంహరణ... దేశంలో తెస్తున్న మార్పు అంతాఇంతా కాదు. పాజిటివ్, నెగటివ్ రెండు రకాల ప్రభావాలనూ చూపిస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తులున్నవారి గుట్టమట్లు బయటపడడానికి ఇది కారణమవుతోంది.. అదే సమయంలో సామాన్యులకు డబ్బు దొరక్క చుక్కలు చూపిస్తోంది. ప్రజల సమయం, డబ్బు ఆదా చేసేలా నగదు రహిత లావాదేవీల దిశగా చురుకుపుట్టిస్తోంది... అదే సమయంలో రోజంతా ఏటీఎంలు, బ్యాంకులు వద్ద పడిగాపులు కాసేలా చేసి విలువైన పని గంటలు వృథా అయ్యేలా చేస్తోంది. ఇన్ని రకాల ప్రభావాలు చూపిస్తున్న డీమానిటైజేషన్ వెనుక మోడీ ఎలాంటి వ్యూహం అనుసరించారు.. అందుకు ఎవరెవరు పనిచేశారు.. ఎక్కడి నుంచి కార్యాచరణ రూపొందించారు.. ఇలాంటి వన్నీ సామాన్య ప్రజలకు సందేహాలుగా మిగిలిపోయినవే. అయితే... వాటన్నిటికీ ఇప్పుడు సమాధానాలు దొరుకుతున్నాయి. ప్రధాని స్వగృహమే కేంద్రంగా ఆరుగురు సభ్యుల బృందం ఈ డీమానిటైజేషన్ ప్లాన్ రచించిందట.

దేశంలో 86 శాతం మేర చలామణీలో ఉన్న 500, 1000 నోట్లను చలామణీ నుంచి తప్పించడమంటే చిన్న విషయం కాదు. అంతటి పెద్ద ప్లానుకు హస్ముఖ్ అధియా అనే అధికారి నేతృత్వం వహించినట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు మరో అయిదుగురు కూడా ప్రధాని ఇంటినే ఆఫీసుగా చేసుకుని మొత్తం కార్యాచరణ తయారుచేశారని తెలుస్తోంది. ఆ ఆరుగురికి రీసెర్చి విద్యార్థులు కొందరు తోడుగా నిలిచారు. వీరంతా ప్రధాని ఇంట్లోని రెండు గదులను ఆఫీసుగా వాడుకుంటూ అత్యంత రహస్యంగా ఆపరేషన్ పూర్తిచేశారు.

హస్ముఖ్ అధియా ఆర్థిక శాఖలో సీనియర్ ఉద్యోగి. మోడీ గుజరాత్ సీఎంగా ఉన్న కాలంలో 2003 నుంచి 2006 మధ్య మోడీ వద్ద ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు. మోడీకి యోగాను పరిచయం చేసింది ఆయనేనట.. యోగా నేర్చుకున్న మోడీ యోగాకు ఫిదా అవడమే కాకుండా అధియాకు కూడా ఫిదా అయిపోయారని చెబుతారు. 2015లో అధియాను కేంద్రంలో రెవెన్యూ సెక్రటరీగా నియమితులయ్యారు. మోడీతో నేరుగా మాట్లాడగలిగే స్థాయి ఉన్న అధికారి అధియా. వారిద్దరూ ఏదైనా ముఖ్యమైన అంశాలపై మాట్లాడుకుంటే గుజరాతీలో చర్చించుకుంటారు.