Begin typing your search above and press return to search.

అన్ని లక్షల దీపాలతో అయోధ్యలో రికార్డు

By:  Tupaki Desk   |   24 Oct 2022 5:42 AM GMT
అన్ని లక్షల దీపాలతో అయోధ్యలో రికార్డు
X
జీవితంలో ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా అయోధ్యలో శ్రీరాముడిని దర్శించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఆ రోజూ ఎంతో దూరంలో లేదన్నారు. ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు అయోధ్యకు తరలివస్తారని చెప్పారు. అయోధ్యకు వచ్చే వారి సంఖ్య చాలా రెట్లు పెరుగుతుందన్నారు.

దీపాల పండుగ దీపావళి సందర్భంగా ప్రధాని మోడీ అయోధ్యలో రాములవారిని సందర్శించుకున్నారు. వేల కోట్ల రూపాయలతో శ్రీరామ నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ జీవితకాలంలో అయోధ్యలో రాముడిని దర్శించాలని కోరారు.

శ్రీరాముడి ఆశీస్సులతో తాను అయోధ్యను దర్శించుకున్నానని ప్రధాని మోడీ తెలిపారు. అయోధ్యలో ఎక్కడ చూసినా.. ఎటు చూసినా అణువణువూ రాముడే కనిపిస్తాడని భావోద్వేగానికి గురయ్యారు. ఎక్కడైతే రాముడు ప్రతి అణువులో ఉంటాడో.. అక్కడి ప్రజలు అందరికీ ఆదర్శంగా ఉండాలని పిలుపునిచ్చారు. రాముడి అందరివాడని.. అయోధ్యకు వచ్చే ప్రతి భక్తుడికి ఇక్కడి వారు స్వాగతం పలకాలని కోరారు.

25 ఏళ్లలో భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని చెప్పారు.

కాగా దీపావళి సంబరాలు అంబరాన్ని తాకాయి. అయోధ్యలో దీపోత్సవ్‌ కార్యక్రమానికి ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా విచ్చేశారు. శ్రీరామ పట్టాభిషేకాన్ని తన చేతుల మీదుగా నిర్వహించారు. సరయూ నదికి ప్రత్యేక హారతి ఇచ్చారు. దీపోత్సవ్‌ సందర్భంగా అయోధ్యలో భక్తులు రికార్డు స్థాయిలో 18 లక్షల దీపాలను వెలిగించారు. సరయూ నది తీరమంతా దీపాల కాంతులతో మెరిసిపోతోంది.

తన పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ శ్రీరామ్‌ లాలాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర నిర్మాణ పనులు ఎంతవరకు వచ్చాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు. వేగంగా ఆలయ నిర్మాణ పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు.

కాగా రామ్‌లీలా సందర్భంగా అయోధ్యలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. రామాయణం థీమ్‌గా లేజర్‌షో అందరిని ఆకట్టుకుంది. హెలికాప్టర్‌లో రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు విగ్రహాలను తీసుకొచ్చారు. ఆ విగ్రహాలకు ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ హారతులిచ్చి స్వాగతం పలికారు. అనంతరం సీతారామ లక్ష్మణ హనుమంతులను ఆసీనులు గావించి ప్రత్యేక పూజా క్రతువులు నిర్వహించారు.

కాగా ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైనికులతో దీపావళి వేడుకలు చేసుకోనున్నారు. ఇందుకోసం ప్రధాని ఇప్పటికే జమ్ముకాశ్మీర్‌లోని కార్గిల్‌ చేరుకున్నారు. కార్గిల్‌లో సైనికులతో కలిసి ప్రధాని మోడీ పండగ సంబరాల్లో పాల్గొంటారని ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఈ మేరకు కార్గిల్‌ చేరుకున్న ప్రధాని ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది.

ఇదిలా ఉండగా 2014లో మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి దీపావళి వేడుకలను సైనికులతో కలిసి చేసుకున్నారు. అప్పటి నుంచి ఏటా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తుండటం విశేషం. దేశ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న జవాన్లతో కలిసి పండగ సంబరాల్లో పాల్గొంటున్నారు. ఇలాగే గతేడాది జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా నౌషేరా సెక్టార్‌లో సైనికులతో కలిసి మోదీ దీపావళి వేడుకల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసారి కార్గిల్‌లో వేడుకలను నిర్వహిస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.