Begin typing your search above and press return to search.

ఆ దేశాధ్యక్షుడ్ని వెంట పెట్టుకొని మోడీ మీటింగ్

By:  Tupaki Desk   |   11 July 2016 5:29 AM GMT
ఆ దేశాధ్యక్షుడ్ని వెంట పెట్టుకొని మోడీ మీటింగ్
X
ఒక దేశ ప్రధాని తన దేశంలో బహిరంగ సభ నిర్వహించటం పెద్ద విషయమే కాదు. కానీ.. విదేశాల్లో బహిరంగ సభ నిర్వహించటం కాస్త కొత్త కాన్సెప్ట్. అయితే.. విదేశంలో ఆ దేశాధ్యక్షుడ్ని వెంట పెట్టుకొని మరీ బహిరంగ సభ నిర్వహించటం కాస్తకు ఊహాకు అందని వ్యవహారం. కానీ.. అలాంటివన్నీ చేయటం ప్రధాని మోడీకి అలవాటే. ఇప్పటివరకూ విదేశాల్లో పలు బహిరంగ సభలు నిర్వహించటం ఒక ఎత్తు అయితే.. తాజాగా ఆ దేశాధ్యక్షుడ్ని వెంట పెట్టుకొని మరీ సభను నిర్వహించటం.. తానే మొత్తంగా వ్యవహరించటం మోడీకే చెల్లుతుంది.

ఇక్కడ మోడీ గొప్పతనం ఎంత ఉంటుందో.. కెన్యా దేశాధ్యక్షుడి మంచితనం కూడా అంతే ఉందని చెప్పాలి. ఎందుకంటే.. తన దేశంలో నివసిస్తున్న విదేశీ ప్రజలు.. తనను వదిలేసి.. తమ మూలాలున్న వ్యక్తి చుట్టపు చూపుగా దేశానికి వచ్చి.. బహిరంగ సభ పెడితే జయజయధ్వానాలు చేయాటాన్ని హుందాగా తీసుకోవటం చిన్న విషయమేమీ కాదు. ప్రాంతాల మధ్య.. జాతుల మధ్య సంఘర్షణలు నెలకొన్న వేళ.. అందుకు భిన్నంగా ఇలాంటివి గొప్ప విషయాలుగానే చెప్పాలి.

తన ఆఫ్రికా దేశాల పర్యటనలో భాగంగా చివరిగా కెన్యాలో పర్యటించారు మోడీ. ఈ సందర్భంగా ఆయన ప్రవాస భారతీయులతో ఒక బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభ మొదలు నుంచి చివరి వరకూ.. ‘‘మోడీ.. మోడీ’’ అంటూ జయజయధ్వానాలు వెల్లువెత్తటం.. అందుకు తగ్గట్లే తనదైన స్టైల్లో గంట పాటు భావోద్వేగంతో ప్రసంగించి సభకు వచ్చిన వారి మనసుల్ని దోచుకున్నారు మోడీ. ఇలా.. అంతు చిక్కని రీతిలో మోడీ వ్యవహరిస్తే.. తన దేశంలో తన ముందే హీరోయిజం ప్రదర్శించిన మోడీ పట్ల ఇగోలకు పోకుండా నవ్వుతూ ఈ కార్యక్రమాన్ని చూసిన కెన్యా దేశాధ్యక్షులు ఉహురు కెన్యట్టా పరిణితిని మెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.