Begin typing your search above and press return to search.

యోగిపై మోడీ ఎందుకు ఫైర‌వుతున్నారు?

By:  Tupaki Desk   |   28 Sep 2017 1:28 PM GMT
యోగిపై మోడీ ఎందుకు ఫైర‌వుతున్నారు?
X
మీడియా క‌వ‌రేజీ ప‌ట్ల ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీ ఎంత ప్రాధాన్యం ఇస్తారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. త‌న ప్ర‌సంగం - కార్య‌క్ర‌మాలు మీడియాలో అద్భుతంగా క‌వ‌రేజీ కావాల‌నే ఆలోచ‌న‌తో పాటుగా ఒక్క వ్య‌తిరేక వార్త వ‌చ్చినా కూడా మోడీజీ స‌హించ‌లేరు. అలాంటిది...ఆయ‌న కీల‌క‌మైన ప‌ర్య‌ట‌న పూర్తిగా సైడ‌యిపోతే...అదే సమయంలో నిర‌స‌న‌లకు అగ్ర‌తాంబూలం ద‌క్కితే మోడీకి మండిపోవ‌డం ఖాయం క‌దా? అలా జ‌ర‌గ‌డం వ‌ల్లే ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ పై తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేసిన‌ట్లు స‌మాచారం.

బీజేపీ అధిష్టానానికి - ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రికి మధ్య సంబంధాలు దెబ్బతింటున్నాయ‌ని ఆ పార్టీ ప‌రిణామాల‌ను విశ్లేషిస్తున్న‌వారు చెప్తున్న‌మాట‌. పాలనాపరమైన అనుభవలేమితో ఆదిత్యనాథ్‌ అనేక అంశాలలో విఫలమవ్వడం పట్ల బీజేపీ అధ్యక్షులు అమిత్‌ షా - ప్రధాని నరేంద్ర మోడీ ఆయనను మందలించినట్లు బీజేపీని విమ‌ర్శ‌నాత్మ‌క కోణంలో చూసే వ‌ర్గాలు అంటున్నారు. ప్రధానంగా బెనారస్‌ హిందూ యూనివర్సిటి (బిహెచ్‌ యు)లో మహిళా విద్యార్ధినులపై పోలీసుల హింసను అరికట్టడంలో విఫలమవ్వడం పట్ల తీవ్రంగా మందలించినట్లు జోరుగా చ‌ర్చ సాగుతోంది. బీహెచ్‌యులో జరిగిన అత్యాచారాన్ని నిరసిస్తూ శనివారం మహిళా విద్యార్థినులు చేస్తున్న ఆందోళనపై యుపి పోలీసులు లాఠీ ఝుళిపించారు. అదే సమయంలో తన నియోజకవర్గమైన వారణాసిలో మోడీ పర్యటిస్తున్నారు. పత్రికలు బీహెచ్‌యు అంశాన్ని ప్రముఖంగా ప్రచురించాయి. మోడీ పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రముఖంగా రావలసిన పత్రికలలో బీహెచ్‌ యు సంఘటన రావడంతో యూపీ పాలనలో లోపాల్ని మోడీకి ఎత్తి చూపినట్లయ్యింది.

దేశంలోనే అతి పెద్ద రాష్ట్రంగా ఉన్న యూపీని యోగి అధికారంలోకి వచ్చిన 165 రోజుల్లోనే పాలనాపరంగా తీవ్ర స‌మ‌స్య‌ల్లో చిక్కుకున్నారు. గోరఖ్‌ పూర్‌ - బులెందర్‌ షా ఆసుపత్రులలో 600 మంది పిల్లలు మృతి చెందారు. ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన లక్నో మెట్రో ప్రారంభమైన కొద్ది గంటల్లోనే సాంకేతిక సమస్యతో నిలచిపోయింది. రోమియో స్క్వాడ్‌ ల పేరుతో ప్రేమికులను టార్గెట్‌ చేయడంతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి. ఇటీవల రైతు రుణ మాఫీల విషయంలో యోగి ప్రభుత్వం నవ్వుల పాలైంది. రూపాయి కన్నా తక్కువ మొత్తంలో రుణమాఫీ అయినట్లు కొంతమంది రైతులు పేర్కొనడం యోగి ప్రభుత్వాన్ని అపహాస్యం చేసింది. ఈ సంఘటన ఆదిత్యనాథ్‌ పాలనా సామర్థ్యాన్ని ప్రశ్నించడానికి దారి తీసింది.

ఇదిలా ఉంటే తాజాగా ఆదిత్యనాథ్‌ కు - ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్యకు మధ్య విభేదాలున్నాయని బీజేపీలోని కొన్ని వర్గాలు పేర్కొంటున్నాయి. మౌర్య ఉత్తరప్రదేశ్‌ లోని పరిణామాలపై ఎప్పటికప్పడు సమాచారాన్ని షాకు అందిస్తున్నారు. ఈ ఏడాది జులైలో అమిత్‌ షా మూడు రోజులపాటు లక్నోలో పర్యటించిన సందర్భంగా మౌర్య నివాసంలోనే బస చేశారు. అదే పర్యటనలో భాగంగా యూపీ మంత్ర్రులతో - పార్టీ కార్యకర్తలతో - ఆరెస్సెస్‌ తో ఆదిత్యనాథ్‌ పరోక్షంలో అమిత్‌ షా భేటీ అయ్యారు. ఆ తరువాత పాలనపై దృష్టి పెట్టాలని ఆదిత్యనాథ్‌ కు సూచించారు. ఇద్దరి మధ్య విభేదాలను పక్కన పెట్టి పాలనపై దృష్టి పెట్టాలని ఆదిత్యనాథ్‌ - మౌర్యలను కోరారు. ఆరెస్సెస్‌ అధ్యక్షులు మోహన్‌ భగవత్‌ కూడా ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వానికి కౌన్సిలింగ్‌ ఇచ్చినట్లు ప్రచారం జ‌రిగింది.