Begin typing your search above and press return to search.

రైతుల ఓట్లకోసం బీజేపీ పాపం - వినియోగదారులకు ధరల శాపం!

By:  Tupaki Desk   |   25 Nov 2017 7:35 AM GMT
రైతుల ఓట్లకోసం బీజేపీ పాపం - వినియోగదారులకు ధరల శాపం!
X
గుజరాత్‌ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని రైతులకు మేలు చేసి ఓట్లు రాబట్టుకోవాలనే మోడి ఎన్నికల వ్యూహం వల్ల ఓట్లు రాలతాయో లేదో గాని అటు రైతులకు గిట్టుబాటు కాకపోగా ఇటు వినియోగదారులకు మరింత భారంగా మారే పరిస్థితి నెలకొంది. వంటనూనెల దిగుమతులపై సుంకాలు పెంచండం ద్వారా దేశీయంగా ముఖ్యంగా గుజరాత్‌లో పంటలు పండించే రైతులకు అధిక ధరులు లభించేలా చేస్తే ఎన్నికల్లో రైతులంతా బిజెపికి ఓట్లు వేస్తారని వారిద్దరూ పన్నిన ఎన్నికల వ్యూహం వల్ల రైతులకు గిట్టుబాటు ధర పెరగకపోగా వినియోగదారులపై మాత్రం భారం పెరుగుతోంది. ప్రధాని నిర్ణయం వల్ల దేశ వ్యాప్తంగా వంటనూనె ధరలు పెరిగి వ్యాపారులు లబ్దిపొందనున్నారేగాని అటు రైతులు గాని ఇటు వ్యవసాయం రంగంపై ఆధారపడినవారుగాని ప్రయోజనం పొందే సూచనలు కనిపించడం లేదు. దేశంలో అత్యధిక వంటనూనె గింజలు (ఎడిబుల్‌ ఆయిల్‌ సీడ్స్‌) పండించే రాష్ట్రాల్లో గుజరాత్‌ మొదటి స్థానంలో ఉంది. ప్రధానంగా వేరుశెనగ - సోయాబీన్‌ ఎక్కువగా సాగుచేస్తుంటారు. దేశవ్యాప్తంగా రైతులు సంక్షోభంలో ఉండి గడిచిన రెండు దశాబ్దాల్లో 3.21 లక్షల రైతులు ఆత్మహత్య చేసుకోగా వర్షాదారంగా వంటనూనె గింజలు పండించే రైతులు మరింత సంక్షోభం ఎదుర్కొంటున్నారు. ఇక్కడి రైతులను ఆదుకునేందుకు వారికి గిట్టుబాటు ధర పెరిగే విధంగాచేస్తే ఎన్నికల్లో ఓట్లు పడతాయని మోడి-అమిత్‌ షా ధ్వయం భావించింది.

అందులో భాగంగానే నవంబర్‌ 17న కేంద్ర ప్రభుత్వం వంటనూనెలపై దిగుమతి సుంకాలను గణనీయంగా పెంచింది. క్రూడ్‌ పామాయిల్‌ పై 17 నుంచి 30శాతానికి, రిఫైన్డ్‌ సోయాబీన్‌ ఆయిల్‌పై 25 నుంచి 45 శాతానికి - క్రూడ్‌ సోయాబీన్‌పై 17.5 నుంచి 30శాతానికి పెంచుతూ ఆదేశాలు జారీ అయ్యాయి. సహజంగా దిగుమతి సుంకాలు పెంచితే విదేశాల నుంచి ముఖ్యంగా మలేషియా - ఇండోనేషియా నుంచి దిగుమతి అయ్యే పామాయిల్‌ ధరలు పెరగటం వలన లేదా దిగుమతులు తగ్గటం వల్ల దేశీయంగా ముఖ్యంగా గుజరాత్‌లో ఆ తరువాత అనంతపురం జిల్లాలో పండించే వేరుశెనగా - సోయాబీన్‌ ధరలు పెరుగుతాయి. తద్వారా రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందనేది మార్కెట్‌ ఎకానమీ సూత్రం.

దేశవ్యాప్తంగా రైతులు సంక్షోభంలో ఉన్నట్టుగానే ఆదర్శ రాష్ట్రంగా చెప్పుకునే (మోడల్‌ స్టేట్‌) గుజరాత్‌లోనూ రైతులు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు. దీనికి తోడు పెద్దనోట్ల రద్దు - జీఎస్టీ అమలులోకి రావడం తదితర నిర్ణయాల వల్ల సంక్షోభం తీవ్రస్థాయికి చేరింది. ఫలితంగా ఆ రాష్ట్రంలో రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా వ్లెడవుతోంది. ఇటీవల ఢల్లీలో వివిధ రైతు సంఘాలు నిర్వహించిన ఆందోళనలో గుజరాత్‌ నుంచి కూడా పెద్ద సంఖ్యలోనే రైతులు పాల్గొన్నారు. దీనితో రైతులు తమకు వ్యతిరేకంగా ఉన్నారని గ్రహించిన బిజెపి ప్రభుత్వం దిగుమతి సుంకాలను పెంచింది.

ఆ రాష్ట్ర ఎన్నికలు బిజెపికి ముఖ్యంగా మోడి-అమిత్‌ షా ధ్వయానికి ప్రతిష్టాత్మకంగా మారాయి. 22 ఏళ్ళుగా అధికారంలో ఉన్న బిజెపి పార్టీ, మోడి ప్రధాని అయిన తరువాత రాష్ట్రంలో మొదటి సారి జరిగే ఎన్నికల్లో ఓటమి చవిచూస్తే ఆ ప్రభావం దేశ వ్యాప్తంగా ప్రతికూల పరిస్థితులను క్రమంగా చవిచూడాల్సి రావచ్చని ఆలోచనతోనే ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని తమ శక్తియుక్తులను ఒడ్డి పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే రైతులను బుజ్జగించేందుకు దిగుమతి సుంకాలను గణనీయంగా పెంచారు.

దీని వల్ల గుజరాత్‌ రాష్ట్రంలో ప్రధాన పంట అయిన వేరుశెనగ - సోయాబీన్‌ పంటకు ధరలు పెరుగుతాయి. ప్రస్తుతం పంటలు చేతికి వచ్చాయి. మార్కెట్‌లో విక్రయించుకునే సమయంలోనే ఎన్నికలూ వచ్చాయి. సరైన ధరలు లభించకపోతే, పెట్టిన పెట్టుబడి తిరిగిరాకపోతే ఆ కోపాన్ని ఎన్నికలలో అధికారపార్టీపై చూపించే అవకాశం లేకపోలేదు.

అందుకే ముందు జాగ్రత్తగా సెప్టెంబర్‌ నెలలో గుజరాత్‌ ప్రభుత్వం పంటలకు ధరలు ప్రకటించింది. వేరుశెనగ క్వింటాల్‌ ధర 4500 ప్రకటించగా స్థానిక మార్కెట్‌లో 3000 రూపాయలు పలుకుతోంది. దాదాపు 1500 రూపాయలు తక్కువ ధరకు రైతులు విక్రయిస్తుంటుండగా ప్రభుత్వం దిగివచ్చి 500 రూపాయల బోనస్‌ను ప్రకటించింది. దీనికి కేంద్రం కూడా మద్దతు ప్రకటించింది. అయినప్పటికీ ప్రయోజనం లేనిపరిస్థితుల్లో, నవంబర్‌లో సుంకాలను ప్రభుత్వం పెంచింది. అయితే దీని వల్ల ఆశించిన ఫలితం కనపించడం లేదని గత వారం రోజులుగా మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రభుత్వం సుంకాలను పెంచడం వల్ల ఇండోనేషియా తదితర దేశాల నుంచి దిగుమతి అయ్యే పామాయిల్‌ ధరలు పెరుగుతాయి. దీని వల్ల మార్కెట్‌లో కనీసం అయిదారు శాతం భారం వినియోగదారులపై పడుతుందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేశాయి. గుజరాత్‌ ఎన్నికల కోసం కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల వంటనూనె ధరలు పెరగ్గా రైతులకు ఏమాత్రం ప్రయోజనం కల్పించడం లేదని ఎకనామిక్స్‌ టైమ్స్‌ ఆంగ్ల దినపత్రిక తన విశ్లేషణలో స్పష్టం చేసింది. దిగుమతి సుంకాలు పెంచడం వల్ల వెంటనే రైతులు విక్రయించుకునే తమ పంట ఉత్పత్తుల ధరు పెరగాలి. కానీ గత వారం రోజుల్లో పెరగకపోగా కనీస మద్దతు ధరకన్నా 15 నుంచి 25శాతం తక్కువకే రైతులు అమ్ముకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు గిట్టుబాటు ధర లభించక సంక్షోభంలో ఉన్నారని, వారికి కనీస మద్దతు ధర లభించడం లేదని సోయాబీన్‌ ప్రాసెస్‌ ఆఫ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌ దేవిష్‌ జైన్‌ స్పష్టం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా వంటనూనెల దిగుమతిలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. కనీసం 30శాతం దిగుమతులు మనదేశంలోనే ఉంటున్నాయి. రైతులకు గిట్టుబాటు ధరలు లభించకపోవడం, దిగుబడులు పెరగకపోవడం లాంటి ప్రధాన సమస్యలు వెంటాడుతూ పంటలు పండిచే రైతులు తీవ్రంగా నష్టపోతుంటే ఆ సమస్యను అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టిపెట్టకుండా సుంకాలను పెంచడం వల్ల వినియోగదారులపై భారం పడుతోందని దీని వల్ల వ్యాపారులు లాభపడుతున్నారని ఆయిల్‌ ట్రేడ్‌ వర్గాలు అంచనా వేయగా అందుకు గత వారం రోజుల మార్కెట్‌ తీరు అర్థం పట్టింది. పైగా ఈ ఏడాది గుజరాత్‌లో వేరుశెనగ పంట అధిక దిగుబడి వచ్చిందని జీజీ పటేల్‌ అండ్‌ నిఖిల్‌ రీసెర్చ్‌ కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ గోవిందభాయ్‌ పటేల్‌ చెప్పుకొచ్చారు. మొత్తం మీద ధరలు పెరిగినప్పటికీ అటు రైతాంగానికి గాని ఇటు వినయోగదారులకు గాని ప్రయోజనం ఉండదు. ఈ నిర్ణయం ఓట్ల పరంగా బిజెపికి రైతులు ఏ విధంగా స్పందిస్తారో ఫలితాలను బట్టే తెలుస్తుంది.

------ఎస్ . వి. రావు