Begin typing your search above and press return to search.

మోడీషా రాజ‌కీయంతో దేశానికి డేంజ‌ర్ ఎంత‌?

By:  Tupaki Desk   |   11 July 2019 7:37 AM GMT
మోడీషా రాజ‌కీయంతో దేశానికి డేంజ‌ర్ ఎంత‌?
X
మీరో సూప‌ర్ మార్కెట్ కు వెళ్లారు. అక్క‌డో స‌బ్బు కొనాల‌నుకున్నారు. ఇప్పుడు వాడుతున్న స‌బ్బు కాకుండా మ‌రింత కొత్త‌గా.. నాణ్య‌మైన స‌బ్బు కోసం వెతుకుతున్నారు. బోలెడ‌న్ని స‌బ్బులు క‌నిపిస్తే.. అందులో ఎవ‌రికి న‌చ్చింది వారు తీసుకుంటారు. అలా కాకుండా. రెండే రెండు స‌బ్బులు.. అందులో ఇప్ప‌టికే వాడుతున్న‌ది ఒక‌టి.. ఇంకొటి మాత్ర‌మే ఉండి.. అయితే దాన్ని లేదంటే దీన్ని మాత్ర‌మే తీసుకోవాలంటే ఎలా ఫీల్ అవుతారు.

మీరో టీవీ కొనాల‌నుకున్నారు. షోరూంకు వెళ్లారు. కేవ‌లం ఒక్క కంపెనీ టీవీలే ఉన్నాయ‌నుకోండి? ఏం చేస్తారు? క‌చ్ఛితంగా మ‌రో షోరూంకు వెళ‌తారు. అలా కాకుండా ఒకే కంపెనీ త‌యారు చేసే వేర్వేరు ర‌కాల టీవీలు మాత్ర‌మే ఉంటాయి. మ‌రే కంపెనీ టీవీ దొర‌క‌దంటే ఎలా ఉంటుంది? ఇదెక్క‌డి అన్యాయం. సొమ్ము నాది. కొనేది నేను. వాడేది నేను. నాకు న‌చ్చిన‌న్ని బ్రాండ్లు మార్కెట్లో ఎందుకు లేవు? అన్న క్వ‌శ్చ‌న్ రాకుండా ఉంటుందా? ఇప్పుడు మోడీషాలు న‌డిపే రాజ‌కీయంతో దేశంలో రానున్న రోజుల్లో బీజేపీ త‌ప్పించి మ‌రే పార్టీ బ‌లంగా ఉండ‌కూద‌న్న‌ట్లుగా ప‌రిస్థితులు మారుతున్నాయి.

ఈ దేశానికి వినాశ‌క‌ర రాజ‌కీయ విధానాల్ని ప‌రిచ‌యం చేసిన ద‌రిద్ర‌పుగొట్టు పార్టీ ఏదైనా ఉందంటే చాలామంది కాంగ్రెస్ వైపు వేళ్లు చూపిస్తారు. ఇన్నేళ్ల కాలంలో చావుతెలివితేట‌ల్ని ప్ర‌ద‌ర్శిస్తూ.. అధికారం త‌న చేతిలో ఉంటే స‌రిపోతుంద‌న్న అత్యాశ త‌ప్పించి.. తాను త‌ప్పించి మ‌రే రాజ‌కీయ పార్టీ మ‌నుగ‌డ‌లోనే ఉండ‌కూద‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించింది లేద‌ని చెప్పాలి. కానీ.. తాజా ప‌రిస్థితి అందుకు భిన్నంగా ఉండ‌టం క‌నిపిస్తుంది.

యూపీఏ హ‌యాంలో ప‌లు రాష్ట్రాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి. మెజార్టీ ఉన్న రాష్ట్రాల జోలికి కాంగ్రెస్ వెళ్లేది కాదు. ఏదైనా తేడా కొడితే త‌న చావు తెలివితేట‌ల‌తో అధికార పీఠాన్ని సొంతం చేసుకోవాల‌నుకునే వారే త‌ప్పించి.. కెలికి మ‌రీ రాష్ట్రంలో అధికారాన్ని హ‌స్త‌గ‌తం చేసుకునే ప్ర‌య‌త్నాలు పెద్ద‌గా చేయ‌లేద‌ని చెప్పాలి. కానీ.. తాజాగా చూస్తే.. ఒకేసారి లాంటివి ప‌లు రాష్ట్రాల్లో చోటు చేసుకోవ‌టం చూస్తే.. ఎక్క‌డికి పోతున్నామ‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం. మొన్న‌టి వ‌ర‌కూ బెంగాల్ లో సాగుతున్న ర‌చ్చ ఒక ఎత్తు అయితే.. తాజాగా క‌ర్ణాట‌క‌.. సంద‌ట్లో స‌డేమియా అన్న‌ట్లు గోవాలో విపక్షానికి చెందిన ప‌ది మంది (ఉన్న‌దే 17 మంది) బీజేపీలో చేరిపోవ‌టం ద్వారా తిరుగులేని శ‌క్తిగా మారిపోయింది.

ప్ర‌తి రాష్ట్రంలో తాను మాత్ర‌మే అధికారంలో ఉండాల‌నుకోవ‌టం అత్యాశే అవుతుంది. అయితే.. న్యాయ‌బ‌ద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తే.. దాన్ని అర్థం చేసుకోవ‌చ్చు. అలా కాకుండా చేతిలో ఉన్న వ్య‌వ‌స్థ‌ల‌తో తెర వెనుక గూడ‌పుఠాణి జ‌రిపి.. ఎక్క‌డిక‌క్క‌డ అధికార పీఠాన్ని సొంతం చేసుకోవాల‌నుకోవ‌టం స‌రికాదు. ఇలాంటివి మొద‌ట్లో చూసిన‌ప్పుడు చాలా మంది పెద్దగా ప‌ట్టించుకోరు. పోను పోను ఈ ఇష్యూ తీవ్ర‌త పెరిగి పెద్దది కావ‌ట‌మే కాదు.. దేశం మొత్తం త‌మ‌దే అధికారం అన్న వ‌ర‌కూ వెళితే ప‌రిస్థితి ఏంది? ఇవాల్టి మోడీషా ప్లాన్ ను కొన్ని రాష్ట్రాల్లో అమ‌లు చేస్తున్నారు. వాటి త‌ర్వాత మ‌రికొన్ని ప్లానింగ్ లో ఉన్నాయి.

అయితే.. ఇలా అన్నింటిని త‌మ ఖాతాలోకి వేసుకోవ‌టం ఓకే అయినా.. రేపొద్దున ఏదైనా బ‌ల‌మైన శ‌క్తి వ‌చ్చి.. ఇదే రీతిలో త‌మ చేతిలోకి తీసుకుంటూ పోతే ఏం చేయ‌గ‌లం? ఇలాంటి దుష్ట సంప్ర‌దాయాలు.. అల‌వాట్లుగా మారితే దేశానికే ముప్పు. ఇప్ప‌టికే ద‌రిద్ర‌పుగొట్టు రాజ‌కీయం పేరుతో ఆగమాగం చేస్తున్న వేళ‌.. కొత్త త‌ర‌హా రాజ‌కీయాన్ని తెర మీద‌కు తెస్తున్న వారిని తిర‌స్క‌రించాల్సిందే. లేని ప‌క్షంలో.. మ‌న ఆస్తిత్వాన్ని వ‌దిలేసి.. మ‌రేదో మ‌న‌ల్ని ఎక్కి తొక్కుతూ ఉంటుంది. మొద‌ట్లో బాగున్న‌ట్లు అనిపించినా.. త‌ర్వాతి రోజుల్లో అదే పెద్ద శాపంగా మారుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇలాంటి డేంజ‌ర‌స్ రాజ‌కీయాలు దేశానికి అంత అవ‌స‌రం లేద‌న్న మాట చెప్ప‌క త‌ప్ప‌దు. అయిన‌ప్ప‌టికీ ఓకే అంటే.. అందుకు చెల్లించాల్సిన మూల్యం భారీగా ఉంటుంద‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు.