Begin typing your search above and press return to search.

హీరో కాస్తా జీరో అయ్యేలా చేసిన అత్యాశ‌!

By:  Tupaki Desk   |   20 May 2018 4:15 AM GMT
హీరో కాస్తా జీరో అయ్యేలా చేసిన అత్యాశ‌!
X
అత్యాశ అస్స‌లు మంచిది కాదు. ఆ విష‌యాన్ని మ‌రోసారి నిరూపిత‌మైంది. క‌ర్ణాట‌క ఎపిసోడ్‌ను చూసిన‌ప్పుడు మోడీషాల‌కు ఎదురుదెబ్బ త‌గిలేలా చేయ‌ట‌మే కాదు.. దిమ్మ తిరిగిపోయే షాక్ త‌గ‌ల‌టానికి అత్యాశే కార‌ణంగా చెప్ప‌క త‌ప్ప‌దు. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి.. ఏదోలా అధికారాన్ని చేప‌ట్టాల‌న్న తొంద‌ర‌.. తాప‌త్ర‌యం మోడీషాల‌లో కొట్టొచ్చిన‌ట్లు క‌నిపించింది.

ద‌క్షిణాదిన పాగా వేశామ‌న్న పేరు కోసం.. దేశంలో ఏ ప్రాంతంలో అయినా త‌మ‌కు తిరుగులేద‌న్న మాట‌ను అనిపించుకోవ‌టం కోసం మోడీషాలు వేసిన ఎత్తుగ‌డ ఘోరంగా విఫ‌ల‌మైంది. 2019 ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌తిప‌క్షాల్లో నైతిక స్థైర్యాన్ని పెంచే అవ‌కాశాన్ని చేజేతులారా ఇచ్చిన‌ట్లైంది.

యుద్ధంలో ఆత్మ‌విశ్వాసానికి మించిన ఆయుధం మ‌రొక‌టి ఉండ‌దు. ఎంత బ‌లం ఉన్నా.. యుద్ధం చేసే ఆత్మ‌విశ్వాసం మిస్ అయితే ఆటోమేటిక్ గా యుద్ధం ఓడిపోయిన‌ట్లే. ఆ చిన్న పాయింట్ ను మోడీషాలు మిస్ అయ్యార‌నే చెప్పాలి. ప్ర‌భుత్వ బ‌లాన్ని నిరూపించుకోవ‌టానికి కాస్త స‌మ‌యం చేతిలో ఉంటుంద‌న్న పాయింట్ మిస్ కావ‌టం.. దానికి బీజేపీ నేత‌లు సిద్ధం కాక‌పోవ‌టమే స‌మ‌స్య‌గా మారింద‌ని చెప్పాలి.

ఏదో ఒక‌టి చేసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాల‌న్న త‌ప‌న త‌ప్పించి.. మాకు అవ‌కాశం ఉండి కూడా.. అధికారం కోసం అత్యాశ‌కు పోవ‌టం లేదన్న సంకేతాన్ని ప్ర‌జ‌ల్లోకి వెళ్లేలా చేయ‌టం.. మిగిలిన రాజ‌కీయ పార్టీల మాదిరి కాకుండా తాము చౌక‌బారు రాజ‌కీయాలు చేయ‌మ‌ని చెప్పే అద్భుత అవ‌కాశం మిస్ అయ్యింది.

మోడీషాల మీద ప్ర‌జ‌ల్లో ఎలాంటి ఇమేజ్ ఉందో.. అధికారం కోసం వారెంత వ‌ర‌కైనా వెళ‌తార‌న్న పేరు ఉందో.. దానికి త‌గ్గ‌ట్లే వారి అడుగులు ప‌డ‌టం గ‌మ‌నార్హం.ఇదే బీజేపీ కొంప ముంచింద‌ని చెప్పాలి. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవ‌త‌రించి.. అధికారాన్ని చేప‌ట్టడానికి ఎనిమిది సీట్లు త‌క్కువ ప‌డటంతో తాము అధికారాన్ని ఆశించ‌టం లేద‌న్న సంకేతాల్ని పంపి ఉంటే.. బీజేపీ గ్రాఫ్ మ‌రోలా ఉండేది.

కానీ.. చేయాల్సిన ప‌నుల‌న్ని చేసి.. అధికారం కోసం ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించి.. సంప్ర‌దాయాల్ని ప‌క్క‌న పెట్టి మ‌రీ సీఎం కుర్చీలో త‌మ విధేయుడ్ని కూర్చొబెట్టిన మోడీషాలు.. చివ‌ర‌కు చెడ్డ‌పేరు త‌ప్పించి మ‌రింకేమీ సాధించ‌లేక పోయారు. నాడు విలువ‌ల కోసం ప్ర‌ధాని ప‌ద‌వికి 13 రోజుల అనంత‌రం వ‌దిలేసిన వైనాన్ని గుర్తుకు తెస్తున్న బీజేపీ నేత‌లు మ‌రో త‌ప్పు చేశార‌ని చెప్పాలి. నాడు.. బీజేపీకి ఎట్టి ప‌రిస్థితుల్లో అధికారాన్ని ఇవ్వ‌కూడ‌ద‌న్న ఆలోచ‌న‌తో విప‌క్షాల‌న్ని ఏకం కావ‌టం దేశ ప్ర‌జ‌ల‌కు న‌చ్చలేదు. అందుకే త‌ర్వాతి కాలంలో వాజ్ పేయ్ మ‌రోసారి ప్ర‌ధాని అయ్యారు.

తాజా ఎపిసోడ్ అందుకు భిన్న‌మైంది. బ‌లాన్ని నిరూపించుకోలేమ‌ని తెలిసినా బ‌రిలోకి రావ‌టం.. అధికారాన్ని నిలుపుకోవ‌టం కోసం అడ్డ‌మైన దారుల్ని తొక్క‌టం.. చివ‌ర‌కు సీఎంగా ఉన్న య‌డ్యూర‌ప్ప సైతం ప్ర‌లోభాల ప‌రంప‌ర‌కు తెర తీయ‌టం..ఆడియో టేపుల‌తో అడ్డంగా దొరికిపోయిన నేప‌థ్యంలో ప్ర‌జ‌ల్లో ఇమేజ్ కాదు క‌దా.. డ్యామేజ్ జ‌రిగింద‌నే చెప్పాలి.

క‌న్న‌డ ప్ర‌జ‌ల‌కు సేవ చేసే అద్భుత‌మైన అవ‌కాశం త‌న‌కు మిస్ అయ్యిందంటూ.. య‌డ్డీ క‌న్నీరు పెట్టినా.. క‌మ‌ల‌నాథులు త‌ప్పించి మ‌రెవ‌రూ ఫీల్ కాక‌పోవ‌టం వెనుక‌..మోడీషాల అత్యాశ అంద‌రికి అర్థం కావ‌ట‌మే. ఈ ఎపిసోడ్‌ లో య‌డ్యూర‌ప్ప కేవ‌లం ఒక పావు మాత్ర‌మే. దాన్ని న‌డిపించే మాస్ట‌ర్లు మోడీషాలన్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. వారి మీద ఉన్న వ్య‌తిరేక‌త‌.. య‌డ్డీకి శాపంగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.