Begin typing your search above and press return to search.

కశ్మీర్ ఖతం..నెక్ట్స్ హైదరాబాదేనా?

By:  Tupaki Desk   |   8 Aug 2019 4:40 AM GMT
కశ్మీర్ ఖతం..నెక్ట్స్ హైదరాబాదేనా?
X
ఆర్టికల్ 370 రద్దు చేసి కశ్మీర్ ను రెండు ముక్కలు చేసింది బీజేపీ. ఇక కశ్మీర్ రెండు రాష్ట్రాలే కాదు కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా.. సో అక్కడ అధికారమంతా కేంద్రంలోని బీజేపీదే.. మరి బీజేపీ నెక్ట్స్ టార్గెట్ ఏంటనే ప్రశ్న ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే కశ్మీర్ తర్వాత బీజేపీ టార్గెట్ హైదరాబాదేనన్న చర్చ ఇప్పుడు బీజేపీలో సాగుతోంది. మరి హైదరాబాద్ కేంద్రంగా బీజేపీ ఏం చేయబోతుందన్న ప్రశ్న ఇప్పుడు ఉదయిస్తోంది.

రెండోసారి అఖండ మెజార్టీతో గద్దెనెక్కిన మోడీ సర్కారు కేవలం 100 రోజుల్లో ఇంత దూకుడుగా దేశాన్ని పట్టి పీడిస్తున్న పెద్ద సమస్యలను పరిష్కరిస్తూ అందరినీ హడలెత్తిస్తోంది. రావణ కాష్టంలా రగిలే కశ్మీర్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసి భారత్ లో సంపూర్ణ విలీనం చేసి పాకిస్తాన్ కు హెచ్చరికలు పంపింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎవరినీ నోరెత్తకుండా చేసింది. ఇప్పుడు కశ్మీర్ పని అయిపోయింది. మరి నెక్ట్స్ హైదరాబాద్ పై ఫోకస్ చేశాయట బీజేపీ శ్రేణులు..

అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా తాము పనిచేస్తున్నామని అమిత్ షా జమ్మూకశ్మీర్ విభజన బిల్లు సందర్భంగా మాట్లాడుతూ ప్రకటించారు. ఆయన చెప్పిన ప్రకారమే ఏ రాష్ట్రానికి స్వయంప్రతిపత్తి లేకుండా ఆర్టికల్ 370 రద్దు చేశామని ప్రకటించారు. ఒకటే దేశం.. ఒకటే చట్టాన్ని అమలు చేశామంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు అదే అంబేద్కర్ చెప్పిన దేశ రెండో రాజధాని అంశాన్ని బీజేపీ తెరపైకి తీసుకురావడానికి రెడీ అయినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

ఉత్తరాదిన బలంగా ఉన్న బీజేపీ ఇప్పుడు రాజకీయ కోణంలో హైదరాబాద్ ను టార్గెట్ చేసినట్టు సమాచారం. అంబేద్కర్ రాజ్యాంగంలో రాసినట్టు దక్షిణాదిన దేశ రెండో రాజధానిగా హైదరాబాద్ ను చేయబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. దక్షిణాదిలో బీజేపీ బలపడడానికి ‘హైదరాబాద్’ రెండో రాజధాని అంశం బాగా కలిసి వస్తుందని.. అంతేకాక ఉత్తరాది ప్రభావాన్ని దక్షిణాదిలో తగ్గించడానికి.. దక్షిణాది ప్రజలను సంతృప్తి పరచడానికి ఈ ఎత్తుగడ పనిచేస్తుందని మోడీ సర్కారు భావిస్తోందట.. తెలంగాణ - ఏపీ - తమిళనాడు - కేరళలో బీజేపీ బలపడి ప్రజలకు సాన్నిహిత్యం కావడానికి దేశ రెండో రాజధానిగా ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న హైదరాబాద్ అంశాన్ని బీజేపీ ఇప్పుడు తెరపైకి తీసుకొస్తుందన్న ప్రచారం సాగుతోంది.