Begin typing your search above and press return to search.

జోడెద్దులు.. అప్పుడు గుజరాత్ ను, ఇప్పుడు ఇండియాను!

By:  Tupaki Desk   |   1 Jun 2019 6:11 AM GMT
జోడెద్దులు.. అప్పుడు గుజరాత్ ను, ఇప్పుడు ఇండియాను!
X
ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన నేత, అదే సమయంలో ఆ రాష్ట్రానికి హోంమంత్రిగా వ్యవహరించిన నేత.. ఇప్పుడు దేశానికి ప్రధానమంత్రిగా ఒకరు, హోం శాఖ మంత్రిగా మరొకరు అయ్యారు! ముఖ్యమంత్రి-రాష్ట్ర హోంమంత్రి గా వ్యవహరించిన వాళ్లు ఇప్పుడు ప్రధానమంత్రి- దేశ హోం మంత్రి అయ్యారు!

బహుశా జాయింట్ సక్సెస్ విషయంలో ఇదొక పతాక స్థాయి ఉదాహరణ అని చెప్పవచ్చు. 'విజయద్వయం'గా గుర్తింపు పొందిన నరేంద్రమోడీ- అమిత్ షాల సక్సెస్ లో ఇది మరో గొప్ప అంకం అని చెప్పవచ్చు. వీళ్లిద్దరికీ ఆర్ ఎస్ ఎస్ లో పరిచయం అయ్యిందట. అప్పటికి యువకులుగా, ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలుగా వ్యవహరిస్తూ ఒకరికొకరు పరిచయం అయ్యారట మోడీ-అమిత్ షా. ఈ ఇద్దరు గుజరాతీలూ అక్కడ నుంచి దోస్తులుగా సాగారు.

ఆ ప్రయాణంలో ఎన్నో ఆటంకాలను ఎదుర్కొన్నారు. ఇబ్బందులు పడ్డారు. ఒకరి ఎదుగుదల మరొకరికి వరంగా మారింది. ఒకరికి మరొకరు గట్టిగా సహకరించుకున్నారు. ఇప్పుడు ఒకరు ప్రధాని అయితే, మరొకరు నంబర్ టు గా హోంమంత్రి అయ్యారు. ఈ సక్సెస్ ఫుల్ స్నేహితులు, ఇప్పుడు దేశాన్ని నడిపించే కీలక పదవుల్లోకి ఎదిగారు.

నరేంద్రమోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమిత్ షా ఆ రాష్ట్ర హోం మంత్రిగా వ్యవహరించారు. ఆ సమయంలో చాలా వివాదాలు చోటు చేసుకున్నాయి. ప్రత్యేకించి సొహ్రబుద్ధిన్ ఎన్ కౌంటర్ సంచలనంగానిలిచింది. ఆ ఎన్ కౌంటర్ నకిలీది అని, హోంమంత్రిగా అమిత్ షా ఆదేశాల మేరకే అది జరిగిందని దుమారం రేగింది.ఆ కేసులో అమిత్ షా విచారణను ఎదుర్కొనాల్సి వచ్చింది.

ఆ సందర్భంలో అంతా మోడీ ఆయనకు అండగా నిలుస్తూ వచ్చారు. ఇక మోడీకి ప్రధానమంత్రిగా ఎదిగాకా.. మొదట చేసిన పని అమిత్ షాను ఢిల్లీ తీసుకెళ్లిపోవడం.ఆయనకు ఏకంగా బీజేపీ అధ్యక్ష పదవిని కట్టబెట్టి తన నీడగా చేసుకోవడం. మోడీ, అమిత్ షా వేర్వేరు అంటే నమ్మడం కష్టం అనే పరిస్థితి కొనసాగింది గత ఐదేళ్ల పాటు.

ఈ విజయద్వయం మరో విజయాన్ని సాధించింది. ఈ ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నిలిపి మరో సంచలనం రేపింది. ఈ సారి అమిత్ షాకు మోడీ మరింతగా ప్రాధాన్యతను పెంచినట్టే అని చెప్పాలి. ఈ సారి హోంమంత్రి పదవినే ఆయనకు ఇచ్చి తమ స్నేహం ఏ స్థాయిదో చాటి చెప్పారు మోడీ.

బహుశా వారి సక్సెస్ లో ఇది పతాక స్థాయి. ఇక ఈ స్థాయిలో వారు ఎన్నేళ్లు కొనసాగుతారు? ఎన్ని దఫాలు వారి హవా ఈ రేంజ్ లో కొనసాగుతుంది? ఈ విజయం ద్వయం ఎన్నేళ్లు సూపర్ పవర్ గా చలామణి అవుతుందో.. వీళ్లిద్దరూ అత్యంత కీలక పదవుల్లో దేశాన్ని ఎలా ప్రభావితం చేస్తారో!