Begin typing your search above and press return to search.

మోడీషా మాస్ట‌ర్ ప్లాన్: ఆర్నెల్లు.. 16 మంది!

By:  Tupaki Desk   |   7 Jun 2019 4:30 PM GMT
మోడీషా మాస్ట‌ర్ ప్లాన్:  ఆర్నెల్లు.. 16 మంది!
X
నిశితంగా చూస్తే మోడీతో పెట్టుకున్నోళ్లు ఎవ‌రూ బాగు ప‌డిన దాఖ‌లాలు క‌నిపించ‌వు. మోడీకి ఎంతో మేలు చేసి.. ఎందుకో న‌చ్చ‌ని ఆయ‌న గురువు ప‌రిస్థితి ఎలా ఉందో చూస్తున్న‌దే. అలాంటిది మోడీ మీద ఒంటి కాలి మీద లేచి.. దేశం మొత్తం తిరిగి ఎక్క‌డెక్క‌డ వారిని క‌లిపిన టీడీపీ అధినేత చంద్ర‌బాబును ఊరికే వ‌దులుతారా?

ఎన్నిక‌ల్లో ప్ర‌జాతీర్పు ఎలా ఉంటుంద‌న్న సంశ‌యంతో కాస్తంత వెన‌క్కి త‌గ్గిన‌ట్లుగా ఉన్న మోడీ.. ఎన్నిక‌ల ఫ‌లితాల నేప‌థ్యంలో ఏపీకి సంబంధించి భారీ స్కీం ఒక‌టి సిద్ధం చేసిన‌ట్లుగా తెలుస్తోంది. ఏపీలో ఉనికి లేని బీజేపీని రానున్న ఆర్నెల్ల వ్య‌వ‌ధిలో క‌ళ‌క‌ళ‌లాడేలా చేయాల‌న్న త‌లంపులో ఉన్న‌ట్లు చెబుతున్నారు. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్ర‌త్యామ్నాయంగా టీడీపీ అనే స్థానే.. ఆ పార్టీ ప‌ని అయిపోయింద‌న్న భావ‌న క‌లిగే వ్యూహాన్ని సిద్ధం చేసిన‌ట్లుగా స‌మాచారం.

ఆర్నెల్ల వ్య‌వ‌ధిలో టీడీపీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేల‌ను బీజేపీ తీర్థం పుచ్చుకునేలా చేయ‌ట‌మే కాదు.. తెలంగాణ‌లో కాంగ్రెస్ శాస‌న‌స‌భాప‌క్షాన్ని టీఆర్ఎస్ లో ఎలా అయితే విలీనం చేశారో.. ఇంచుమించు అదే విధానాన్ని ఏపీలో బీజేపీ అనుస‌రిస్తుంద‌ని చెబుతున్నారు. అదే జ‌రిగితే.. ఏపీలో టీడీపీ నామ‌మాత్రంగా మార‌ట‌మే కాదు.. ఉనికి కోసం పోరాడాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డటం ఖాయం.

త‌న‌ను ఇప్ప‌టివ‌ర‌కూ ఎవ‌రూ తిట్ట‌నంత ఘాటుగా తిట్టేసిన చంద్ర‌బాబుకు అస‌లుసిస‌లు రాజ‌కీయం ఎలా ఉంటుందో చూపించేందుకు మోడీషాలు డిసైడ్ అయిన‌ట్లుగా తెలుస్తోంది. అవ‌స‌రానికి వైఎస్సార్ కాంగ్రెస్ కు మిత్రుడిగా వ్య‌వ‌హ‌రిస్తూ.. అదే స‌మ‌యంలో టీడీపీని నిర్వీర్యం చేయ‌టం ద్వారా.. ఏపీలో బీజేపీకి కొత్త క‌ళ‌ను తెచ్చే ప్ర‌య‌త్నంలో ఉన్న‌ట్లు చెబుతున్నారు.

తాము అనుకున్న‌ది జ‌రిగితే.. ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీ హోదాను సొంతం చేసుకునే అవ‌కాశం ఉందంటున్నారు. ఈ వ్యూహం అమ‌లు కార‌ణంగా ఏపీ అధికార‌ప‌క్షానికి ఎలాంటి న‌ష్టం క‌లుగ‌క‌పోగా.. పాద‌యాత్ర సంద‌ర్భంగా చెప్పిన విలువ‌ల్ని జ‌గ‌న్ పాటించిన‌ట్లు అవుతుంది కాబ‌ట్టి.. జ‌రుగుతున్న ప‌రిణామాల్ని చూస్తుండిపోవ‌ట‌మే చేస్తార‌ని చెబుతున్నారు. ఈ అంచ‌నాకు త‌గ్గ‌ట్లే.. తాజాగా అనంత‌పురం జిల్లాకు చెందిన టీడీపీ నేత‌ల‌తో ఢిల్లీ బీజేపీ నేత‌లు ఫోక‌స్ చేసి.. త‌మ ట‌చ్ లోకి తెచ్చుకునే ప్ర‌య‌త్నం చేయ‌టాన్ని ప్ర‌స్తావిస్తున్నారు. చూస్తుంటే.. రానున్న రోజుల్లో ఏపీ రాజ‌కీయాలు మ‌రింత ర‌స‌కందాయంగా మార‌ట‌మే కాదు.. ప‌లు సంచ‌ల‌నాలు న‌మోదు కావ‌టం ఖాయ‌మంటున్నారు.