Begin typing your search above and press return to search.

బాబు vs మోడీ.. ఏడుకొండలవాడే సాక్షి

By:  Tupaki Desk   |   26 May 2018 3:55 AM GMT
బాబు vs మోడీ.. ఏడుకొండలవాడే సాక్షి
X
అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడు అందరితో ఆడుకుంటాడు. కష్టం, సుఖాన్ని పరిచయం చేస్తాడు. మనుషుల్లో భక్తి భావాన్ని పెంచుతాడు.. కానీ అదే దేవుడితో ఇప్పుడు ఇద్దరు రాజకీయ నేతలు ఆడుకుంటున్నారు. అందరితో ఆడుకునే దేవుడినే రాజకీయాలకు అనువుగా మార్చి అడుకుంటున్నది మోడీ, చంద్రబాబులే.. దేవుడి సాక్షిగా సాగుతున్న ఈ ఆటలో అరటిపండుగా పాపం మన తిరుమల వేంకటేశ్వరుడు మారిపోతున్నాడు..

*పంతం నీదా.. నాదా..?
కొద్దిరోజులుగా టీటీడీలో పరిస్థితులు ఏమాత్రం బాగాలేదు.. తిరుమల ఆలయ ఆచార్యులు రమణ దీక్షితులు టీటీడీలో జరుగుతున్న అక్రమాలు, అవినీతిని బయటపెట్టేసరికి అధికార టీడీపీ ఉలిక్కిపడింది. ఆయన మాటలు అబద్ధాలని నిరూపించేందుకు నానా తంటాల పడుతోంది. ఈవో, చైర్మన్ తో కలిసి ప్రెస్ మీట్లు పెట్టి మరీ రమణ దీక్షితులు చెప్పేవన్నీ అబద్దాలని నిరూపించే ప్రయత్నాలు చేస్తోంది. దీంతో ఇన్నాళ్లు మిత్రుడిగా ఉండి శత్రువులా మారిపోయిన బీజేపీ పెద్దలు ఈ అవకాశాన్ని ఆబగా అందిపుచ్చుకున్నారు. ఏకంగా రమణదీక్షితులను ఢిల్లీకి పిలిపించిన బీజేపీ చీఫ్ అమిత్ షా తదితరులు టీటీడీ అక్రమాలపై ఆరాతీశారు. దీంతో మరోసారి టీడీపీ, బీజేపీ ఫైట్ తిరుమల వెంకన్న ఆధారంగా రాజుకుంది.

*ఆ కానుకలకు దేవుడే సాక్షి..
తిరుమల వేంకటేశ్వరుడు చాలా పవర్ ఫుల్.. మన దేశంలోనే అత్యధిక మంది కొలిచే దేవుడు. ఇక్కడికి రోజు లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు.. దేశవిదేశాల నుంచి తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుంటారు. ఎన్నో కోట్ల విలువ చేసే ఆభరణాలను స్వామికి అప్పగిస్తారు. అంతటి విలువైన ఆభరణాలను భద్రపరచాల్సిన టీటీడీ అధికారులు స్వాహాలకు పాల్పడుతున్నారనే అపవాదులున్నాయి. స్వామి వారి ఖజానాలో ఉన్న విలువైన పింక్ వజ్రం జెనీవాలో వేలానికి వచ్చిందని ప్రతిపక్ష వైసీపీ ఆరోపించడంతో టీటీడీ ఆభరణాల భద్రతపై సందేహాలు వ్యక్తమవయ్యాయి.. నిజంగా ఆ విలువైన బంగారం ఉందా ఎవరైనా ఎత్తుకెళ్లారా అనే దానిపై స్పష్టత లేదు. ఎందుకంటే టీటీడీ లో విలువైన కానుకలను బయట చూపించడానికి.. లెక్కలు తీయడానికి ఆగమశాస్త్ర నిబంధనలు అడ్డుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే స్వామి వారి నగలకు ఆ దేవుడే సాక్షిగా మారిపోయాడు. ఉన్నాయో.. లేవో కూడా అధికారులు లెక్కలు చెబితేనే తెలిసేలా ఉంది. మరి టీడీపీ నాయకులే నగలను దోచుకున్నారని వైసీపీ ఆరోపిస్తుంటే.. అవన్నీ లోపలే భద్రంగా ఉన్నాయని టీడీపీ నేతలంటున్నారు. ఇందులో ఏదీ నిజమో, ఏదీ అబద్ధమో కానీ దేవుడి పేరుతో సాగుతున్న ఈ రాజకీయాలు మాత్రం సామాన్య భక్తులను కలవరపరుస్తాయి. తిరుమలేషుడితో రాజకీయాలు ఆపండని భక్తులు అభిప్రాయపడుతున్నారు.