Begin typing your search above and press return to search.

పోటాపోటీ పర్యటనలు!

By:  Tupaki Desk   |   5 Aug 2018 7:37 AM GMT
పోటాపోటీ పర్యటనలు!
X
ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో జాతీయ పార్టీల నాయకులు పోటాపోటీ పర్యటనలకు సిద్ధమవుతున్నారు. ఈ సారి ఎలాగైనా విజయం సాధించి భారతీయ జనతా పార్టీ... ముఖ్యంగా నరేంద్ర మోదీని గద్దె దించడమే లక్ష్యంగా ఎఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన పర్యటనలకు సిద్ధమవుతున్నారు. ఈ సారి కూడా ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలనే ఆరాటంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశమంతా తిరగాలనుకుంటున్నారు. ఈ పోటాపోటీ పర్యటనలతో దేశ ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నది కాంగ్రెస్ పార్టీ ఆలోచన. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేస్తున్న తప్పిదాలను ప్రజలకు వివరించేందుకు ఈ పర్యటనలను వాడుకోవాలని రాహుల్ గాంధీ భావిస్తున్నారు.

రా‍ఫెల్ యుద్ధ విమానాల కుంభకోణం - పెద్ద నోట్ట రద్దు - జిఎస్టీతో పాటు ఇటీవల అసోంలో విదేశీయుల ఏరివేత పేరుతో జరుగుతున్న గణన వంటి అంశాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నది కాంగ్రెస్ పార్టీ ఆలోచన. ఇందుకోసం ఎఐసీసీ ప్రణాళికలను రూపొందిస్తోంది. దేశవ్యాప్త పర్యటనలో భాగంగా పలు ప్రాంతీయ పార్టీలతో కూడా చర్చలు జరిపి కూటమి కట్టేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తారు.

మరోవైపు భారతీయ జనతా పార్టీ కూడా తన ఎన్నికల సమరానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇందుకోసం ఈ నెలలో భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సమావేశాలను నిర్వహించనుంది. అలాగే ఈ నెలాఖరులో దేశంలోని 15 రాష్ట్రాల్లో ఉన్న భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ రెండు సమావేశాల్లోనూ ప్రధానమంత్రితో సహా పార్టీ ముఖ్య నేతలంతా ఎక్కడెక్కడ పర్యటించాలి... కార్యకర్తలు... ప్రజలతో ఎలా సమావేశాలు నిర్వహించాలన్న అంశాలపై చర్చిస్తారు. దీంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న 22 కోట్ల మంది ప్రజలను నేరుగా కలుసుకోవాలన్నది పార్టీ అగ్ర నాయకుల ఆలోచన. దీని ద్వారా ప్రజలకు మరింత దగ్గరవుతామన్నది బిజేపీ ఆలోచన. ఇక కేంద్ర పథకాలు ఎవరెవరికి అందుతున్నాయన్న అంశంపై కూడా నివేదికలు తయారు చేయాలని బిజెపి రాష్ట్ర శాఖలను ఆదేశించారు. ఈ నివేదికను బట్టి అనుసరించే పార్టీ ఎత్తుగడలను నిర్ణయించాలని భావిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సహా అమిత్ షా - బిజేపీ నాయకులు రాంమాధవ్ - మురళీధర రావు - అరుణ్ జైట్లీ - నితిన్ గడ్కరి వంటి సీనియర్లతో ఓ కమిటీని ఏర్పాటు చేసి ఎన్నికల ప్రణాళికలు రచించాలని భావిస్తున్నారు. మొత్తానికి దేశంలో ఎన్నికల హడావుడిని రెండు జాతీయ పార్టీలు ప్రారంభిస్తున్నాయి. ప్రాంతీయ పార్టీల హవా నడుస్తున్న ఈ రోజుల్లో జాతీయ పార్టీలు ఎంత వరకూ నిలబడతాయో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే...!!!