Begin typing your search above and press return to search.

ప‌వ‌ర్ ప్యాకేజ్‌: బీహార్‌ కు రూ.1.25ల‌క్ష‌ల కోట్లు..!

By:  Tupaki Desk   |   18 Aug 2015 8:49 AM GMT
ప‌వ‌ర్ ప్యాకేజ్‌: బీహార్‌ కు రూ.1.25ల‌క్ష‌ల కోట్లు..!
X
అధికారం చేతికి వ‌చ్చే ఏ చిన్న అవ‌కాశాన్ని ఎవ‌రు మాత్రం వ‌దులుకుంటారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో తీపిక‌బుర్లు చెప్ప‌ట‌మే కాదు.. ఆచ‌ర‌ణ సాధ్యం కాని హామీలు ఇవ్వ‌టం భార‌త ఎన్నిక‌ల రాజ‌కీయంలో మామూలే. అందుకు ప్ర‌ధాన‌మంత్రి మోడీ కూడా మిన‌హాయింపు కాద‌ని తేలిపోయింది.

బీహార్‌ లో జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎట్టిప‌రిస్థితుల్లో నైనా అధికారాన్ని చేప‌ట్టాల‌ని క‌మ‌ల‌నాథులు ఎంత క‌చ్ఛితంగా ఉన్నార‌న్న‌ది మోడీ తాజా ప్ర‌క‌ట‌నే చెప్ప‌క‌నే చెప్పేస్తుంది. వెనుక‌బ‌డిన బీహార్ ముఖ‌చిత్రాన్ని మార్చేసేందుకు ఆ రాష్ట్రానికి రూ.1.25ల‌క్ష‌ల కోట్ల ప్యాకేజీని ప్ర‌ధాని ప్ర‌క‌టించారు. బీహార్ ముఖ‌చిత్రాన్ని మార్చేస్తామ‌ని చెప్పిన ఆయ‌న‌.. భారీ ప్యాకేజీ ప్ర‌క‌టించి బీహారీలు ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేశారు.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. రాష్ట్ర విభ‌జ‌న కార‌ణంగా ఏపీ తీవ్రంగా న‌ష్ట‌పోయింద‌ని.. తాము అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ఆదుకుంటామ‌ని సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ‌.. ఇదే మోడీ హామీ ఇచ్చారు. కానీ.. ప్ర‌భుత్వం ఏర్ప‌డి 14 నెల‌లు పూర్తి అయినా కూడా ఇప్ప‌టివ‌ర‌కూ ప‌ట్టించుకున్న‌ది లేదు.

రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో ఏపీకి ప్ర‌త్యేక‌హోదా ఇస్తామ‌ని నాటి ప్ర‌ధాన‌మంత్రి మ‌న్మోహ‌న్ హామీ ఇవ్వ‌టం..దాన్ని అమ‌లు చేసే విష‌యంలో రాజ‌కీయ పార్టీలు పెద్ద‌గా అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌వ‌న్న మాట వినిపిస్తున్నా.. ఏపీని ఆదుకునేందుకు చేతులు రాని మోడీ.. బీహార్ విష‌యంలో భారీ ప్యాకేజీని ప్ర‌క‌టించేశారు. బీహార్ లో గ‌తంలో ప్ర‌క‌టించిన రూ.40వేల కోట్ల ప‌నులు సాగుతాయ‌ని మోడీ స్ప‌ష్టం చేశారు. అంటే.. గ‌తంలోని రూ.40వేల కోట్లు.. తాజాగా ప్ర‌క‌టించిన రూ.1.25ల‌క్ష‌ల కోట్లు క‌లిపితే.. బీహార్ ఒక్క రాష్ట్రానికే రూ.1.65ల‌క్ష‌ల కోట్లు కేటాయించ‌నున్న‌ట్లుగా తెలుస్తోంది.

బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌లు ప్ర‌తిష్ఠాత్మ‌కంగా మార‌టం.. బీజేపీ దూకుడుకు అడ్డుక‌ట్ట వేసేందుకు.. నితీశ్‌.. లాలూ.. సోనియాలు క‌లిసిక‌ట్టుగా పోరాడాల‌ని నిర్ణ‌యించిన నేప‌థ్యంలో.. వారికి ధీటుగా స‌మాధానం ఇవ్వ‌ట‌మేకాదు.. త‌మ‌కు అవ‌కాశం ఇస్తే.. బీహార్‌ను మొత్తంగా మార్చేస్తామ‌న్న భావ‌న క‌లిగించే వ్యూహాంలో భాగంగానే తాజా భారీ ప్యాకేజీగా చెప్పొచ్చు.

విభ‌జ‌న కార‌ణంగా మొత్తంగా న‌ష్ట‌పోయిన ఏపీని ఆదుకోవ‌టానికి ముష్టి విదిల్చిన‌ట్లుగా.. రూ.5వేల కోట్లు.. రూ.10వేల కోట్లు ఇచ్చేందుకు కిందామీదా ప‌డే మోడీ స‌ర్కారు.. బీహార్ విష‌యంలో మాత్రం ఏకంగా రూ.1.25ల‌క్ష‌ల కోట్లు ప్ర‌క‌టించ‌టం చూస్తే.. తాజా ప్ర‌క‌ట‌న ప‌వ‌ర్ ప్యాకేజీ అన్న విష‌యం ఇట్టే అర్థ‌మ‌వుతుంది.