Begin typing your search above and press return to search.

మోడీని రావణుడిగా చిత్రీకరించారు!

By:  Tupaki Desk   |   14 Oct 2016 4:30 AM GMT
మోడీని రావణుడిగా చిత్రీకరించారు!
X
దసరా రోజున చాలామంది రావణుడి భారీ దిష్టిబొమ్మను తగలబెట్టి ఘనంగా జరుపుకుంటారు. చెడుపై మంచి సాధించిన విజయాన్ని తలచుకుని సంబరాలు చేసుకుంటారు. గత కొన్ని రోజులుగా ఉరీ ఉగ్రవాదుల సంఘటన, పాక్ అనుసరిస్తున్న దొడ్డిదారి వైఖరి - ఉగ్రవాదులు చేస్తున్న దొంగ దాడులపై దేశం మొత్తం చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో దసరారోజున రావణుడి స్థానే పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ తో పాటు మరికొంతమంది ఉగ్రవాదుల తలలతో కూడిన దిష్టిబొమ్మలను తగలబెట్టారు. ఈ రకంగా కొంతమంది తమ ఆగ్రహావేశాలను వ్యక్తం చేశారు. అయితే దేశమంతా ఒకలా జరిగితే జే.ఎన్‌.యూ లో విద్యార్థులు మాత్రం దసరారోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ని రావణుడిగా చిత్రీకరిస్తూ ఆయన దిష్టిబొమ్మను తగలబెట్టారు.

జవరహర్‌ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో దేశప్రధానినే రావణుడిగా చిత్రీకరించి పండగచేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ - బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా - మరికొందరిని రావణుడిగా చిత్రీకరిస్తూ దసరా రోజున వారి దిష్టిబొమ్మను కొందరు విద్యార్థులు క్యాంపస్‌ ప్రాంగణంలోనే తగలబెట్టారు. దీంతో విశ్వవిద్యాలయం విచారణకు ఆదేశించింది. గతంలో కూడా గుజరాత్ ప్రభుత్వం - గోరక్షకుల దిష్టిబొమ్మలను దహనం చేసినందుకు సంబంధిత విద్యార్థులకు వర్సిటీ వారం కిందటే షోకాజ్ నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరోసారి కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్‌.ఎస్‌.యూ.ఐ మాత్రం రావణున్ని ప్రతిబింబించేలా ప్రధాని మోడీ ముఖంతో ఉన్న చిత్రాలతో ఉన్న దిష్టిబొమ్మను తగలబెట్టింది.

ఈ విషయంపై స్పందించిన విద్యార్థులు... విద్యా సంస్థలపై వరుస దాడులకు పాల్పడుతుందని, చేసిన వాగ్దాలను నిలుపుకోవడంలో విఫలమయ్యిందని కేంద్ర ప్రభుత్వపై తమ నిరసనను ఇలా వ్యక్తం చేశామని చెప్తున్నారు. ఇదే క్రమంలో దసరా రోజున చేసుకునే కార్యక్రమానికి ముందస్తు అనుమతి కూడా లేదని వర్సిటీ ప్రకటిస్తుండగా... క్యాంపస్‌ లో దిష్టి బొమ్మ దహనం నిత్యకృత్యమేనని, దీనికి అనుమతి అక్కర్లేదని ఈ విద్యార్థులు అంటున్నారు. తగులబెట్టిన ఈ దిష్టిబొమ్మల చిత్రాల్లో ప్రధాని మోడీ - అమిత్ షాలతో పాటు యోగా గురువు బాబా రాందేవ్ - ఆసారాం బాపు - నాథురాం గాడ్సే - బీజేపీ ఎంపీ సాధ్వీ ప్రగ్యా - జేఎన్‌ యూ ఉపకులపతి జగదీష్ కుమార్‌ ల ముఖాలు కూడా ఉన్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/