Begin typing your search above and press return to search.

అమరావతి శంకుస్థాపన తర్వాత మోడీ వెళ్లేది..?

By:  Tupaki Desk   |   24 Sep 2015 4:53 AM GMT
అమరావతి శంకుస్థాపన తర్వాత మోడీ వెళ్లేది..?
X
అంగరంగ వైభవంగా ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతి శంకుస్థాపన నిర్వహించాలని.. దేశం యావత్తు అమరావతి గురించి మాట్లాడుకోవాలని భావిస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. తన కార్యదీక్ష.. సత్తా ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పేలా.. భారీతనానికి కేరాఫ్ అడ్రస్ గా అమరావతి శంకుస్థాపన ఉండాలని ఆయన భావిస్తున్నారు. ఇందుకోసం కనివినీ ఎరుగని రీతిలో కార్యక్రమాల నిర్వహణ చేపట్టాలని నిర్ణయించారు.

అంతేకాదు.. అమరావతి శంకుస్థాపనకు ప్రధాని మోడీతో పాటు.. సింగపూర్ ప్రధాని.. జపాన్ మంత్రివర్గ సభ్యులతో పాటు.. వెయ్యికి పైగా వీవీవీఐపీలు.. హాజరయ్యేలా కార్యక్రమాన్ని డిజైన్ చేస్తున్నారు. ఇక.. శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కానున్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. తర్వాత ఎక్కడికి వెళ్లనున్నారు? ఏయే కార్యక్రమాల్లో పాల్గొంటారన్న విషయాలేవీ ఇప్పటివరకూ బయటకు వచ్చింది లేదు.

తాజాగా అందిన సమాచారం ప్రకారం.. గుంటూరు వద్ద కొండవీడులో నిర్మిస్తున్న స్వర్ణ ఇస్కాన్ మందిరం భూమి పూజలో కూడా ప్రధాని పాల్గొంటారని చెబుతున్నారు. కొండవీడు వద్ద 80 ఏకరాల స్థలంలో నిర్మించే ఈ భారీ అధ్యాత్మిక మందిరం కోసం రూ.200కోట్లు వ్యయం చేయనున్నారు. ఇస్కాన్ నిర్మిస్తున్న ఈ మందిర నిర్మాణం కానీ పూర్తి అయితే.. ఏపీకి మరింత శోభనివ్వటం ఖాయమంటున్నారు. దసరా రోజున ఈ రెండు శంకుస్థాపన కార్యక్రమాల్లోనేనా లేక.. మరిన్ని కార్యక్రమాల్లో మోడీ పాల్గొంటారా? అన్నది తేలాల్సి ఉంది.