Begin typing your search above and press return to search.

మౌనం వీడటం వెనుక మోడీ మర్మమేమిటో?

By:  Tupaki Desk   |   14 Oct 2015 6:05 AM GMT
మౌనం వీడటం వెనుక మోడీ మర్మమేమిటో?
X
మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించి దాద్రి ఘటన పై ప్రధాని మోడీ స్పందించారు. ఘటన జరిగి వారాలు గడుస్తున్నా.. ఈ అంశంపై ప్రధాని స్పందించటం లేదన్న విమర్శలకు చెక్ చెబుతూ.. ఈ ఘటనపై మాట్లాడటమే కాదు.. తాజాగా పాక్ మాజీ మంత్రి ఖుర్షీద్ మహ్మద్.. గాయకుడు గులాం అలీకి సంబంధించిన అంశాలపై తన వైఖరిని స్పష్టం చేశారు.

ఉత్తరప్రదేశ్ లోని దాద్రి గ్రామంలో మహ్మాద్ అఖ్లాఖ్ అనే ముస్లిం ఇంట్లో గోమాంసం తిన్నారన్న అంశంపై ఈ గ్రామానికి చెందిన హిందువులు అతన్ని కొట్టి చంపిన ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై పెద్ద ఎత్తున విమర్శలు చోటు చేసుకున్నాయి. కేంద్రంలో మోడీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మైనార్టీల మీద దాడులు పెరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్న తరుణంలో.. తాజా ఘటన మరింత సంచలనం రేపింది.

ఈ ఘటనకు నిరసనగా పలు ఆందోళనలతో పాటు.. రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. అయితే.. బీజేపీ నేతలు ఎవరూ దీనిపై రియాక్ట్ అయ్యింది లేదు. దీంతో.. ఈ ఘటనకు ప్రధాని మౌనంగా తన మద్దతు ఇస్తున్నారన్న విమర్శ వినిపించింది. అయితే.. తాజాగా ఒక మీడియా సంస్థతో మాట్లాడిన మోడీ.. దాద్రి సంఘటనను తీవ్రంగా ఖండించారు. ఇలాంటివి మంచివి కావని ఆయన తేల్చి చెప్పారు.

తమ సర్కారు ఇలాంటి వాటిని సమర్థించదని.. ఇలాంటివి నిజంగా విచారకరమన్న ఆయన.. ఈ ఘటనల వెనుక కీలక అంశం ఏమిటి? అంటూ ప్రశ్నించారు. ఇలాంటి వాటికి తమ పార్టీ సమర్థించదన్న ఆయన వైఖరితో విమర్శకులు వెనక్కి తగ్గే వీలుంది.

అయితే.. ఇంతకాలం మౌనంగా ఉన్న మోడీ ఇప్పుడే స్పందించటం ఏమిటన్నది ఒకప్రశ్న. ఈ వ్యవహారంపై మోడీ ఇంతకాలం మాట్లాడకపోవటానికి కారణం.. తాను ఈ విషయాన్ని ప్రస్తావిస్తే మరింత ప్రాధాన్యత పెరుగుతుందని వదిలేసి ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే.. ఈ ఘటన తాలూకు వేడి రోజురోజుకీ మరింత పెరగటంతో పాటు.. మరిన్ని ఘటనలు చోటు చేసుకోవటం.. మరోవైపు కవులు.. మేధావులు తమకు ప్రభుత్వం ఇచ్చిన పురస్కారాల్ని తిరిగి ఇస్తూ నిరసన వ్యక్తం చేయటం కూడా మోడీ స్పందనకు ఒక కారణంగా చెబుతున్నారు.

తమ ప్రభుత్వం ఇలాంటివి సమర్థించదన్న మాటతో విమర్శల తీవ్రత తగ్గుతుందే తప్పించి.. అసలు ఉండవని చెప్పలేం. కాకపోతే.. మోడీ తాజాగా చేసిన వ్యాఖ్యలతో.. దాద్రి ఘటనకు.. ఇలాంటి విపరీతమైన మనస్తత్వాలకు తమ మద్దతు ఉండదన్న వైఖరిని చాటి చెప్పినట్లు అయ్యింది. దాద్రి ఘటనతో పాటు.. ఇటీవల ముంబయిలో చోటు చేసుకున్న ఘటనల్ని సైతం ప్రస్తావించటం చూస్తే.. వాటిని ఖండించేందుకే దాద్రి ఇష్యూను కూడా మోడీ ప్రస్తావించారన్న మాట వినిపిస్తోంది.