Begin typing your search above and press return to search.

మోడీకి బుద్ధిచెప్పాల్సిందే...

By:  Tupaki Desk   |   5 Oct 2015 11:27 AM IST
మోడీకి బుద్ధిచెప్పాల్సిందే...
X
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ శ‌త్రువులు చిట్టా పెరిగిపోతోంది. ఇన్నాళ్లు ఈ లిస్ట్‌ లో ప్ర‌తిపక్ష నేత‌లుండ‌గా...తాజాగా బీజేపీకీ చెందిన కురువృద్ధుడు, సీనియ‌ర్ న్యాయ‌వాది రామ్ జెఠ్మాలానీ చేరిపోయారు. పాట్నాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయ‌న మాట్లాడుతూ..... ప్రజలను మోసగించిన ప్రధాని మోడీని శిక్షించాలని కోరారు. లోక్‌ సభ ఎన్నికలకు ముందు దేశ నేతగా మోడీని ప్రోత్సహించినందుకు పశ్చాత్తాపం తెలిపేందుకే తాను బిహ‌ర్‌ కు వ‌చ్చాన‌ని చెప్పారు. విదేశీ బ్యాంకుల్లో భారతీయులు దాచుకున్న నల్లధనాన్ని వెనుకకు తేవడంలో విఫలమ‌వ‌డ‌మే కాకుండా...ప్రజా వ్యతిరేక విధానాలు అనసరిస్తున్న మోడీని శిక్షించాల్సిందేనని ఆయన అన్నారు. ఈఎన్నికల్లో బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని ఓడించాలని, ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ కు ఓటేయాలని బీహార్‌ ఓటర్లను కోరారు.

ప్రధాని మోదీ, ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ మోసాల ఆటలో తాను బాధితుడిగా మిగిలిపోయానని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో మోడీని గెలిపించడం కోసం తాను పెద్ద తపస్సే చేశానని అయన అన్నారు. కానీ, ఆయన అసలు స్వరూపం తెలుసుకోలేకపోయాన‌ని జెఠ్మ‌లానీ ఆవేదన వ్యక్తం చేశారు. త‌న మాదిరిగా బీహారీలు అవివేకులు కావద్దని హితవు చెప్పారు. ఒకవేళ విదేశీబ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెనుకకు తేవాలంటే ద్వంద్వ పన్నుల ఎగవేత ఒప్పందం (డీఏటీటీ) సాకుతో ఆ సొమ్ము యజమానుల పేర్ల వెల్లడిలో విఫలమైన అరుణ్‌ జైట్లీ - పీ చిదంబరంలను ముందు అరెస్ట్ చేయాలని జెఠ్మలానీ అన్నారు. నల్లధనాన్ని రప్పిస్తే మాజీ సైనికులకు వన్ ర్యాంక్ వన్ పెన్షన్ వంటి విధానాల అమలుతోపాటు దేశ సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. జర్మనీ తమ బ్యాంకుల్లో నల్లధనం దాచుకున్న 1400 మంది భారతీయుల సమాచారాన్ని కేంద్రంతో పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నదన్నారు.