Begin typing your search above and press return to search.

దొంగ‌ల పేర్ల చివ‌ర మోడీ అంటే.. కులాన్నే లాగేసిన ప్ర‌ధాని

By:  Tupaki Desk   |   18 April 2019 12:00 PM IST
దొంగ‌ల పేర్ల చివ‌ర మోడీ అంటే.. కులాన్నే లాగేసిన ప్ర‌ధాని
X
న‌న్నే కెలుకుతావా? అన్న‌ట్లు అప్పుడ‌ప్పుడు వ్య‌వ‌హ‌రిస్తుంటారు ప్ర‌ధాని మోడీ. విశాల దృక్ఫ‌ధం త‌న‌లో ట‌న్నుల కొద్దీ ఉన్న‌ట్లుగా నీతులు చెబుతూ.. విలువ‌లు బోధించే మోడీ మాస్టారికి కాలిపోతే.. ఆయ‌న‌లో నుంచి ఎవ‌రూ ఊహించ‌ని మ‌నిషి బ‌య‌ట‌కు వ‌స్తుంటారు. రాజ‌కీయాల్లో మాట‌ల దాడులు ఏ రీతిలో ఉంటాయో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఇలాంటి వాటికి స‌మాధానం చెప్పే స‌మ‌యంలో మోడీలో అక‌స్మాత్తుగా మార్పు వ‌చ్చేస్తుంటుంది.

త‌న‌ను ఇరుకున పెట్టేలా చేసే వ్యాఖ్య‌ల‌పై తానెలా రియాక్ట్ అవుతాన‌న్న విష‌యం తాజాగా మోడీ నోటి నుంచి వ‌చ్చిన మాట‌ల్ని చూస్తే ఇట్టే అర్థ‌మైపోతుంది. ఇటీవ‌ల వార్త‌ల్లో బాగా నానిన.. నీర‌వ్ మోడీ.. ల‌లిత్ మోడీ.. న‌రేంద్ర మోడీ పేర్ల‌ను ప్ర‌స్తావిస్తూ.. దొంగ‌లంద‌రి పేర్లూ మోడీయే ఎందుక‌య్యాయో? అంటూ ప్ర‌శ్నించిన వైనం తెలిసిందే.

ఈ వ్యాఖ్య‌ల‌పై ప్ర‌ధాని స్పందించారు. త‌న‌ను.. త‌నలా పేర్ల చివ‌ర మోడీ ఉన్న కొంద‌రి ప్ర‌ముఖుల్ని ఉద్దేశించి.. వారి త‌ప్పుల్ని ఎత్తి చూపేలా చేసిన రాహుల్ ప్ర‌య‌త్నంపై ఎదురుదాడి చేసే క్ర‌మంలో ప్ర‌ధాని నిర్దాక్షణ్యంగా వ్య‌వ‌హ‌రించారు. రాహుల్ వ్యాఖ్య‌లు మోడీ సామాజిక వ‌ర్గాన్నే కించ‌ప‌రిచారంటూ ప్ర‌ధాని మోడీ మండిప‌డ్డారు. త‌న‌ను టార్గెట్ చేసేందుకు రాహుల్ ప్ర‌యోగించిన మోడీ అస్త్రాన్ని.. కులానికి ఆపాదించ‌టం ద్వారా భావోద్వేగ రాజ‌కీయాల‌కు తెర తీశారు.

వెనుక‌బ‌డిన కులానికి చెందిన న‌న్ను దూషించేందుకు వాళ్లు ఎప్పుడూ వెనుకాడ‌లేదు.. ఇప్పుడు హ‌ద్దులు దాటారు. మోడీ సామాజిక వ‌ర్గం మొత్తాన్నే కించ‌పర్చారంటూ సెంటిమెంట్ ను తెర మీద‌కు తెచ్చారు. ఇంత‌కీ ఈ వ్యాఖ్య‌ల్ని చేసింది ఎక్క‌డో తెలుసా? మ‌హారాష్ట్ర‌లోని అక్ల‌జ్ లో నిర్వ‌హించిన ఎన్నిక‌ల ర్యాలీలో. అవ‌స‌ర‌మైతే.. ఎలాంటి మాట అనేందుకైనా తాను సిద్ధంగా ఉంటాన‌న్న విష‌యాన్ని ప్ర‌ధాని తాజా వ్యాఖ్య‌తో స్ప‌ష్టం చేశార‌ని చెప్పాలి.