Begin typing your search above and press return to search.

గన్ పట్టుకొని గస్తీ కాస్తున్న ఉక్రెయిన్ ఎంపీ మోడీని పొగిడేశాడు

By:  Tupaki Desk   |   10 March 2022 5:56 AM GMT
గన్ పట్టుకొని గస్తీ కాస్తున్న ఉక్రెయిన్ ఎంపీ మోడీని పొగిడేశాడు
X
ఉక్రెయిన్ -రష్యా మధ్య నడుస్తున్న యుద్ధం వేళలో అనూహ్య పరిణామాలు.. మనం ఏ మాత్రం జీర్ణించుకోలేని కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏదైనా సమస్య వస్తే.. అందరి కంటే ముందుగా కలుగుల్లోకి వెళ్లి దాక్కునే వారిలో మన రాజకీయ నేతలు.. ప్రజాప్రతినిధులు ఉంటారన్న సంగతి తెలిసిందే.

అందుకు భిన్నంగా ఉక్రెయిన్ నేతలు వ్యవహరిస్తున్నారు. తమ దేశాన్ని రష్యా చేస్తున్న దాడులను తిప్పి కొట్టేందుకు భారీ గన్ పట్టుకొని వీధుల్లోకి వచ్చి పహరా కాస్తున్న వైనం చూస్తే.. అసలుసిసలు ఎంపీలు వాళ్లు కదా? అన్న భావన కలుగక మానదు.

ఉక్రెయిన్ ఎంపీల్లో అత్యంత చిన్నోడు స్వియాతోస్లవ్ యురాశ్. పిన్న వయసులో ఉక్రెయిన్ దేశ ఎంపీగా ఎన్నికైన అతడు.. ఇప్పుడు గన్ పట్టుకొని గస్తీ తిరుగుతున్నారు. తాజాగా అతగాడు ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ.. భారత్ మీదా.. భారతప్రధాని నరేంద్ర మోడీ మీద కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయుల్ని మోడీ సర్కారు తమ దేశానికి తరలించిన వైనాన్ని ప్రశంసించారు.

అంతేకాదు.. తమ దేశ ప్రధానితో భారత ప్రధాని నరేంద్ర మోడీ భేటీ కావటాన్నిఆయన స్వాగతించారు. ఈ శతాబ్దపు భవిష్యత్తును నిర్ణయించే దేశాల్లో భారత్ ఒకటిగా నిలుస్తుందని కొనియాడటం గమనార్హం.

రష్యాతో బలమైన సంబంధాలు ఉన్నప్పటికీ భారత ప్రధాని మోడీ తమ దేశాధ్యక్షుడితో ఫోన్ మాట్లాడటాన్ని ప్రస్తావించి.. పొగిడేశాడు. అయితే.. రష్యా దురాక్రమణ వేళ.. ఆ దేశంతో భారత్ తన సంబంధాల్ని పున:పరిశీలించుకోవాలన్న వ్యాఖ్యను చేశారు.

ఉక్రెయిన్ లో పరిస్థితి గురించి మాట్లాడుతూ.. యుద్ధం ముగియటం.. తమ దేశంలో శాంతి నెలకొంటుందా? అన్నది రష్యా అధినేత పుతిన్ చేతుల్లో ఉంటుందన్న ఈ యువ ఎంపీ.. రష్యా చేస్తున్న దాడుల్ని తాము ఎదుర్కొంటామని ధీమాగా చెబుతున్నారు. తమ పూర్వీకులు ఏ రీతిలో అయితే.. తమ హక్కుల్ని ఎలాగైతే కాపాడుకున్నారో.. తాము కూడా అలానే తమ ప్రాథమిక హక్కుల్ని కాపాడతామన్న ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

ప్రధాని మోడీ చర్యను ప్రశంసిస్తూనే.. రష్యాకు దూరం కావాలన్న మాట సదరు ఉక్రెయిన్ యువ ఎంపీ మాటల్లో కనిపించటం గమనార్హం.