Begin typing your search above and press return to search.

మోడీ స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్‌..ఎన్నిక‌ల్లో ఓట్ల మంత్రం

By:  Tupaki Desk   |   6 March 2019 6:20 AM GMT
మోడీ స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్‌..ఎన్నిక‌ల్లో ఓట్ల మంత్రం
X
స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్‌...భార‌త‌దేశంలో ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారిన రాజ‌కీయ అంశం. భారత వైమానిక దళాల పోరాట పటిమను - సైనికుల వీరోచిత త్యాగాలను బీజేపీ తన విజయాలుగా చెప్పుకుంటూ దేశభక్తి ముసుగులో రాజకీయ లబ్దికి పాకులాడుతోందనే చ‌ర్చ‌ను తెర‌మీద‌కు తెచ్చిన అంశం. సార్వత్రిక ఎన్నికలకు సమీపంలో తలెత్తిన ఈ ఉద్రిక్తతలను అధికారపార్టీ తనకనువుగా మలుచుకుంటుందేమోనన్న అనుమానాలను నిజం చేస్తూ మోడీ - షా ద్వయం తమ పన్నాగాలను కొనసాగిస్తోంది.పాట్నాలో జరిగిన ఎన్డీయే 'సంకల్ప ర్యాలీ' లో ప్రధాని మోడీ ఈ ప్రయత్నాలను మరింత ముందుకు తీసుకుపోయారు. తను ఉగ్రవాదాన్ని అంతం చేయాలని చూస్తుంటే - ప్రతిపక్షాలు తనను అంతం చేయాలని చూస్తున్నాయని తీవ్రమైన ఆరోపణలు చేశారు.

దేశమంతా ఒకే గొంతుక వినిపించాల్సిన సమయంలో 21పార్టీల నేతలు ఢిల్లీలో సమావేశమై తననూ తన ప్రభుత్వాన్నీ విమర్శిస్తూ దేశభక్తిని రాజకీయం చేస్తున్నారని ఎదురుదాడికి దిగారు! ఇదెలా ఉందంటే దొంగే దొంగా దొంగా అని అరిచినట్టుంది. నిజానికి దేశభక్తిని రాజకీయం చేస్తున్నదెవరు? పుల్వామా దాడి అనంతరం విపక్షాలన్నీ ఒకే తాటిపై నిలిచి తామంతా ప్రభుత్వం వెంటే ఉంటామని తేల్చిచెప్పాయి. ఆ మేరకు అఖిలపక్ష సమావేశంలో సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. రెండు సార్లూ అఖిలపక్షానికి ప్రధాని గైర్హాజరయినా ప్రతిపక్షాలన్నీ బాధ్యతగా హాజరై బాసటగా నిలిచాయి. ఈ విషయంలో రాజకీయాలకు చోటే ఉండకూడదని ఐక్యత చాటాయి. కానీ ఆ మరుసటిరోజే బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా ఈ రాజకీయ ఐక్యతకు గండి కొట్టారు. అస్సాంలో జరిగిన సభలో మాట్లాడుతూ 'యుద్ధం వస్తే చేతులు ముడుచుకు కూర్చోవడానికి ఈ దేశంలో ఉన్నది కాంగ్రెస్‌ ప్రభుత్వం కాదు - బీజేపీ ప్రభుత్వం' అంటూ తమ రాజకీయ ఎజెండా ప్ర‌క‌టించారు.

ఇదే స‌మ‌యంలో - రాజకీయ పక్షాలన్నీ సంయమనమే పాటించాయి. తమ రాజకీయ విమర్శలకు - కార్యకలాపాలకు విరామం ప్రకటించాయి. ఆప్‌ నేత అరవింద్‌ కేజ్రీవాల్‌ ఢిల్లీలో తలపెట్టిన తన దీక్షను వాయిదా వేసుకున్నారు. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశాలు - ర్యాలీలు రద్దు చేసుకుంది. ప్రాంతీయ పార్టీ అయిన టీఆర్‌ ఎస్‌ కూడా తన నియోజకవర్గస్థాయి సమీక్షలను నిలిపివేసింది. కానీ దేశభక్తికి తాము మాత్రమే ప్రతీకలమని చెప్పుకునే కమలనాథులు మాత్రం ఇంతటి ఉద్విగ పరిస్థితుల్లోనూ తమ కార్యకలాపాలను నిలిపివేయకపోగా వాటి నుంచి రాజకీయ ప్రయోజనాల కోసం తహతహ లాడుతున్నారు. సాక్షాత్తూ ప్రధానే దాడి జరిగిన సమయంలో తన రాజకీయ ప్రచార చిత్రాల షూటింగ్‌ లో తలమునకలై ఉన్నారు. మధ్యాహ్నం 3గంటల 15నిమిషాలకు దాడి జరిగితే సాయంత్రం 6గంటల 45నిమిషాల వరకూ ఆయన కెమెరాల ముందు తీరిక లేకుండా గడిపారు. ఆ తరువాతే ఉగ్రదాడిపై స్పందించారు. ఆ వెంటనే రాజస్థాన్‌ లోని ఎన్నికల సభలో సుదీర్ఘ రాజకీయ ప్రసంగం చేశారు. ఆ పైన ప్రజలంతా యుధ్ధ భయంలో - సైన్యమంతా యుధ్ధ సన్నాహాల్లో ఉండగా ఆయన మాత్రం 15వేల కేంద్రాల్లో కోటిమంది కార్యకర్తలతో బూత్‌ స్థాయిలో ఎన్నికల సన్నాహాలకు ప్రపంచంలోనే అతి పెద్ద వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. చివరికి పాకిస్థాన్‌ చెర చిక్కిన సైనికయోధుడు అభినందన్‌ విడుదల సమయంలో కూడా ...దేశమంతా అతను సురక్షితంగా వాఘ్రా సరిహద్దులో కాలుమోపే క్షణాల కోసం ఎదురు చూస్తుంటే ప్రధాని మాత్రం విశాఖ తీరంలో విపక్షాలపై విమర్శల్లో మునిగి తేలారు! స్థూలంగా మోడీ- షా ద్వ‌యం ఎన్నిక‌ల ఎజెండాను ఈ స్ట్రైక్స్ ఆధారంగా ముందుకు సాగిస్తున్నారని అంటున్నారు.