Begin typing your search above and press return to search.

మంత్రి ప‌ద‌వుల‌తో ఆ పార్టీకి మోడీ బుజ్జ‌గింపులు!

By:  Tupaki Desk   |   2 Jan 2020 11:09 AM GMT
మంత్రి ప‌ద‌వుల‌తో ఆ పార్టీకి మోడీ బుజ్జ‌గింపులు!
X
ఈ ఏడాదిలో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న రాష్ట్రాల్లో బిహార్ ఒక‌టి. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఆ రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంది. క్రితం సారి బిహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీకి భారీ ఝ‌ల‌క్ త‌గిలింది. అప్పుడు బీజేపీ వ్య‌తిరేక జేడీయూ-ఆర్జేడీ కూట‌మి అక్క‌డ ఘ‌న విజ‌యం సాధించింది. అయితే కొన్నాళ్ల‌కే ఆ కూట‌మిలో లుక‌లుక‌లు వ‌చ్చాయి. జేడీయూను బీజేపీ త‌న వైపుకు త‌ప్పుకుని, త‌న సీట్ల‌తో క‌లిపి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది.

అయితే ఆ త‌ర్వాత జేడీయూ -బీజేపీ స్నేహం కూడా అంత స‌జావుగా సాగ‌డం లేదు. ఇటీవ‌లి లోక్ స‌భ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీ -జేడీయూ క‌లిసి ఘ‌న విజ‌యం సాధించాయి. అయితే ఫ‌లితాలు రాగానే వీరి మ‌ధ్య‌న విబేధాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. కేబినెట్లో జేడీయూకు ఒక్క ప‌ద‌వినే ఆఫ‌ర్ చేశారు మోడీ. దాన్ని ఆ పార్టీ ఆమోదించ‌లేదు. ఆ ఒక్క ప‌ద‌వీ త‌మ‌కు వ‌ద్ద‌ని కేబినెట్లో చేర‌డానికి నో చెప్పింది జేడీయూ.

ఈ నేప‌థ్యంలో ఎన్డీయేలో ఉన్నా.. మోడీ కేబినెట్లో జేడీయూ లేదు. ఇక త్వ‌ర‌లోనే అసెంబ్లీ ఎన్నిక‌లు రాబోతున్న త‌రుణంలో మెజారిటీ సీట్ల‌తో తామే పోటీ చేస్తామ‌ని జేడీయూ అంటోంది. బీజేపీ తాము కేటాయించిన సీట్లలో పోటీ చేయాల‌ని ఆ పార్టీ అంటోంది. అలాగే మోడీ ప్ర‌భుత్వం తెచ్చిన ఎన్ఆర్సీ కి బిహార్ లో స్థానం లేద‌ని ఆ పార్టీ తేల్చి చెప్పింది. ఇలా బీజేపీతో తెగ‌దెంపులు చేసుకోవ‌డానికి కూడా వెనుకాడేది లేద‌న్న‌ట్టుగా ఆ పార్టీ సిగ్న‌ల్ ఇస్తోంది. ఈ నేప‌థ్యంలో క‌మ‌లం పార్టీ అల‌ర్ట్ అవుతోంది.

ఇప్పుడు జేడీయూ కూడా బ‌య‌ట‌కు వెళ్లిపోతే.. బీజేపీకి చెప్పుకోద‌గిన స్నేహ‌మైన పార్టీ ఉండ‌దు. దీంతో.. క‌మ‌లం పార్టీ దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు దిగుతోంది. జేడీయూను కేంద్ర కేబినెట్లోకి తీసుకోవ‌డానికి సై అంటోంద‌ట‌. గ‌తంలో జేడీయూ నేత నితీష్ కోరిన‌ట్టుగా రెండు కేంద్ర‌మంత్రి ప‌ద‌వులు ఇవ్వ‌డానికి మోడీ ఓకే చెప్పార‌ని - త్వ‌ర‌లోనే జేడీయూ మోడీ కేబినెట్లో చేరుతుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. మొత్తానికి కొన్ని ఎదురుదెబ్బ‌ల త‌ర్వాత మోడీ త‌న మిత్రుల‌ను బుజ్జ‌గించే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టుగా ఉన్నార‌ని ప‌రిశీల‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.