Begin typing your search above and press return to search.

కరోనా వైరస్ పై మోదీ కొత్త మంత్రం ఏమిటంటే?

By:  Tupaki Desk   |   27 April 2020 7:32 AM GMT
కరోనా వైరస్ పై మోదీ కొత్త మంత్రం ఏమిటంటే?
X
దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ అందరిని భయబ్రాంతులకు గురిచేస్తుంది. దేశంలో ఈ కరోనా మహమ్మారిని అరికట్టడానికి లాక్ డౌన్ ను అమలు చేస్తున్నప్పటికీ కూడా రోజురోజుకి కరోనా భాదితులు పెరుగుతూనే ఉన్నారు. కానీ, మన దేశం విస్తీర్ణత - జనాభాని బట్టి చూస్తే లాక్ డౌన్ వల్ల చాలా లాభం చేకూరింది అని చెప్పవచ్చు. ఈ సందర్భంలో కరోనా వైరస్‌ పై సమరం సుదీర్ఘకాలం కొనసాగించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. నేడు దేశంలోని ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ తర్వాత ప్రధాని కొత్త మంత్రాన్ని దేశ ప్రజలకు ఉపదేశించాలని సంకల్పించారు.

లాక్ ‌డౌన్‌ తర్వాత మూడోసారి ముఖ్యమంత్రులతో మాట్లాడిన ప్రధాని.. దేశంలో కరోనా కట్టడి, లాక్‌ డౌన్‌ అమలు - ఆంక్షలపై చర్చించారు. రెండున్నర గంటలకు పైగా ఈ సమీక్ష నిర్వహించారు. లాక్‌ డౌన్ పొడిగింపు - దశలవారీ సడలింపులపై సీఎంలతో చర్చ జరిగింది. లాక్ ‌డౌన్‌ తో సానుకూల ఫలితాలు వచ్చాయని మోదీ ప్రకటించారు. ఖచ్చితమైన కరోనా వైరస్ నియంత్రణ చర్యలతోను - పకడ్బందీ ఆంక్షలతోను లక్షల మంది ప్రాణాలను కాపాడుకోగలిగామని ప్రధాని ప్రకటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికల దృష్ట్యా కరోనా వైరస్ ప్రభావం సుదీర్ఘ కాలం కొనసాగే అవకాశం ఉన్నందున రెండు లక్ష్యాలు.. ఇప్పుడు దేశం ముందు ఉన్నాయని ప్రధాని మోదీ ముఖ్యమంత్రులకు తెలిపారు.

ఒకవైపు కరోనా వైరస్ నియంత్రణ చర్యలను కొనసాగిస్తూనే మరోవైపు దేశ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రులకు సూచించారు. అదే సమయంలో దేశ ప్రజలు మరికొంతకాలం కొన్ని ఆంక్షలను పాటించాల్సిన అవసరం ఉందని, అందులోనూ ‘‘దో గజ్ దూరీ’’ (2 అడుగుల దూరం) అనేది మన మూల మంత్రం కావాలని మోడీ పిలుపునిచ్చారు. ముఖాలకు మాస్కులు ధరించడం, తరచూ చేతులను శుభ్రపరుచుకోవడం - శానిటైజర్లను విరివిగా ఉపయోగించడం దేశ ప్రజలందరి కర్తవ్యం కావాలని మోడీ పిలుపునిచ్చారు. అలాగే దేశ ఆర్థిక పరిస్థితి కూడా బాగానే ఉందన్నారు. కాగా, రెడ్‌ జోన్లలో లాక్ ‌డౌన్ మే 3 తరువాత కూడా కొనసాగించే యోచనలో ప్రధాని ఉన్నట్టు తెలుస్తోంది. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న హాట్ ‌స్పాట్‌ ప్రాంతాలు, కొత్తగా బయట పడుతున్న ప్రాంతాల్లో లాక్ ‌డౌన్‌ కొనసాగుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే, ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ‌లో ఐదుగురు సీఎంలు మే 3 తర్వాత లాక్ ‌డౌన్‌ ను తొలగించాలని సూచించగా.. నలుగురు మాత్రం లాక్‌ డౌన్ను కొనసాగించాలని కోరినట్టు సమాచారం.