Begin typing your search above and press return to search.

మంత్రులకు షాకిచ్చే ఎగ్జామ్ పెట్టిన మోడీ

By:  Tupaki Desk   |   13 Feb 2017 4:33 AM GMT
మంత్రులకు షాకిచ్చే ఎగ్జామ్ పెట్టిన మోడీ
X
ప్రధాని మోడీ ఎలా వ్యవహరిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే ఉండదు. సొంత పార్టీ నేతల్నే కాదు.. తన క్యాబినెట్ సహచరుల పని తీరుపై ఆయన ఎప్పటికప్పుడు భిన్నంగా మదింపు చేస్తుంటారు. మంత్రిపదవుల్ని చేపట్టిన తన టీం మెంబర్స్ పని తీరును మదింపు చేసేందుకు ఆయన ఎప్పటికప్పుడు భిన్నంగా వ్యవహరిస్తూ ఉంటారు. తాజాగా అలాంటి పనినే మొదలెట్టారు.

పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో.. ప్రధాని తీసుకెళ్లిన నిర్ణయాన్ని ప్రజల్లో ఎలా తీసుకెళ్లారు? ప్రజలకు ఈ నిర్ణయం ప్రయోజనాన్ని ఇస్తుందన్న విషయాన్ని ప్రజల్లోకి వాళ్లు ఎలా తీసుకెళ్లారో తెలుసుకునేందుకు వీలుగా మంత్రుల నుంచి వివరాల్ని కోరారు. తాము చేసిన పనుల్ని తీరిగ్గా చెప్పటం కాకుండా.. నిర్ణీత సమయాన్ని విధించిన ఆయన.. ఈ రోజు (సోమవారం) తమ వివరాల్ని అందించాల్సిందిగా ఆదేశించినట్లుగా చెబుతున్నారు.

ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో మాట్లాడిన ప్రధాని.. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రజల్లోకి పాజిటివ్ గా తీసుకెళ్లేందుకు ఎవరెన్నిప్రయత్నాలు చేశారో తెలుసుకోవాలని తాను అనుకుంటున్నట్లుగా చెప్పిన ఆయన.. దీని ద్వారా మంత్రుల పని తీరు ఎలా ఉంది? వారెంత చురుగ్గా వ్యవహరిస్తారు? అన్న విషయాల్ని మదింపుచేయాలని భావిస్తున్నారు.

మంత్రుల వివరాల్ని సేకరించేందుకు.. సమన్వయం చేసే బాధత్యల్ని మంత్రి తోమర్ కు ప్రత్యేకంగా అప్పగించినట్లుగా చెబుతున్నారు. ఒకవేళ మంత్రుల కానీ పర్యటనల్లో లేకపోతే ఢిల్లీలోని ఆఫీస్ కు వచ్చిన విషయాన్ని అయినా తెలపాలని ప్రధాని కోరినట్లుగా చెబుతున్నారు. అటు నియోజకవర్గాన్ని.. ఇటు ఢిల్లీ లోని కార్యాలయ పనుల్ని మంత్రులు ఎలా సమన్వయం చేసకుంటున్నారో తాను తెలుసుకోవాలనిభావిస్తున్నట్లుగా చెబుతున్నారు. మొత్తానికి మోడీ ప్రశ్నలు మంత్రులకు పెద్ద పరీక్షలుగా మారాయన్న వాదన వినిపిస్తోంది.