Begin typing your search above and press return to search.

వారికి అభినంద‌న‌లు చెప్పే అర్హ‌త మోడీకి లేదు

By:  Tupaki Desk   |   6 April 2018 4:33 AM GMT
వారికి అభినంద‌న‌లు చెప్పే అర్హ‌త మోడీకి లేదు
X
మ‌రి కాసేప‌ట్లో మోడీ ట్విట్ట‌ర్ ఖాతా నుంచి వారిద్ద‌రికి అభినంద సందేశాలు వెళ్లొచ్చు. కామ‌న్వెల్త్ పోటీల్లో వారి సాధించిన విజ‌యాల‌కు శ‌భాష్ అనొచ్చు. కానీ.. అలా చెప్పే అర్హ‌త ప్ర‌ధాని మోడీకి ఎట్టి ప‌రిస్థితుల్లో లేదు. ఈ విష‌యాన్ని ఆయ‌న గుర్తిస్తే మంచిది. దేశ ప్ర‌ధానిగా.. నిత్యం వ్య‌క్తిత్వ వికాస నిపుణుడిగా మాట‌లు చెప్పే పెద్ద‌మ‌నిషి.. క‌నీసం సౌక‌ర్యాలు కూడా ఏర్పాటు చేయ‌కుండా క్రీడాకారుల్ని ప్ర‌తిష్ఠాత్మ‌క పోటీల‌కు పంపినందుకు ఆయ‌న ఎంత సిగ్గు ప‌డితే అంత మంచిది.

దేశ ప్ర‌ధానిపై ఇంత‌లా విరుచుకుప‌డ‌తారా? అందులోకి మోడీ మీద మీకింత ఆగ్ర‌హ‌మా? అన్న క్వ‌శ్చ‌న్లు కొంద‌రు వేయొచ్చు. కానీ.. జ‌రిగింది తెలిసిన‌ప్పుడు.. మ‌న‌సుతో ఆలోచించిన‌ప్పుడు మాదంతా ధ‌ర్మాగ్ర‌హ‌మ‌ని మీకు అర్థం కావ‌టం ఖాయం. కామ‌న్వెల్త్ పోటీలు స్టార్ట్ అయిన తొలిరోజునే వెయిట్ లిఫ్టింగ్ లో ప‌లు రికార్డులు బ‌ద్ధ‌ల‌య్యాయి. మ‌నమ్మాయిలు ఇద్ద‌రు ప‌త‌కాలు సాధించారు. అందులో ఒక‌టి స్వ‌ర్ణం కాగా.. మ‌రొక‌టి ర‌జ‌తం. ప‌త‌కాల రంగులు ఏవైనా వారు సాధించిన విజ‌యాలు చాలా గొప్ప‌వి. ఎందుకంటారా? వారున్న ప‌రిస్థితుల్లో మెరుగైన ప్ర‌తిభ‌ను ప్ర‌ద‌ర్శించ‌ట‌మే గొప్ప‌. కానీ..వారు మాత్రం ఏకంగా ప‌త‌కాల్నే సాధించి త‌మ వ్య‌క్తిగ‌త ప‌ర‌ప‌తి కంటే దేశానికి పేరు ప్ర‌ఖ్యాతుల్ని తీసుకొచ్చారు.

ఇంకాస్త వివ‌రంగా చెప్పాలంటే కొవ్వొత్తులుగా మారి.. త‌మ జీవితాల్ని ప‌ణంగా పెట్టి మ‌రీ వారు ప‌త‌కాల్ని తీసుకొచ్చి.. ప‌త‌కాల ప‌ట్టిక‌లో భార‌త‌దేశ ప్ర‌తిష్ఠ‌ను ఎంతోకొంతపెంచార‌ని చెప్పాలి. ప‌త‌కాలు తెచ్చిన ఇద్ద‌రిని ఇంత‌గా పొగిడేస్తున్నారేం అన్న డౌట్ వ‌చ్చిందా? మొత్తం వింటే వారి క‌ష్టానికి ఫిదా కావ‌ట‌మే కాదు.. వారి ప‌ట్ల అంత నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించిన మోడీ స‌ర్కారును.. అందునా కెప్టెన్ ఆఫ్ ద షిఫ్ అయిన ప్ర‌ధానిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌టం ఖాయం.

గురువారం జ‌రిగిన కామ‌న్వెల్త్ పోటీల్లో భార‌త్ కు చెందిన వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారులు ఒక స్వ‌ర్ణాన్ని.. మ‌రో ర‌జ‌తాన్ని సాధించారు. స్వ‌ర్ణాన్ని మీరాబాయి చాను సాధించ‌గా.. ర‌జ‌తాన్ని మ‌రో లిఫ్ట‌ర్ గురురాజా సొంతం చేసుకున్నారు. వీరిద్ద‌రూ ప్ర‌ద‌ర్శించిన ప్ర‌తిభ గురించి క్రీడా పేజీల్లో భారీ వ్యాసాలే రాశారు. ఇప్పుడా విష‌యాల్ని వ‌దిలేస్తే.. వీరిద్ద‌రు ప్ర‌ద‌ర్శించిన ప్ర‌తిభ‌ను ఒక్క‌మాట‌లో చెప్పాలంటే.. వీరి అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న పుణ్య‌మా అని ప‌లు రికార్డులు బ్రేక్ అయిపోయాయి. మీరాబాయి చాను ద‌రిదాపుల్లోకి ఆమె ప్ర‌త్య‌ర్థులు రాలేక‌పోయారు. ఇంత‌కు మించి ఇంకేం కావాలి.

అంతా బాగుంది. మ‌నోళ్లు ప‌త‌కాలు సాధించిన వేళ‌.. సంబ‌రాలు చేసుకోవాల్సింది పోయి.. దేశ ప్ర‌ధానిపై మండిపాటు అవ‌స‌ర‌మా? అన్న ప్ర‌శ్న త‌లెత్త‌క మాన‌దు. నిజ‌మే.. సంబ‌రాలు చేసుకోవాల్సిందే. కానీ.. ఈ ఇద్ద‌రు మ‌హిళా క్రీడాకారుల అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న‌ను ఎలాంటి ప‌రిస్థితుల్లో సాధించారో తెలిస్తే షాక్ తినాల్సిందే.

ఈ ఇద్ద‌రు క్రీడాకారుల‌కు వ్య‌క్తిగ‌త ఫిజియోలు లేరు. ఒళ్లంతా గాయాల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నా.. నొప్పుల‌తో ఇబ్బందుల‌కు గురి అవుతున్నా.. వాటిని త‌మ పంటి బిగువునా ఉంచి.. త‌మ బ‌రువుకు మించిన బ‌రువుల్ని అల‌వోక‌గా ఎత్తేసి ప‌త‌కాల్ని సాధించారు. ఇంత ప్ర‌తిభ‌ను ప్ర‌ద‌ర్శించిన క్రీడాకారుల విష‌యంలో క్రీడా మంత్రిత్వ శాఖ‌.. ఆ శాఖ‌కు చెందిన అధికారుల నిర్ల‌క్ష్యం ఎంత‌న్న‌ది తెలిస్తే ఒళ్లు మండిపోక మాన‌దు. క్రీడ‌ల్లో అంతులేని నిర్ల‌క్ష్యం తాండ‌విస్తుంద‌ని.. క్రీడాకారుల ఎంపిక మొద‌లు.. వారు ఎదిగేందుకు వీలైన వాతావ‌ర‌ణం లేద‌న్న విష‌యం ఇప్ప‌టికే ప‌లుమార్లు తెర మీద‌కు వ‌చ్చినా.. అలాంటి వ్య‌వ‌స్థ‌ల ప్ర‌క్షాళ‌న దిశ‌గా ప్ర‌ధాని మోడీ నాలుగేళ్లుగా ప్ర‌య‌త్నించింది లేదు.

క‌నీసం మోడీ హ‌యాంలో అయినా క్రీడలకు ప‌ట్టిన నిర్ల‌క్ష్య‌.. రాజ‌కీయ చెద పోతుంద‌ని భావించారు. కానీ.. అలాంటిదేమీ లేక‌పోగా.. అంత‌కంత‌కూ పెరుగుతూనే ఉంది. కామ‌న్వెల్త్ క్రీడ‌ల‌కు వెళ్లే క్రీడాకారుల వ్య‌క్తిగ‌త సిబ్బంది విష‌యంలో క్రీడా మంత్రిత్వ శాఖ ప్ర‌ద‌ర్శించిన నిర్ల‌క్ష్యం అంతా ఇంతా కాదు. స్టార్ ఆట‌గాళ్లు త‌మ వారి ఖ‌ర్చులు తాము భ‌రిస్తామ‌ని చెప్పినా.. అనుమ‌తిని ఇవ్వ‌క‌పోవ‌టం తెలిసిందే. తాజాగా ప‌త‌కాలు సాధించిన మీరాబాయి.. చాను ఇద్ద‌రికి ఫిజియోల‌ను ఏర్పాటు చేయ‌లేదు. గాయాల నొప్పులు ఓవైపు వెంటాడుతున్నా.. అందుకు స‌రైన చికిత్స ల‌భించింది లేదు. వారి ఇబ్బందుల గురించి అధికారులకు చెప్పినా ప‌ట్టించుకున్న‌ది లేదు. త‌న ఫిజియోను పోటీల‌కు అనుమ‌తించాల‌ని కోరినా ప‌ట్టించుకోలేద‌ని ప‌త‌కాలు సాధించిన త‌ర్వాత వీరిద్ద‌రూ పేర్కొన్నారు. వీరి వ్యాఖ్య‌ల‌పై స్పందించేందుకు కొంద‌రు అధికారులు ముఖం చాటేస్తే.. ఒక‌రిద్ద‌రూ త‌మ బాధ్య‌త ఏమీ లేద‌ని త‌ప్పుకున్నారు. ఇలాంటోళ్ల‌ను మొత్తంగా ఏరేసి.. శ్రీ‌ముఖాలు ఇచ్చి ఇంటికి పంపించే ద‌మ్ము లేని మోడీకి.. క్రీడాకారుల్ని అభినందించే నైతిక హ‌క్కు ఉంటుందంటారా?