Begin typing your search above and press return to search.

నోబెల్ శాంతి బహుమతి పై మోదీ కన్ను

By:  Tupaki Desk   |   5 Aug 2019 3:08 PM GMT
నోబెల్ శాంతి బహుమతి పై మోదీ కన్ను
X
డెబ్భయ్యేళ్లుగా రగులుతున్న కశ్మీర్ సమస్యకు కొంత వరకు పరిష్కారం సాధించడంతో పాటు అక్కడ శాంతిభద్రతలు నెలకొల్పే దిశగా భారత ప్రధాని మోదీ వేస్తున్న అడుగులను ప్రపంచమంతా చూస్తోంది. ఆసియా ఖండంలో అత్యంత జటిల సమస్యల్లో ఒకటైన కశ్మీర్ సమస్యను కొలిక్కి తెచ్చేందుకు మోదీ ప్రభుత్వం తీసుకున్న చర్య అక్కడ శాంతి నెలకొల్పేందుకు... అభివృద్ధికి బాటలు వేసేందుకు వీలు కల్పిస్తుందన్న భావన వ్యక్తమవుతోంది.

ఈ సమస్య పరిష్కారానికి ప్రపంచ దేశాలు మధ్యవర్తిత్వం వహించాలని ఒక దశలో భావించినా భారత్ ఆది నుంచి మధ్యవర్తిత్వాన్ని తిరస్కరిస్తూ వస్తోంది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు మధ్యవర్తిత్వ ప్రస్తావన తేగా దాన్నీ భారత్ ఖండించింది. ముఖ్యంగా మోదీ ప్రభుత్వం దీనికి భారత్ వైపు నుంచే పరిష్కారం చూపాలని భావిస్తూ వచ్చింది. ఇదే సమయంలో భారత్‌ కు.. ముఖ్యంగా మోదీకి అంతర్జాతీయంగా ఆమోదం పెరుగుతుండడంతో దాన్ని సానుకూలంగా మలచుకుని ముందస్తుగా అంతర్జాతీయంగా బలమైన దేశాలకు సమాచారమిచ్చి కశ్మీర్ సమస్యను పూర్తిగా పరిష్కరించేందుకు మోదీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

అది చర్చలా.. పరస్పర ప్రయోజనాలా.. పరస్పర లాభనష్టాలా.. యుద్ధమా.. సైనిక చర్యా.. అంతర్జాతీయ ఒత్తిడా అన్నది పక్కన పెడితే పాకిస్తాన్ ఇక కశ్మీర్ వైపు చూడకుండా చేయడానికి మోదీ పూర్తిస్థాయి స్కెచ్ గీసినట్లు తెలుస్తోంది. అందుకు తాజా పరిణామాలు తొలిమెట్టని.. ఒక్కటొక్కటిగా చేసుకుంటూ పోయి కశ్మీర్ సమస్యకు ముగింపు పలికే ప్రణాళిక మొత్తం మోదీ వద్ద ఉందని తెలుస్తోంది. రానున్న రెండేళ్లలో ఇది పూర్తిగా అమలు చేస్తారని.. అదే జరిగితే కశ్మీర్ సమస్య పూర్తిగా పరిష్కారమవుతుందని బీజేపీ వర్గాల నుంచి వినిపిస్తోంది.

ఈ ప్రాసెస్ అంతా పూర్తయిన తరువాత ప్రపంచంలోని అత్యంత సుదీర్ఘకాల సమస్యను పరిష్కరించినందుకు ప్రధాని మోదీకి నోబెల్ శాంతి బహుమతి లభించి తీరుతుందని అంచనా. మోదీ మనసులోనూ ఇదే ఉందని.. దేశ సమగ్రతను కాపాడడం ప్రధాన లక్ష్యమే అయినప్పటికీ.. దాన్ని తన చేతుల మీదుగా చేసి నోబెల్ శాంతి బహుమతి సాధించాలని ఆయన మనసులో ఉందని చెబుతుంటారు.