Begin typing your search above and press return to search.

రాత్రికి రాత్రి పుట్టుకొచ్చిన చట్టాలు కావివి.. మోడీ

By:  Tupaki Desk   |   18 Dec 2020 2:00 PM GMT
రాత్రికి రాత్రి పుట్టుకొచ్చిన చట్టాలు కావివి.. మోడీ
X
కొత్త వ్యవసాయ చట్టాలపై ఢిల్లీ కేంద్రంగా రైతులు హోరెత్తిస్తున్న వేళ ప్రధాని నరేంద్రమోడీ ఈ నిరసనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు రాత్రికి రాత్రి పుట్టుకొచ్చినవి కాదని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. వ్యవసాయ నిపుణులు,శాస్త్రవేత్తలతో సుదీర్ఘ చర్చల తర్వాతే చట్టాలను రూపొందించామని అన్నారు. మేనిఫెస్టోల్లో హామీలిచ్చి వాటిని నెరవేర్చనివాళ్లను రైతులు మొదట నిలదీయాలని అన్నారు.

మోడీ మాట్లాడుతూ.. 'రాజకీయ పార్టీలకు నేనొక్కటే చెప్పదలుచుకున్నాను... అవపరమైతే వ్యవసాయ చట్టాల క్రెడిట్ అంతా వాళ్ళనే తీసుకోమని కోరుతున్నా. కానీ ఈ విషయంలో రైతులను తప్పుదోవ పట్టించకండి.' అని మోదీ విజ్ఞప్తి చేశారు. మధ్యప్రదేశ్‌లో శుక్రవారం నిర్వహించిన కిసాన్ సమ్మేళన్‌ లో ప్రధాని మోదీ హాట్ కామెంట్స్ చేశారు.

ఆందోళన చేస్తున్న రాజకీయ పార్టీలను అసలు మీ సమస్య ఏంటని మేము ప్రశ్నిస్తున్నామని ప్రధాని మోడీ నిలదీశారు. కానీ వాళ్లు మాతో చర్చించేందుకు సిద్ధంగా లేమని అన్నారు. క్షేత్రస్థాయిలో రాజకీయ ఉనికిని కోల్పోయిన వాళ్లు ఇప్పుడు రైతుల్లో లేనిపోని భయాందోళనలు రేకెత్తిస్తున్నారని.. రాజకీయంగా పుంజుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ రాజకీయ పార్టీలు 8 ఏళ్ల పాటు స్వామినాథన్ సిఫారసులను అమలు చేయలేదని ప్రధాని మోడీ విమర్శించారు.

మధ్యప్రదేశ్‌లో అధికారంలోకి వస్తే రుణమాఫీ చేస్తామని రెండేళ్ల క్రితం హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం... ఎందుకని ఆ హామీలు నెరవేర్చలేదని మోడీ ప్రశ్నించారు. అయినా అప్పుడెలాంటి నిరసనలు జరగలేదన్నారు.రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశంలోని రైతులను పూర్తిగా విస్మరించిందన్నారు. 8 ఏళ్ల పాటు స్వామినాథన్ కమిటీ సిఫారసులను కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేయలేదని.. ఎందుకంటే వారికి రైతులపై ఖర్చు పెట్టే ఉద్దేశం లేదని అన్నారు.

బీజేపీ తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు రాత్రికి రాత్రి తెచ్చినవి కాదని.. 20-30 ఏళ్లుగా చర్చలు జరిపారని.. వ్యవసాయ నిపుణులు , ఆర్థికవేత్తలు, రైతుల డిమాండ్ల మేరకే ఈ కొత్త చట్టాలు తీసుకొచ్చామన్నారు. కొత్త చట్టాలపై నమ్మకం ఉంచాలని రైతులను మోడీ కోరారు. రైతుల కోసం సదుద్దేశంతోనే తెచ్చినవి అన్నారు. కనీస మద్దతు ధర తప్పనిసరిగా కొనసాగుతుందన్నారు. దాన్ని తొలగించమని తెలిపారు.