Begin typing your search above and press return to search.

దీదీ మాటకు మోడీ మాష్టారు భలే అర్థం తీశారుగా?

By:  Tupaki Desk   |   7 April 2021 4:30 AM GMT
దీదీ మాటకు మోడీ మాష్టారు భలే అర్థం తీశారుగా?
X
దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నా.. పశ్చిమబెంగాల్ లో అధికార టీఎంసీ..విపక్ష బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. మంగళవారం మూడో విడత పోలింగ్ ముగిసింది. మరిన్ని విడతల పోలింగ్ జరగాల్సి ఉంది. ఓపక్క పోలింగ్ నడుస్తున్న వేళ.. మరోవైపు ప్రధాని మోడీ.. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలు ఎన్నికల సభలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తమ రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. మమతతో పోలిస్తే.. తాజాగా ప్రధాని మోడీ విమర్శల స్వరాన్ని పెంచటమే కాదు.. మమతపై మాటల దాడిని మరింత ఎక్కువ చేశారు.

ఇటీవల ఆమె చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ.. ముస్లిం ఓటర్లు చీలిపోవద్దని మమత కోరుకోవటం చూస్తే.. మైనార్టీల ఓటు బ్యాంకు ఆమె చేజారినట్లుగా అర్థమవుతుందన్నారు. చీలిపోవద్దని పదే పదే కోరటాన్ని ఆయన గుర్తు చేశారు. ‘మీ నుంచి వారు కూడా దూరమయ్యారని అర్థం. మీరు ఇలా బహిరంగంగా మాట్లాడవలసి వస్తుందంటే మీరు ఈ ఎన్నికల్లో ఓడినట్లే. ఎన్నికల కమిషన్ ను తరచూ దూషిస్తున్నారు. ఓటర్లను టీఎంసీ నేతలు బెదిరింపులకు దిగుతున్నారు. ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని ఇవ్వాలని కోరుతున్నాం’’ అని మోడీ పేర్కొన్నారు.

తమ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రాకపోతే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని దీదీ చెబుతున్నారని.. ఆమె మాటల్లో నిజాలు లేవన్నారు. సంక్షేమ పథకాలు ఏమీ ఆగిపోవని రాసి పెట్టుకోండన్న అభయాన్ని మోడీ ఇచ్చారు. బెంగాల్ లో మేనల్లుడి పన్నును కొత్తగా తెచ్చారంటూ దీదీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీని పరోక్షంగా ప్రస్తావించటం గమనార్హం. ఈ సందర్భంగా మోడీ ఒక ఉదాహరణ చెబుతూ.. ఆమె చేసిన వ్యాఖ్యలు సెల్ఫ్ గోల్ చేసుకున్నట్లుగా అభివర్ణించారు.

దీదీ.. మీరు ఫుట్ బాల్ ఎక్కువగా ఆడతారని జనం చెప్పతున్నారు. పుట్ బాల్ లో సెల్ఫ్ గోల్ అనేదొకటి ఉంటుంది. మీరు ఎన్నికల మైదానంలో సెల్ఫ్ గోల్ చేసుకున్నారని పేర్కొన్నారు. దీదీ.. వ్యాఖ్యల్ని సునిశితంగా ప్రస్తావిస్తూ.. ఆమె మాట్లాడిన ప్రతి మాటలోనూ ఏదో ఒక అర్థాన్ని తీసి.. ఆమెకు అపాదించేందుకు తపిస్తున్న మోడీ తీరు చూస్తే.. విజయం కోసం ఆయన పడుతున్న పాట్లు అన్ని ఇన్ని అన్నట్లుగా ఆయన మాటలు ఉన్నాయని చెప్పాలి. మరి.. మోడీ మాటలకు బెంగాలీలు ప్రభావితం అవుతారా? లేదా? అన్నది మే 2న విడుదలయ్యే ఫలితాలు తేల్చనున్నాయి.