Begin typing your search above and press return to search.

కశ్మీర్ కథ: గురువు కల నెరవేర్చిన మోడీ

By:  Tupaki Desk   |   6 Aug 2019 6:29 AM GMT
కశ్మీర్ కథ: గురువు కల నెరవేర్చిన మోడీ
X
జన్ సంఘ్.. 1951లో దీన్ని స్వాతంత్ర్య సమరయోధుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ ఏర్పాటు చేశారు. ఇవ్వాళ దేశాన్ని ఏలుతున్న భారతీయ జనతా పార్టీకి ఇది మాతృసంస్థ. శ్యాంప్రసాద్ ముఖర్జీ బెంగాల్ కు చెందిన ఫైర్ బ్రాండ్ నేత. ఈయన భారత తొలి ప్రధాని నెహ్రూ మంత్రివర్గంలో పనిచేశారు. అయితే కశ్మీర్ కు ఆర్టికల్ 370 రక్షణ కల్పించి విలీనం చేసుకోవడాన్ని శ్యాంప్రసాద్ ముఖర్జీ తీవ్రంగా వ్యతిరేకించారు. కశ్మీర్ కు ప్రత్యేక హక్కులు, ఆర్టికల్ 370 వద్దని సంపూర్ణంగా రాష్ట్రంగా విలీనం చేయాలని నెహ్రూను కోరాడు. ఆయన వినకపోవడంతో 1950లోనే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి ఏకంగా 1951లో ‘జన్ సంఘ్’అనే పార్టీని స్థాపించారు.

నాటి కాంగ్రెస్ భావజాలానికి వ్యతిరేకంగా.. దేశ హక్కులు, జాతీయత, సార్వభౌమత్వ పరిరక్షణ ధ్యేయంగా ఏర్పడ్డ తొలి పార్టీ ‘జన్ సంఘ్’ అదే ఇప్పుడు బీజేపీగా మారింది. అయితే శ్యాంప్రసాద్ నాడు నెహ్రూను విభేదించి కశ్మీర్ ను సంపూర్ణంగా విలీనం చేసి భారత్ కు హక్కు ఉండేలా చేయాలని అనేక ఉద్యమాలు చేశారు. కశ్మీర్ ను మినహాయించి జమ్మూ లఢక్ లను అయినా భారత్ లో సంపూర్ణం విలీనం చేయాలని శ్యాంప్రసాద్ ఉద్యమించారు. ‘ఒక దేశం.. ఒకటే నిబంధన’ ఉండాలని ఆయన పాటుపడ్డారు. అయితే నెహ్రూ సర్కారు మాత్రం ఆర్టికల్ 370 రద్దు, కశ్మీర్ విలీనాన్ని ఒప్పుకోలేదు. అదే ఇప్పుడు ఇలా రావణ కష్టంలా మారడానికి కారణమైంది.

కశ్మీర్ ను పూర్తిగా విలీనం చేయాలని 1953లో శ్యాంప్రసాద్ కశ్మీర్ వెళ్లి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు.అప్పటి కశ్మీర్ సీఎం షేక్ అబ్దుల్లా అతడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాడు. నెహ్రూ ఇతర మంత్రులు కనీసం పట్టించుకోలేదు.. విడుదల చేయలేదు. శ్రీనగర్ జైల్లోనే అనారోగ్యానికి గురై శ్యాం ప్రసాద్ గుండెపోటుతో మరణించాడు. కశ్మీర్ ను విలీనం చేయాలని పోరాడిన తొట్ట తొలి నేతగా శ్యాంప్రసాద్ చరిత్రలో నిలిచాడు..

అయితే కాలక్రమంలో జన్ సంఘ్ పార్టీ రూపాంతరం చెందిన భారతీయ జనతాపార్టీగా మారింది. బీజేపీ కూడా ఆర్టికల్ 370 రద్దు కోసం ఎప్పటినుంచో పోరాడుతోంది. మోడీ కూడా ప్రధాని కాకముందే బీజేపీలో కార్యకర్తగా ఉన్న సమయంలో దీన్ని రద్దు చేయాలని పోరాటాలు, దీక్షలు చేశారు.ఇప్పుడు ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టగానే మోడీ డేరింగ్ డ్యాషింగ్ నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభలో ఇప్పుడు పూర్తి మద్దతు ఉండడంతో శరవేగంగా బిల్లులను పాస్ చేస్తున్నారు. 2014లో గెలిచినా రాజ్యసభలో సరైన మద్దతు లేకపోవడంతో కీలక బిల్లులు, సంస్కరణలను మోడీ చేయలేకపోయారు. కానీ ఇప్పుడు దూకుడుగా అన్నింటిని ఆమోదించేస్తున్నారు. జమ్మూకశ్మీర్ ను విడగొట్టి తమ మూల పురుషుడు అయిన శ్యాంప్రసాద్ ముఖర్జీకి నరేంద్రమోడీ ఘనమైన నివాళి అర్పించాడని బీజేపీలో చర్చించుకుంటున్నారు.