Begin typing your search above and press return to search.

మోడీ స‌రికొత్త 'నీతి' తో భారీ షాకులు

By:  Tupaki Desk   |   3 Feb 2018 4:48 AM GMT
మోడీ స‌రికొత్త నీతి తో భారీ షాకులు
X
మోడీ అంత మంచోడు ఈ దేశంలో ఎవ‌రూ ఉండ‌రు. ఆయ‌న‌కు దేశం మీద ఉన్న ప్రేమ అంతా ఇంతా కాదు. దేశాన్ని దేశంగా చూడ‌టంలో ఆయ‌న త‌ర్వాతే. అస‌లు ఆయ‌న పుట్టిందే దేశాన్ని ఉద్ద‌రించ‌టానికి. దేశ ప్ర‌జ‌లు చేసుకున్న పూజ‌ల‌కు ఆ దేవ‌దేవుడు ద‌య‌త‌ల‌చి మోడీ రూపంలో దేశానికి ఒక చ‌క్క‌టి ప్ర‌ధానిని పంపించాడు. మోడీని అభిమానించే వారు.. అమితంగా ఆరాధించేవారు అదే ప‌నిగా ఆయ‌న్ను పొగిడేస్తుంటారు.

మోడీ మాట‌ల విష‌యానికి వ‌స్తే.. దేశాన్ని నాశ‌నం చేసిన భార‌త్ ను త‌న‌కున్న అద్భుత‌మైన మేధ‌స్సుతో భార‌త్ ను తిరిగి నిర్మించేందుకు.. స‌రికొత్త విలువ‌లు.. సంప్ర‌దాయాల్ని తీసుకొచ్చేలా చేయ‌టమే ల‌క్ష్యంగా తాను ప‌ని చేస్తున్న‌ట్లు చెబుతారు. ముక్త భార‌త్ నినాదంతో కాంగ్రెస్ దేశానికి చేసిన అన్యాయాల మీద త‌ర‌చూ గ‌ళం విప్పుతూ ఉంటారు. చేత‌ల వ‌ర‌కు వ‌చ్చేస‌రికి మోడీ ఎలా వ్య‌వ‌హ‌రిస్తార‌న్న‌ది తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే.

దేశాన్ని ఉద్ద‌రించేందుకు త‌న‌దైన కొత్త విధానాల్ని తీసుకొచ్చిన మోడీని చూసినోళ్లంతా కొత్త‌క వింత‌.. పాత ఒక రోత అన్న‌ట్లే ఫీల‌య్యారు. నీతి ఆయోగ్ ను తెర మీద‌కు తెచ్చిన‌ప్పుడు ఒక కొత్త త‌ర‌హా పాల‌నా విధానం వ‌చ్చింద‌ని దేశ‌మంతా భావించింది. అయితే.. ఆచ‌ర‌ణ‌లోకి వ‌చ్చాక కానీ అస‌లు విష‌యం ఇప్పుడిప్పుడే అర్థ‌మ‌వుతోంది.

నీతి ఆయోగ్‌ ను త‌న గుప్పిట్లో ఉంచుకోవ‌టం ద్వారా రాష్ట్రాల‌కు చుక్క‌లు చూపిస్తున్నారు మోడీ. కేంద్రం నుంచి రాష్ట్రాల‌కు ఇచ్చే నిధులు వాటంత‌ట అవే రావాల్సి ఉంది. నీతి ఆయోగ్ పుణ్య‌మా అని ఇప్పుడు అందుకు భిన్న‌మైన ప‌రిస్థితి ఏర్ప‌డింది. సంప్ర‌దాయంగా రావాల్సిన నిధులు సైతం నీతి ఆయోగ్ ద‌య త‌లిస్తేనే వ‌స్తున్న వైనం రాష్ట్రాల‌కు చురుకుపుడుతోంది.

గ‌తంలో ప్ర‌ణాళికా సంఘం.. ఆర్థిక సంఘం వేర్వేరుగా ఉండేవి. ప్ర‌ణాళికా సంఘం స‌ల‌హా మండ‌లిగా వ్య‌వ‌హ‌రించ‌గా.. ఆర్థిక సంఘం సిఫార్సుల మేర‌కు కేంద్రం నుంచి రాష్ట్రాల‌కు నిధులు విడుద‌ల‌య్యేవి. రాష్ట్రాల బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌ల్ని ప్రణాళికా సంఘం నిశితంగా ప‌రిశీలించి నిధులు ఏమేర‌కు వ‌స్తాయో చూసి కేంద్రం ఇవ్వాల్సిన సాయం మీద సిఫార్సు చేసేది. మోడీ హ‌యాంలో ప్రణాళిక సంఘాన్ని తొల‌గించారు. ఆర్థిక సంఘాన్ని నిర్వీర్యం చేసి.. ఆ స్థానంలో నీతి ఆయోగ్‌ ను తీసుకొచ్చారు.

పాత ప‌ద్ధ‌తి రోతగా.. కొత్త విధానంతో రాష్ట్రాల‌కు మ‌రింత స‌ర‌ళంగా నిధులు అందుతాయ‌న్న మాట‌ను మాట‌ల్లో చెప్పినా.. చేత‌ల్లోకి వ‌చ్చేస‌రికి మాత్రం అందుకు భిన్న‌మైన ప‌రిస్థితి. రాష్ట్రాల‌కు అందాల్సిన నిధుల గురించి స‌వివ‌రంగా చెప్పాల్సిన వివ‌రాల్ని చెప్ప‌కుండా చేయ‌ట‌మే కాదు.. నిధుల గురించి రాష్ట్రాల‌న్నీ నీతిఆయోగ్ ముందు విన‌యంగా అయ్యా బాబు అంటూ అడిగే ప‌రిస్థితిని తీసుకొచ్చారు. నీతి ఆయోగ్ తీరుతెన్నులు.. దాని ప‌ని తీరు గురించి ఒక్కొక్క‌టిగా అర్థ‌మ‌వుతున్న కొద్దీ మోడీ నీతి ఎంత లోతుగా ఉంటుందో.. రాష్ట్రాల‌ను త‌న చెప్పు చేతుల్లో ఉంచుకునే విష‌యంలో ఆయ‌న ఎంత సుదీర్ఘంగా ఆలోచిస్తారో అర్థం కాక మాన‌దు.

సాధార‌ణంగా బ‌డ్జెట్ ప్ర‌సంగం ముగిసిన త‌ర్వాత‌.. ఆయా రాష్ట్రాల‌కు కేంద్రం నుంచి వ‌చ్చే నిధుల గురించిన స‌మాచారం తెలిసేలా.. బ‌డ్జెట్ కు అనుబంధంగా ఎక్స్ ప్ల‌నేట‌రీ నోట్ ను అందుబాటులో ఉంచేవారు. వాటి ఆధారంగా రాష్ట్రాలు త‌మ రాష్ట్ర బ‌డ్జెట్ ను సిద్ధం చేసుకునేవి. కేంద్రం నుంచి రాష్ట్రానికి వివిధ కార్య‌క్ర‌మాల కింద వ‌చ్చే నిధుల వివ‌రాలు స‌వివ‌రంగా ఉంటాయి. ఆ కాపీని రాష్ట్రాల ప్ర‌తినిధులు కేంద్రానికి వెళ్లి తెచ్చుకునే వారు. ఇప్పుడా ప‌రిస్థితి పూర్తిగా మారింది. ఈసారి ఎక్స్ ప్ల‌నేట‌రీ నోట్‌ ను కేంద్రం బ‌య‌ట‌పెట్ట‌లేదు. సీక్రెట్ గా ఉంచేశారు. దీంతో నీతి ఆయోగ్ ఎంత మేర నిధులు ఇస్తుంద‌న్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గా మారింది.

నిధులు ఇచ్చేందుకు నీతి ఆయోగ్ కీల‌కంగా మార‌టం ఒక ఎత్తు అయితే.. త‌మ‌కు రాజ‌కీయంగా అండ‌గా నిలిచే రాష్ట్రాల‌కు పెద్ద‌పీట వేయ‌టం.. మిగిలిన వారిని తొక్కేసే స‌రికొత్త రాజ‌కీయాన్ని తెర మీద‌కు తెచ్చారు మోడీ. రాష్ట్రాల‌కు షాకులు ఇచ్చేందుకే రూపొందించిన‌ట్లుగా ఇప్పుడు నీతిఆయోగ్ క‌నిపిస్తోంది. విభ‌జ‌న కార‌ణంగా తీవ్ర‌మైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఏపీ విష‌యాన్నే తీసుకుంటే.. ఈ మ‌ధ్య‌న వ‌చ్చిన నీతి ఆయోగ్ ఉపాధ్య‌క్షుడు మీ వృద్ధి రేటు బాగుంది క‌దా.. మీకు ప్ర‌త్యేక సాయం.. ప్ర‌త్యేక హోదా ఎందుక‌ని ప్ర‌శ్నించ‌టం షాకింగ్ గా మారింది.

ఆయ‌న మాట‌లు మ‌రింత బాగా అర్థం కావాలంటే ఒక చిన్న ఉదాహ‌ర‌ణ‌ను చెప్పుకోవాలి. ఎలాంటి ఆస్తిపాస్తులు లేని ఒక కుర్రాడు మంచి జీతం వ‌చ్చే ఉద్యోగం ఉంద‌నుకుందాం. నెల అయ్యేస‌రికి మంచి జీతం అత‌డి చేతుల్లోకి రావొచ్చు. అంత‌మాత్రం చేత అత‌డ్ని ధ‌న‌వంతుడిగా అంచ‌నావేస్తామా? మ‌ంచి జీతం చేతికి వ‌స్తున్నా.. డ‌బ్బుకు సంబంధించి పెద్ద అవ‌స‌రం వ‌స్తే.. పెద్ద జీతం ఓ లెక్క‌లోకి రాద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు.

బాగా జీతం వ‌చ్చే కుర్రాడు ఏపీగా భావిస్తే విష‌యం ఇట్టే అర్థ‌మ‌వుతుంది. విభ‌జ‌న‌తో వ‌చ్చిన స‌మ‌స్య‌ల్ని.. ఆర్థిక తిప్ప‌ల గురించి ప‌ట్టించుకోకుండా.. ఏపీ వృద్ధిని (జీతాన్ని) మాత్ర‌మే చూసే నీతి ఆయోగ్ వారి తీరు చూస్తే.. తాము సాయం చేయ‌కూడ‌ద‌ని భావించే రాష్ట్రాల ప‌ట్ల వారి మాట‌లు ఎలా ఉంటాయ‌న‌టానికి నిద‌ర్శ‌నంగా చెప్ప‌క త‌ప్ప‌దు.

మొత్తంగా చూస్తే త‌న‌కు.. త‌న పార్టీకి (బీజేపీ) రాజ‌కీయంగా ఎలాంటి ప్ర‌యోజ‌నాన్ని క‌లిగించ‌ని వారిపై మోడీ తీరు ఎలా ఉంటుందో చెప్పాలంటే ఒక మీడియా సంస్థ‌లో వ‌చ్చిన కొన్ని మాట‌లు అచ్చుగుద్దిన‌ట్లుగా స‌రిపోతాయ‌ని చెప్పాలి. ఆ మాట‌లేమంటే.. ‘‘మీరు అడగాలి. నేను ఇవ్వను. మళ్లీ అడగాలి! అయినా ఇవ్వను! బతిమాలాలి! అప్పుడు కుదిరితే, నాకు ఇష్టమైతే ఇస్తా! అది కూడా మీకు అవసరమైనంత కాదు! నాకు ఎంత ఇవ్వాలనిపిస్తే అంతే ఇస్తా!’’.. అని. ఇప్ప‌టికైనా అర్థ‌మైందా మోడీ నీతి ఎలా ఉంటుందో?