Begin typing your search above and press return to search.

తెలుగు రాష్ట్రాల‌పై మోడీ స‌ర్కారు తొండాట‌!

By:  Tupaki Desk   |   16 Dec 2018 4:25 AM GMT
తెలుగు రాష్ట్రాల‌పై మోడీ స‌ర్కారు తొండాట‌!
X
ఎవ‌రూ క‌చ్ఛిత‌మైన కార‌ణం చెప్ప‌రు కానీ.. ప్ర‌ధాని మోడీకి తెలుగోళ్లంటే కూసింత ఒళ్లు మంట‌గా అనిపించ‌క మాన‌దు. మిగిలిన రాష్ట్రాల విష‌యం ఎలా ఉన్నా.. రెండు తెలుగు రాష్ట్రాలు.. మ‌రీ ముఖ్యంగా ఆంధ్రప్ర‌దేశ్‌ కు సంబంధించిన ఏ ఇష్యూను తేల్చిన వైనం క‌నిపించ‌దు. ఏపీకి ఇచ్చిన హామీల అమ‌లుపైన ప్ర‌శ్నిస్తే.. మోడీ స‌ర్కారు స్పందించిన తీరు తెలిస్తే అవాక్కు అవ్వ‌క మాన‌రు.

అదెలానంటే.. పెద్ద‌న్న హోదాలో ఉన్న కేంద్రం.. ఏపీతో స‌హా దేశంలోని మిగిలిన రాష్ట్రాల‌తో ఏదో ఒక రీతిలో సాయం చేస్తూ ఉంటుంది. ఫ‌లానా రాష్ట్రానికి మీరెలా సాయం చేస్తున్నార‌ని కేంద్రాన్ని అడిగితే ఎలా స్పందించాలి? తాము ఏ విధంగా అయితే సాయం చేస్తున్నామో అది చెప్ప‌గ‌ల‌గాలి. కానీ.. ఏపీ విష‌యంలో కేంద్రం తీరు భిన్నంగా ఉంది.

ఏపీకి ఇచ్చిన హామీల్ని ఏ రీతిలో అమ‌లు చేస్తున్నారు? వాటికి సంబంధించిన నిధుల మాటేంటి? అన్న ప్ర‌శ్న‌కు బదులిస్తూ.. నీతి ఆయోగ్ అంటూ జ‌వాబిస్తున్నారు.

అయితే.. ఆ వివ‌రాలు అందించాల‌ని కేంద్రాన్ని కోరితే..వారి నుంచి చిత్ర‌మైన స‌మాధానం వ‌చ్చింది. నీతిఅయోగ్ నివేదిక త‌మ వ‌ద్ద లేద‌ని.. రాష్ట్రాల వ‌ద్ద ఉంటుంది కాబ‌ట్టి.. ఆ వివ‌రాలు ఇవ్వాలంటూ రివ‌ర్స్ లో స‌మాధానం ఇవ్వ‌టంతో మోడీ స‌ర్కారు తెలివికి మూర్చ‌బోయే పరిస్థితి. ఏపీ.. తెలంగాణ రాష్ట్రాల‌కు కేంద్రం ఇచ్చిన హ‌మీలు.. వాటి అమ‌లుకు సంబంధించిన వివ‌రాలు తెలీయ‌కుండా చేస్తున్న ప్ర‌య‌త్నాలు చూస్తుంటే.. మోడీ స‌ర్కారు ఇంత మూర్ఖంగా ఎందుకు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న‌ది పెద్ద ప్ర‌శ్న‌గా చెప్ప‌క త‌ప్పదు.

రాష్ట్రాల‌కు ఇచ్చిన హామీల అమ‌లు స్థితిగ‌తుల‌పై అధ్య‌య‌నం చేస్తున్న హోం శాఖ పార్ల‌మెంట‌రీ స్థాయి సంఘానికి సైతం కేంద్రం స‌మాచారం ఇవ్వ‌కుండా వ్య‌వ‌హ‌రిస్తున్న వైనంపై.. సంఘం ఛైర్మ‌న్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న మాజీ కేంద్ర మంత్రి చిదంబ‌రం మాష్టారికి చుక్క‌లు చూపిస్తున్నార‌ట‌. ఏ స‌మాచారం అడిగినా త‌మ వ‌ద్ద లేద‌ని చెప్పేస్తున్న తీరుతో ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ కొన్ని ప్ర‌శ్న‌ల్ని సంధించింది

అయితే.. వాటికి స‌మాధానం ఇవ్వ‌ని కేంద్రం.. ఉల్టాగా కొంద‌రు ఎంపీల‌కు వారి ద‌గ్గ‌ర స‌మాచారం ఉందా? అని ప్ర‌శ్నిస్తున్న తీరు చూస్తే.. త‌న ద‌గ్గ‌రి అధికార స‌మాచారాన్ని సైతం బ‌య‌ట‌పెట్ట‌టానికి మోడీ ప‌రివారం సిద్ధంగా లేద‌న్న విష‌యం స్పష్టం కాక మాన‌దు. ఇదంతా ఎందుకంటే.. తెలుగు రాష్ట్రాల‌కు.. అందునా ఏపీకి చేసిందేమీ లేదు. ఆ విష‌యాన్ని అధికారిక ప‌త్రాల్ని ఇవ్వ‌టం ద్వారా బ‌హిర్గతం అవుతుంది కాబ‌ట్టి.. దాన్ని క‌వ‌ర్ చేసేందుకే ఈ త‌ర‌హా విన్యాసాలు చేస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. ఇంత‌కీ రెండు తెలుగు రాష్ట్రాలు.. అందునా ఏపీ అంటే ఎందుకంత క‌సి మోడీ సాబ్‌?