Begin typing your search above and press return to search.

జగన్ కు మోదీ గ్రీటింగ్స్... ఏపీకి ఫుల్ సపోర్టేనట

By:  Tupaki Desk   |   30 May 2019 1:40 PM GMT
జగన్ కు మోదీ గ్రీటింగ్స్... ఏపీకి ఫుల్ సపోర్టేనట
X
నవ్యాంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా నేటి మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే పలు పార్టీల నేతలు జగన్ కు శుభాకాంక్షలు చెబుతూ ప్రకటనలు జారీ చేశారు. ఆ జాబితాలో ఇప్పుడు ప్రధానిగా కాసేపట్లో ప్రమాణం చేయనున్న నరేంద్ర మోదీ కూడా చేరారు. ఏపీకి సీఎంగా ప్రమాణం చేసిన జగన్ కు శుభాకాంక్షలు అంటూ మోదీ తన ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. జగన్ కు శుభాకాంక్షలు చెప్పడంతోనే సరిపెట్టని మోదీ... ఏపీకి తీపి కబురు కూడా చెప్పారు.

ఏపీకి కేంద్రం నుంచి పూర్తి స్థాయి మద్దతు ఉంటుందని కూడా మోదీ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. కేంద్రం నుంచి ఏపీకి అన్ని రకాల మద్దతు ఉంటుందని, జగన్ తో కలిసి పనిచేస్తూ ఏపీని సరికొత్త శిఖరాలకు చేరుస్తామని కూడా మెదీ ఆసక్తికర ప్రకటన చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో ప్రయాణం మొదలెట్టిన ఏపీని గడచిన ఐదేళ్లలో కొంచెం కూడా బాగు చేయలేకపోగా... మరింత అప్పుల్లో కూరుకుపోయేలా చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు సర్కారు వ్యవహరిస్తున్న ఒంటెత్తు పోకడల కారణంగానే కేంద్రం నుంచి ఏపీకి సరైన సహకారం అందించలేదన్న వాదన కూడా లేకపోలేదు. ఈ క్రమంలో జగన్ కు గ్రీటింగ్స్ చెబుతూ చేసిన ట్వీట్ లో... ఏపీకి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని, ఏపీ అభివృద్దికి జగన్ తో కలిసి పనిచేస్తామని మోదీ ప్రకటించడం నిజంగానే ఆసక్తి కలిగించే అంశమేనని చెప్పాలి.

ఇప్పటికే ఎన్నికల్లో గెలిచిన తరువాత డిల్లీ వెళ్లిన జగన్.. మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర పరిస్థితిపై ఓ నివేదిక అందించారు. అంతేకాకుండా కేంద్రం సహకారం లేకుండా ఏపీ అభివృద్ధి సాధ్యం కాదని కూడా మోదీకి జగన్ వివరించారు. ఈ నివేదికను తీసుకున్న మోదీ... ఏపీకి పూర్తిగా బాసటగా నిలుస్తామని జగన్ కు హామీ ఇచ్చారు. తాజాగా సీఎంగా ప్రమాణం చేసిన జగన్ కు గ్రీటింగ్స్ చెబుతూ చేసిన ట్వీట్ లోనూ ఏపీ అభివృద్ధి, కేంద్రం నుంచి రాష్ట్రానికి సహకారం వంటి అంశాలను ప్రస్తావించిన మోదీ... ఏపీ ప్రజల్లో నిజంగానే కొత్త ఆశలు రేకెత్తించారని చెప్పాలి.