Begin typing your search above and press return to search.

మోడీ దెబ్బ‌కు దేశంలో రియ‌ల్ ఎస్టేట్ డీలా!

By:  Tupaki Desk   |   26 Oct 2017 12:51 PM GMT
మోడీ దెబ్బ‌కు దేశంలో రియ‌ల్ ఎస్టేట్ డీలా!
X
రోజుల‌న్ని ఒక్క‌లా ఉండ‌వ‌ని ఊరికే అన‌లేదేమో. తాజాగా చోటు చేసుకుంటున్న ప‌రిణామాలు చూస్తే ఇది నిజమ‌నిపించ‌క మాన‌దు. కొద్ది వారాల కింద‌ట కూడా ప్ర‌ధాని మోడీకి తిరుగులేద‌ని.. ఆయ‌న దూసుకెళుతున్న తీరుపై బ‌ల‌మైన వాద‌న‌లు వినిపించాయి. అయితే..జీఎస్టీ పుణ్య‌మా అని మోడీపై వ్య‌తిరేక‌త మొద‌లుకావ‌టమే కాదు.. అంత‌కు ముందు వ‌ర‌కూ సూప‌ర్ అన్న పెద్ద‌నోట్ల ర‌ద్దు వ్య‌వ‌హారం కూడా ఇప్పుడు విమ‌ర్శ‌ల‌కు తెర తీసింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇటీవ‌ల కాలంలో బ‌య‌ట‌కు వ‌స్తున్న నివేదిక‌లు పెద్ద‌నోట్ల ర‌ద్దు.. జీఎస్టీ కార‌ణంగా చోటు చేసుకున్న న‌స్టాల గురించి బ‌య‌ట‌పెట్టేవిగా ఉండ‌టంతో మోడీని వేలెత్తి చూపించే వారి వాద‌న‌ల‌కు బ‌లం అంత‌కంత‌కూ పెరుగుతోంది. తాజాగా అలాంటి నివేదిక ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది.

జీఎస్టీ కార‌ణంగా దేశ వ్యాప్తంగా రియ‌ల్ ఎస్టేట్ రంగం భారీగా క్షీణ‌త‌కు గురైంద‌న్న విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. దీనికి తోడు కొత్త నిబంద‌న‌ల‌తో రూపొందించిన రెరా చ‌ట్టం కార‌ణంగా గృహాల విక్ర‌యాలు భారీగా ప‌డిపోయిన‌ట్లుగా ప్రాప్ టైగ‌ర్ డాట్ కామ్ తాజా అధ్య‌య‌నం వెల్ల‌డించింది. దేశంలోని తొమ్మిది ప్ర‌ధాన న‌గ‌రాల్లో ప్రాప‌ర్టీ మార్కెట్ డిమాండ్ త‌గ్గిందంటూ చెబుతున్నారు. మూడో త్రైమాసికంలో రియాల్టీ రంగంలో 18 శాతం క్షీణించింద‌ని స‌ద‌రు నివేదిక వెల్ల‌డించింది. ఈ రిపోర్ట్ పేర్కొన్న తొమ్మిది ప్ర‌ధాన న‌గ‌రాల్లో హైద‌రాబాద్ కూడా ఉండ‌టం గ‌మ‌నార్హం.

రెండో త్రైమాసికంలో దాదాపు 53 శాతం రియాల్టీ రంగం క్షీణించ‌గా.. మూడో త్రైమాసికంలోనూ ఇలాంటి ప‌రిస్థితే ఉంద‌ని వెల్ల‌డించింది. పుణే.. నోయిడా.. బెంగ‌ళూరు.. చెన్నై.. హైద‌రాబాద్‌.. కోల్ క‌తా.. అహ్మాదాబాద్ ల‌లో గృహ అమ్మ‌కాలు త‌గ్గ‌టంతో పాటు కొత్త ప్రాజెక్టులు షురూ కావ‌టం లేద‌ని పేర్కొంది. కొంత‌లో కొంత ముంబ‌యి.. గుర్ గావ్ ల‌లో మాత్రం పురోగ‌తి ఉన్న‌ట్లుగా వెల్ల‌డించింది. జీఎస్టీ అమ‌ల్లోకి వ‌చ్చిన త‌ర్వాత జులై.. ఆగ‌స్టుల‌తో పోలిస్తే పండ‌గ సీజ‌న్ అయిన సెప్టెంబ‌రులో అమ్మ‌కాలు కాస్త మెరుగుద‌ల క‌నిపించింద‌ని స‌ద‌రు నివేదిక వెల్ల‌డించింది.

దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో రియాల్టీ ఎంత‌గా నీర‌స‌ప‌డింద‌న్న విష‌యాన్ని గ‌ణాంకాల రూపంలో ప్ర‌క‌టించింది. జులై- సెప్టెంబ‌రు త్రైమాసికంలో అహ్మాదాబాద్ లో 46 శాతం క్షీణ‌త న‌మోదు కాగా.. బెంగ‌ళూరులో 27 శాతం.. చెన్నైలో 23 శాతం.. కోల్ క‌తాలో 21 శాతం.. హైద‌రాబాద్ లో 18 శాతం మేర త‌గ్గిన‌ట్లుగా పేర్కొంది. ఇక‌.. గుర్ గావ్ లో 60 శాతం వృద్ధి రేటును న‌మోదు చేయ‌గా.. ముంబ‌యిలో మాత్రం కేవ‌లం ఆరు శాతం మాత్ర‌మే వృద్ధి ఉన్న‌ట్లు పేర్కొంది. మోడీ స‌ర్కారు ఎఫెక్ట్ రియాల్టీ రంగం మీద ఎంత బాగా ప‌డింద‌న్న విష‌యం తాజా నివేదిక స్ప‌ష్టం చేసింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.