Begin typing your search above and press return to search.

చెప్పిన‌ట్లే.. గంట‌లోపే మోడీ స్పీచ్ ముగిసింది

By:  Tupaki Desk   |   15 Aug 2017 2:31 PM IST
చెప్పిన‌ట్లే.. గంట‌లోపే మోడీ స్పీచ్ ముగిసింది
X
స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌కోట ద‌గ్గ‌ర జెండా ఎగుర‌వేసిన త‌ర్వాత‌.. జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించ‌టం మామూలే. స‌మ‌కాలీన భార‌తంలోని ప్ర‌ధానుల‌కు భిన్నంగా వ్య‌వ‌హ‌రించ‌టం ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి అల‌వాటే. ఈసారి త‌న ప్ర‌సంగం గంట మాత్ర‌మే ఉంటుంద‌ని చెప్పిన ఆయ‌న‌.. అందుకు త‌గ్గ‌ట్లే కేవ‌లం 54 నిమిషాల వ్య‌వ‌ధిలోనే త‌న ప్ర‌సంగాన్ని ముగించ‌టం ఈసారి ప్ర‌త్యేక‌త‌గా చెప్పాలి.

71వ స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక‌ల్ని పుర‌స్క‌రించుకొని మాట్లాడిన ఆయ‌న ప్ర‌సంగం త‌క్కువ వ్య‌వ‌ధిలోనే ముగిసింది. 2014లో ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన ఆయ‌న‌.. గ‌డిచిన మూడేళ్ల‌తో పోలిస్తే.. ఈసారి ప్ర‌సంగం త‌క్కువ స‌మ‌యానికే ముగిసింది. మోడీ మాన‌స పుత్రిక అయిన మ‌న్ కీ బాత్ కార్య‌క్ర‌మంలో భాగంగా.. ఎర్ర‌కోట మీద నుంచి జ‌న‌వాణిని వినిపిస్తాన‌ని.. తాను ప్ర‌స్తావించాల్సిన అంశాల్ని త‌న‌కు పంపాలంటూ ఆయ‌న స్వ‌యంగా కోరారు. ఇందులో భాగంగా ఆయ‌న‌కు వేలాది మంది స్పందించి సూచ‌న‌లు చేశారు.

వాటిని ఒక కూర్పు చేసిన మోడీ.. త‌న ప్ర‌సంగాన్ని త‌యారు చేయించిన‌ట్లుగా తెలుస్తోంది. ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చిన సూచ‌న‌ల్లో ఎక్కువ స‌మ‌యాన్ని తీసుకోవ‌టాన్ని త‌ప్పు ప‌ట్టారు. దీంతో.. ఈసారి త‌న ప్ర‌సంగాన్ని గంట కంటే త‌క్కువ వ్య‌వ‌ధిలోనే ముగిస్తాన‌ని హామీ ఇచ్చారు. ఇందుకు త‌గ్గ‌ట్లే ఆయ‌న ప్ర‌సంగం సాగింది. స్వాతంత్ర్య దినోవ‌త్స‌వం సంద‌ర్భంగా ప్ర‌ధాని మోడీ చేసిన ప్ర‌సంగాల్ని చూస్తే.. 2014లో ఆయ‌న 65 నిమిషాలు ప్ర‌సంగిస్తే.. 2015లో 86నిమిషాలు.. గ‌త ఏడాది (2016) ఏకంగా 94 నిమిషాల పాటు ప్ర‌సంగించారు. మ‌రీ.. ఇంత సుదీర్ఘ ప్ర‌సంగ‌మా? అన్న ప్ర‌శ్న‌తో ఆయ‌న త‌న ప్ర‌సంగాన్ని గంట కంటే త‌క్కువ వ్య‌వ‌ధిలోనే పూర్తి చేశారు.

ఎర్ర‌కోట నుంచి ప్ర‌సంగించిన ప్ర‌ధాని.. పేద‌ల్ని దోచుకున్న వారికి కంటి మీద క‌నుకు లేకుండా చేస్తాన‌ని వ్యాఖ్యానించారు. నిజాయితీప‌రుల‌కు అండ‌గా నిలుస్తామ‌న్నారు. ఉగ్ర‌వాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేస్తాన‌ని.. జ‌మ్ముకాశ్మీర్ అభివృద్ధికి కేంద్రం క‌ట్టుబ‌డి ఉంద‌న్నారు. నోట్ల ర‌ద్దుకు దేశం మొత్తం త‌న మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింద‌న్న మోడీ.. ట్రిపుల్ త‌లాక్ తో ముస్లిం మ‌హిళ‌ల‌కు అన్యాయం జ‌రుగుతుంద‌న్నారు.

రూ.2ల‌క్ష‌ల కోట్ల న‌ల్ల‌ధ‌నం బ్యాంకుల్లో ఉంద‌ని.. ఆ న‌ల్ల‌ధ‌నాన్ని బ‌య‌ట‌కు తీస్తామ‌న్నారు. నోట్ల ర‌ద్దు త‌ర్వాత రూ.3కోట్ల న‌గ‌దు బ్యాంకుల్లో జ‌మ అయ్యింద‌ని.. ఐటీ రిట‌ర్న్స్ దాఖ‌లు చేసే వారి సంఖ్య పెరిగింద‌న్నారు. అవినీతిని అంతం చేయ‌టంలో నోట్ల ర‌ద్దు సాయం చేసింద‌న్నారు. నోట్ల ర‌ద్దు త‌ర్వాత మూడు ల‌క్ష‌ల డొల్ల కంపెనీలు బ‌య‌ట‌ప‌డిన‌ట్లు చెప్పారు. గోర‌ఖ్ పూర్ ఆసుప‌త్రిలో శిశువుల మ‌ర‌ణాలు బాధాక‌ర‌మ‌న్న మోడీ.. న‌వ భార‌త్ నిర్మాణానికి అంద‌రం కృషి చేయాల‌న్నారు.

ఆర్మీ.. ఎయిర్ ఫోర్స్‌.. పోలీసు సేవ‌లు ఆమోఘ‌మ‌న్న మోడీ.. జీఎస్టీతో కొత్త చ‌రిత్ర సృష్టించామ‌న్నారు. జీఎస్టీ ప‌న్నుల విధానానికి ప్ర‌జ‌ల ఆమోదం వ్య‌క్త‌మైంద‌న్నారు. ఉగ్ర‌వాదంపై పోరులో ప్ర‌పంచ దేశాలకు మ‌ద్ద‌తు ఇస్తామ‌న్నారు. దేశం అన్ని రంగాల్లోనూ వృద్ధి చెందుతోంద‌న్నారు. కాశ్మీర్ వేర్పాటువాదాన్ని తిప్పి కొడ‌తామ‌న్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధికి అనేక అవ‌కాశాలు ఉన్న‌ట్లు చెప్పారు. ప్ర‌కృతి వైప‌రీత్యాల ప‌ట్ల అప్ర‌మ‌త్తంగాఉండాల‌న్నారు. వ‌ర‌ద‌ల కార‌ణంగా దేశం భారీగా న‌ష్ట‌పోయింద‌న్నారు. 2022 నాటికి న‌వ‌భార‌తాన్ని నిర్మిద్దామ‌ని పిలుపునిచ్చారు.